- సాంకేతికంగా అనుకూలంగా ఉన్నచోటే లిఫ్ట్ ప్రాజెక్టులు కడతామన్న మంత్రి
- యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ
- పెద్దపల్లిలో రివ్యూ చేసిన మినిస్టర్
పెద్దపల్లి/సుల్తానాబాద్/ గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులు మాత్రమే అవుతుందని, కానీ, నాలుగేండ్లు గడిచినట్టు..హామీలు అమలు పరచడం లేదన్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడం బాధాకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం పెద్దపల్లి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రివ్యూ నిర్వహించారు. అంతకుముందు ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణంలో భాగంగా 10 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చామని, మిగిలిన గ్యారంటీలు త్వరలోనే అమలుచేసి తీరుతామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తామన్నారు.
సాంకేతికంగా అనుకూలంగా ఉన్న చోటే లిఫ్టు ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా అధికారుల కోసం రిక్రియేషన్ క్లబ్ చేస్తామని, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, అరుణ శ్రీ, సర్పంచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లా మార్పుపై ఎమ్మెల్సీ , మినిస్టర్ఆసక్తికర వ్యాఖ్యలు
సుల్తానాబాద్ : ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా ఆయనకు, బీఆర్ఎస్కు చెందిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి జిల్లాను మారిస్తే తానే ముందుండి ఉద్యమిస్తానని ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు వేదికపై మాట్లాడారు. తర్వాత మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ‘ఆ అవకాశం మీకు ఇవ్వం’ అని కొట్టి పడేశారు. గత ప్రభుత్వం కలెక్టరేట్లు నిర్మించినప్పటికీ, అందులో ఉద్యోగులు లేక ప్రజలకు ఎలాంటి సేవలు అందలేదని, తమ ప్రభుత్వం త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం శ్రీధర్ బాబు అవుతారని ఆశించానని, భవిష్యత్‌లోనైనా అవుతారని భానుప్రసాద్ రావు అనడం కోసం మెరుపు.