కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు: వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. వారం రోజులుగా ముసురుపట్టడం, పరిసరాలు చిత్తడిగా మారడం, దోమలు విజృంభిస్తుండడం, వాతావరణ మార్పులతో ప్రజలు విషజ్వరాలు, దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. జ్వర పీడితుల రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, డెంగీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఏజెన్సీ ఏరియాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దీంతో ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానలు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా దవాఖానలకు రోజూ ఓపీకి 700 నుంచి వెయ్యి మందికిపైగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లు వస్తుండగా..వీరిలో ఎక్కువగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వాళ్లే ఎక్కువ. ముసురు పెట్టినట్లు వర్షం కురవడం, పారిశుధ్య నిర్వహణలోపం, దోమలు, ఈగల కారణంగానే విషజ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తుండడంతో వైద్యారోగ్య శాఖ ఏఎన్ఎంలతో ఇంటింటి సర్వే చేపట్టింది.
ఆందోళన కలిగిస్తున్న డెంగ్యూ కేసులు
రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యూ కేసులు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ..ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులతో భవిష్యత్ లో కేసులు పెరిగే ప్రమాదముందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ నెలలో రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో 75 డెంగీ కేసులను నిర్ధారించగా, కరీంనగర్ జిల్లాలో 57, మహబూబ్ నగర్ జిల్లాలో 54, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46, నిజామాబాద్ లో 41, ఆదిలాబాద్ జిల్లాలో 25, ఖమ్మంలో 20, జనగామలో 19, హన్మకొండలో 15, నిర్మల్ జిల్లాలో 12, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో 8 చొప్పున, వరంగల్ జిల్లాలో 6, సంగారెడ్డిలో 5, మెదక్ జిల్లాలో 4, అసిఫాబాద్ జిల్లాలో 2, సిద్ధిపేటలో కొటి నమోదైంది.
వైరల్ ఫీవర్సే ఎక్కువ..
రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్‌కు ఓపీకి వస్తున్న పేషెంట్లలో వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నవారే ఎక్కువ. మెదక్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు వివిధ అనారోగ్య సమస్యలతో ప్రతిరోజూ 500 మంది వరకు ఔట్ పేషెంట్లు వచ్చేవారు. కొద్ది రోజులుగా ఈ సంఖ్య సుమారు 600 వరకు ఉంటోంది. ఇందులో వైరల్ ఫీవర్ బాధితులే సుమారు 100 మంది వరకు ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. శుక్రవారం వచ్చిన పేషెంట్లలో 12 మంది టైఫాయిడ్, 52 మంది వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
డెంగ్యూతో ఒకరు మృతి
భద్రాచలం : డెంగ్యూతో శుక్రవారం భద్రాచలం ఏరియా దవాఖానలో ఒకరు చనిపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లికి చెందిన వి.వెంకటేశ్వర్లు (32) మూడు రోజుల క్రితం డెంగ్యూ లక్షణాలతో ఏరియా దవాఖానలో చేరాడు. పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య, నలుగురు పిల్లలున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలల్లో జిల్లావ్యాప్తంగా 3,500 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. పీహెచ్ సీల్లో పది రోజులుగా 50 నుంచి 60 మంది వరకు ఓపీకి వస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో 25 మంది మలే రియా బారిన పడ్డారు. ఈ నెలలో 931 మంది వైరల్ ఫీవర్, ఇతర జ్వరాలతో జిల్లా కేంద్ర దవాఖానలో ఇన్ పేషెంట్లుగా చేరారు.
పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్ ప్రధాన దవాఖానల్లో వైరల్ ఫీవర్‌తో రోజూ 300 పైచిలుకు పేషెంట్లు ఓపీకి వస్తున్నారు. ఇందులో ఇద్దరిని డెంగ్యూ అనుమానంతో కరీంనగర్ పంపారు.
సంగారెడ్డి జిల్లా సివిల్ దవాఖానలో నాలుగు రోజులుగా రోజూ 850 మంది పేషెంట్లు వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది జ్వర పీడితులే.
ఖమ్మం జిల్లాలో రెండు వారాలుగా సగటున రోజుకు 1300 నుంచి 1400 మంది వరకు జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఓపీకి వస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు 180 నుంచి 200 వరకు ఉంటుండగా, 80 మంది వరకు ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జనరల్ హాస్పిటల్ కు పది రోజుల్లో చిల్డ్రన్ వార్డుకు 568 ఫీవర్ కేసులు రాగా.. 93 మంది ఇన్ పేషెంట్లుగా జాయిన్ అయ్యారు. జనరల్ మెడిసిన్ లో ఫీవర్ కేసుల ఓపీ 428 నమోదు కాగా.. ఇందులో ఇన్ పేషెంట్లుగా 58 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 7 చికున్ గున్యా కేసులు నమోదుకాగా, మిడ్జిల్ మండలంలోనే ఐదు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని పీహెచ్సీ నుంచి జిల్లా దవాఖాన వరకు కలిపి ఓపీ సగటున రోజుకు 4,500 ఉంటోంది. ఈ నెలలో వైరల్ జ్వరాలతో బాధపడుతున్న 273 మందికి ఇన్ పేషెంట్లుగా ట్రీట్మెంట్ ఇచ్చారు.
సిరిసిల్ల జిల్లా ఏరియా దవాఖానలో శుక్రవారం 590 మంది చూపించుకోగా, వేములవాడ దవాఖానలో 569 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగనికి పైగా జ్వరం కేసులే .
ఆసిఫాబాద్‌లోని సీహెచ్ సీలో రోజూ 300 నుంచి 350 వరకు ఓపీ ఉంటోంది. పీహెచ్ సీ ల్లో 30 నుంచి 50 వరకు ఓపీ నమోదవుతోంది. ఈ నెలలో వైరల్ ఫీవర్స్ 996, మలేరియా 16 నమోదయ్యాయి.
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు రోజూ వెయ్యి మంది వరకు ఓపీకి వస్తున్నారు. గురువారం 706 మంది పేషెంట్లు ఓపీలో చూపించుకోగా.. శుక్రవారం 682 మంది పేషెంట్లు వచ్చారు. సర్వేలో రోజూ 100 నుంచి 200 మంది జ్వర పీడితులను గుర్తిస్తున్నారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 45 మలేరియా కేసులు నమోదుకాగా, ఈ నెలలో 13 కేసులను నిర్ధారించారు. వైరల్ ఫీవర్లకు కొదువ లేదు. కొత్తగూడెంలోని జిల్లా జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓపీ రోజుకు 700 దాటుతోంది.
జనగామ జిల్లా జనరల్ హాస్పిటల్లో ఈ సీజన్ లో ప్రతిరోజు 450 నుంచి 500 వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. శుక్రవారం 498 మంది ఔట్ పేషెంట్లు రాగా 34 మంది అడ్మిట్ అయ్యారు. సగం మంది జ్వర బాధితులే. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 5 మలేరియా కేసులు నమోదయ్యాయి.
వనపర్తి జిల్లా కేంద్ర దవాఖానలో నాలుగు రోజులుగా 400 మంది చొప్పున ఓపీ చూస్తున్నారు. వైరల్ ఫీవర్ బాధితులే ఎక్కువ.
యాదాద్రి భువనగిరి జిల్లా దవాఖానలో ప్రతి రోజు 400 నుంచి 500 వరకూ ఓపీ చూస్తున్నారు. జిల్లాలోని మూడు సీహెచ్ సీల్లో ప్రతి రోజు 400 నుంచి 500 ఓపీ నమోదవుతోంది.
వరంగల్ జిల్లాలో ఈ నెలలో ఇప్పటివరకు 1,826 మంది జ్వరాల బారినపడ్డారు. ఎంజీఎంకు జ్వరాలతో వస్తున్న వారిసంఖ్య పెరుగుతోంది. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.