- టాప్ ప్లేస్‌లో ఉక్రెయిన్
- ఆరో ప్లేస్‌లో అమెరికా
వెలుగు బిజినెస్ డెస్క్: మన దేశంలోని 7.3 శాతం మందికి క్రిప్టో కరెన్సీ ఎసెట్లు ఉన్నట్లు తేలింది. కొవిడ్–19 టైములో ఎవరూ ఊహించనంత వేగంగా క్రిప్టో వినియోగం గ్లోబల్‌గా పెరిగినట్లు యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన ఈ రిపోర్టు వెల్లడించింది. 2021లో ప్రపంచంలోని 15 డెవలపింగ్ ఎకానమీలు క్రిప్టో కరెన్సీ ఎసెట్ల విషయంలో ముందున్నట్లు తేల్చింది. డెవలపింగ్ ఎకానమీలలోని ప్రజల చేతిలో ఉన్న క్రిప్టో కరెన్సీ ఎసెట్ల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించారు. ఉక్రెయిన్ ఈ జాబితాలో 12.7 శాతంతో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత 11.9 శాతంతో రష్యా, 10.3 శాతంతో వెనిజులా, 9.4 శాతంతో సింగపూర్, 8.5 శాతంతో కెన్యా, 8.3 శాతంతో అమెరికాలు నిలుస్తున్నట్లు పేర్కొంది.
మన దేశానికి వస్తే 7.3 శాతం మంది క్రిప్టో కరెన్సీ ఎసెట్లు సమకూర్చుకున్నట్లు యూఎన్ అనుబంధ సంస్థ అన్క్టాడ్ రిపోర్టు తెలిపింది. డిజిటల్ కరెన్సీ ఎసెట్ల విషయంలో టాప్ 20 గ్లోబల్ ఎకానమీలలో ఇండియా 7వ ప్లేస్‌లో నిలుస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్మహమ్మారి వ్యాపించిన టైములో ప్రపంచంలోని డెవలపింగ్ ఎకానమీలలో క్రిప్టో కరెన్సీ జోరందుకున్నట్లు ఈ రిపోర్టు వివరించింది. కొంత మందికి ఈ డిజిటల్ కరెన్సీ ఎసెట్లు ప్రయోజనం చేకూర్చాయని చెబుతూ, రెమిటెన్స్లకూ సాయపడ్డాయని పేర్కొంది. కానీ, ఈ డిజిటల్ కరెన్సీ ఎసెట్లు స్థిరమైనవి కాదని, వాటి వల్ల సోషల్ రిస్క్లతోపాటు ఇతర రిస్క్‌లూ ఉన్నాయని వెల్లడించింది.
మెరిసేదంతా బంగారం కాదు...
మెరిసేదంతా బంగారం కాదని ఈ సందర్భంగా అన్క్టాడ్ కామెంట్ చేయడం విశేషం. అన్క్టాడ్ ఈ అంశంపై మొత్తం మూడు పాలసీ బ్రీఫ్లను పబ్లిష్ చేసింది. ఎలాంటి నియంత్రణా లేకుండా క్రిప్టో కరెన్సీలను వదిలి వేయడంపైనా ఈ రిపోర్టు దృష్టి పెట్టింది. దీని వల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రస్తావించింది. క్రిప్టో కరెన్సీ ఎసెట్లపై ఎందుకు మొగ్గు పెరుగుతోందనే దానిపైనా ఫోకస్ పెట్టింది. ఒక దేశం నుంచి మరో దేశానికి రెమిటెన్స్‌లు, కరెన్సీ, ఇన్‌ఫ్లేషన్ రిస్క్‌లకు హెడ్జ్‌గా క్రిప్టో కరెన్సీల వైపు మళ్లుతున్నారని అన్క్టాడ్ రిపోర్టు వెల్లడించింది.
మార్కెట్ రిస్కులు....
ఇటీవలి కాలంలో క్రిప్టో మార్కెట్లో రిస్కులు పెరిగాయని చెబుతూ, క్రిప్టోలను హోల్డ్ చేయడంలోనూ రిస్క్ఉందని రిపోర్టు వివరించింది. ఇవన్నీ ప్రైవేటు రిస్కులని, ఒకసారి సెంట్రల్ బ్యాంకులు నియంత్రణకు పూనుకుంటే అప్పుడు పబ్లిక్ సమస్యగా మారుతుందని అభిప్రాయపడింది. ఒకవేళ క్రిప్టో కరెన్సీలు బాగా ఊపందుకుని అన్ని పేమెంట్లకు వాటినే దేశీయ కరెన్సీల ప్లేస్‌లో వాడొచ్చని, అలా జరిగితే దేశపు మానిటరీ సావరినిటీ (అంటే ద్రవ్యపరమైన సార్వభౌమత్వం) దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపింది. డిమాండ్‌కు తగినంతగా రిజర్వ్ కరెన్సీ అందుబాటులో లేని డెవలపింగ్ ఎకానమీలలో స్టేబుల్ కాయిన్స్కొన్ని రిస్కులను తెచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది. ఈ కారణంగానే అధికారిక కరెన్సీకి సవాళ్లు ఎదురవుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఇప్పటికే వెల్లడించినట్లు అన్క్టాడ్ ఈ రిపోర్టులో పేర్కొంది.
డిజిటల్ పేమెంట్లతో క్రిప్టో జోష్ తగ్గొచ్చు...
దేశీయంగా ప్రజలు తమ చెల్లింపుల అవసరాలు నెరవేర్చుకోవడానికి తగిన డిజిటల్ పేమెంట్ పద్ధతులు ఉంటే, డెవలపింగ్ ఎకానమీలలో కొంత మేరకు క్రిప్టో కరెన్సీకి ఆదరణ తగ్గుతుందని అన్క్టాడ్ తెలిపింది. దేశ అవసరాలు, సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తేవడమో లేదా వేగంగా జరిగే రిటెయిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయాలని సూచించింది. డెవలపింగ్ ఎకానమీలలో డిజిటల్ డివైడ్ రిస్క్ కూడా ఎక్కువవుతోందని, కాబట్టి నగదు జారీ, పంపిణీలను సమర్ధంగా నిర్వహించాలని అథారిటీస్‌కు సూచించింది. రెమిటెన్స్‌లను క్రిప్టో కరెన్సీలు ఈజీ చేసినా, పన్ను ఎగవేతలు, అక్రమ ఫండ్స్బదిలీలు పెరుగుతాయని కూడా వివరించింది.
కట్టడి చేయండి...
ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వివిధ దేశాలకు అన్క్టాడ్ సూచించింది. అవసరమైతే ఇందుకోసం సమగ్రమైన చట్టాలను తేవాలని పేర్కొంది. క్రిప్టో ఎక్స్చేంజీల రెగ్యులేషన్‌కు, డిజిటల్ వాలెట్లు, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సంబంధ చట్టాలు తెస్తే బెటరని తెలిపింది. రెగ్యులేటరీ పరిధిలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఈ క్రిప్టో కరెన్సీలను హోల్డ్ చేయకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసేందుకు తెచ్చే అడ్వర్టయిజ్మెంట్లపైనా నియంత్రణ
అవసరమని స్పష్టం చేసింది.
యూఎస్ ఇన్‌ఫ్లేషన్ తగ్గడంతో క్రిప్టో మార్కెట్‌లో కూడా సందడి నెలకొంది. బిట్‌కాయిన్, ఇథీరియం వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు గురువారం ర్యాలీ చేశాయి. బిట్‌కాయిన్ 7 శాతం పెరిగి 24,500 డాలర్లను క్రాస్ చేసింది. ఇథీరియం 13 శాతం ఎగిసి 1,900 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బీఎన్‌బీ 5 శాతం పెరగగా, కార్డానో, ఎక్స్‌ఆర్‌పీ కరెన్సీలు కూడా 5 శాతం చొప్పున లాభపడ్డాయి. పోల్కడాట్, సోలానా క్రిప్టో కరెన్సీలు 10 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ గత 24 గంటల్లో 6.49 శాతం పెరిగి 1.15 ట్రిలియన్ డాలర్ల (రూ. 90 లక్షల కోట్ల) మార్క్‌ను క్రాస్ చేసింది. క్రిప్టో ఎక్స్చేంజిల్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో గ్లోబల్‌గా ట్రేడింగ్ వాల్యూమ్స్ 29 శాతం ఎగిసి 87.71 బిలియన్ డాలర్ల (రూ. 7 లక్షల కోట్ల) కు చేరుకున్నాయి.