ఇతర దేశాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ
పెద్ద ఎత్తున విస్తరిస్తున్న ఏఐ ఇండస్ట్రీ
వెల్లడించిన నాస్కామ్, బోస్టన్ స్టడీ రిపోర్ట్
ముంబై: ఇతర దేశాల కంటే భారతదేశంలో మూడు రెట్లు ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ-) నైపుణ్యం కలిగిన ప్రతిభ ఉందని వెల్లడయింది. ఈ టాలెంట్ పూల్ 2027 నాటికి ఏడాదికి 15శాతం చొప్పున వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధించగలదని నాస్కామ్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ స్టడీ రిపోర్ట్ పేర్కొంది. మనదేశంలో ఏఐ పరిశ్రమ గణనీయంగా విస్తరించనుంది. ఇది ఏటా 25–-35శాతం పెరుగుతుందని ‘ఏఐ పవర్డ్ టెక్’ పేరుతో ఈ కంపెనీ విడుదల చేసిన రిపోర్ట్ అంచనా వేసింది.
దీని ప్రకారం మనదేశంలో ఇప్పుడు 4.20 లక్షల మంది ఉద్యోగులు వివిధ ఏఐ జాబ్స్ చేస్తున్నారు. గత ఏడు సంవత్సరాల్లో ఏఐ ట్యాలెంట్లో 14 రెట్ల వృద్ధిని సాధించిన మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఉంది. అనేక ప్రముఖ సంస్థలు ఏఐ సంబంధిత టెక్నాలజీలో ఉద్యోగులను పెంచడానికి, వారికి స్కిల్స్ నేర్పించడానికి భారీగా పెట్టుబడి పెట్టాయి.
ఇందుకోసం రాబోయే మూడేళ్లలో బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టనున్నాయి. జనరేటివ్ ఏఐ రావడంతో భారతీయ టెక్ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోలను విస్తరించాయని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయానీ ఘోష్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ఏఐలో పెట్టుబడులు 2019 నుంచి 24శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకెళ్లాయి.
2023లోనే 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ పెట్టుబడులలో ఎక్కువ భాగం డేటా అనలిటిక్స్, జెన్ఏఐ, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు, ప్లాట్‌ఫారమ్‌లలోని ఏఐ అప్లికేషన్‌ల కోసం ఖర్చుపెట్టారు. భారతీయ కంపెనీలు ఏఐ వృద్ధికి అనుగుణంగా దూసుకుపోతున్నాయని బీసీజీ ఎండీ, సీనియర్ పార్ట్నర్ రాజీవ్ గుప్తా అన్నారు.