హైదరాబాద్లో భారీ వరదలకు నాలుగేండ్లు

హైదరాబాద్లో భారీ వరదలకు నాలుగేండ్లు
  •  2020 అక్టోబర్​లో మునిగిన వెయ్యి కాలనీలు
  • 100 మంది మృతి.. రూ.5 వేల కోట్ల ఆస్తి నష్టం
  • నెల పాటు ఇబ్బందులు పడ్డ సిటీ జనం
  • ఇప్పుడు అదే స్థాయిలో వాన పడితే సేమ్​సీన్ రిపీటయ్యే చాన్స్
  • పదేండ్ల పాలనలో 31 నాలాలు మాత్రమే నిర్మించిన బీఆర్ఎస్​ 
  • రూ.5,135 కోట్లతో 415 నాలాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్​​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: అది 2020 అక్టోబర్ నెల.. 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు కురిసిన అతి భారీ వర్షాలకు గ్రేటర్​లోని దాదాపు వెయ్యికాలనీలను వరద ముంచెత్తింది. 300 కాలనీల్లోని జనాలు నెల వరకు కోలుకోలేదు. కాలనీలు, బస్తీలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 రోజుల పాటు బోట్ల ద్వారా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

 దాదాపు వంద మంది మరణించగా, దాదాపు 5వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. స్పందించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీకి వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా స్టాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రాగ్రాం(ఎస్ఎన్డీపీ) కింద ఫస్ట్ ఫేజ్ లో రూ. 737.45 కోట్లతో కేవలం 37 నాలాలు నిర్మించాలని ప్లాన్ చేసింది. 

ఇందులో 31 నాలాలను పూర్తి చేయగలిగినా, చాలామంటుకు భారీ వరదలు వచ్చిన ప్రాంతాల్లో కాకుండా ట్రాఫిక్ సమస్య ఉన్న కొన్ని మెయిన్​రోడ్లపైనే నిర్మించింది. తర్వాత సెకండ్ ఫేజ్‌కు పర్మిషన్లు ఇస్తారని చూసినా ఫలితం లేకుండా పోయింది. 

8 నుంచి 10 సెంటీమీటర్లు పడితే ఆగమే

2020 ఘటన జరిగి సరిగ్గా నాలుగేండ్లవుతోంది. సిటీలో ఇప్పుడు నాలాలు లేకపోవడం, ఉన్న వాటిల్లోంచి నీరు సరిగ్గా వెళ్లకపోవడంతో సిటీలో 8 నుంచి 10 సెంటిమీటర్ల వాన పడితే చాలు కాలనీలు, బస్తీలు నీట మునిగే పరిస్థితి ఉంది. ఏకధాటిగా నాలుగైదు గంటలు వాన పడితే ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలైతే బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు ఇంట్లోని వస్తువులు పైన పెట్టుకుంటున్నారు. 

గాజుల రామారంలో మూడు కాలనీల్లో ఏండ్లుగా ఈ సమస్య ఉండగా ఇంకా పరిష్కారం కాలేదు. మల్కాజిగిరిలోని సఫిల్ కాలనీలోనూ నాలాలు చిన్నగా ఉండడంతో పూర్తిగా కాలనీల్లోంచి నీరు ప్రవహిస్తోంది. చిన్నపాటి వాన పడితే గ్రౌండ్ ఫ్లోర్లలో ఉండేవాళ్లు తమ ఇంట్లోని ఎలక్ర్టానిక్ వస్తువులను ఫస్ట్ ఫ్లోర్​లోకి షిఫ్ట్ చేసుకుంటున్నారు. నాగోల్​లోని అయ్యప్ప కాలనీ, ఓయూ కాలనీ, టోలిచౌకి నదీం కాలనీ, బేగంపేట మయూరిమార్గ్ తదితర ప్రాంతాల్లోని జనాలు కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. 

కాంగ్రెస్​సర్కారు వచ్చాక..

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్​ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిన ఆరు నాలాల్లో నాలుగు కంప్లీట్​చేసింది. మరో రెండు నాలాల పనులు కొనసాగుతున్నాయి. అలాగే రూ.5,135 కోట్లతో సెకండ్ ఫేజ్ లో 415 నాలాల పనులు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మూడు ఫేజ్​లుగా కొనసాగే ఈ పనులు పూర్తయితే నగరవాసులకు శాశ్వతంగా వరద ముంపు తప్పే అవకాశం ఉంటుంది. 

హైడ్రా రాకతో... 

హైడ్రా రాకతో కూడా చాలాచోట్ల వరదలకు చెక్ పడే అవకాశముంది. గతంలో గొలుసుకట్టు చెరువుల సర్ ప్లస్ వాటర్ సాఫీగా వెళ్లకపోవడతో వందలాది కాలనీలు మునిగాయి. చెరువు కట్టలు తెగి కాలనీల్లోకి నీరు వచ్చింది. 2020లో వరదలు వచ్చిన సమయంలో బాలాపూర్ గుర్రం చెరువుకట్ట తెగిపోవడంతో ఉప్పుగూడ, సాయిబాబానగర్, శివాజీనగర్, బాబానగర్ బస్తీల్లో వరద బీభత్సం సృష్టించింది.

 రాజేంద్రనగర్ పల్లె చెరువు కట్ట కూడా తెగిపోవడంతో బాబానగర్‌, ఫలక్​నుమా అల్​జుబైర్​ కాలనీ, బండ్లగూడ అలీనగర్, సుభాన్​నగర్, కింగ్స్​కాలనీ ఇలా వందల కాలనీలు10 ఫీట్ల మేర మునిగాయి. హైడ్రా రాకతో చెరువుల ఎఫ్టీఎల్​లో ఆక్రమణలు కూల్చేస్తున్నారు. ఇది కొనసాగితే చెరువల్లోని నీళ్లు సాఫీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు నాలాలపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టడంతో వాటిపై ఆక్రమణలకు కూడా చెక్​పడే అవకాశం ఉంది.