నిజ జీవితంలో తగ్గాల్సిందే!

నిజ జీవితంలో తగ్గాల్సిందే!

‘ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’.. కొన్నాళ్ల కింద వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్ ఇది.  తెలిసో, తెలియకో ఒక తప్పు జరిగినప్పుడు, దాంట్లో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. మన ప్రమేయం ఉన్నప్పుడు నైతికత చూపాలి. హుందాగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆ ఘటనను ఒప్పుకొనే ధైర్యం కావాలి. ఇవేవీ  అల్లు అర్జున్​లో  కనిపించలేదు.  

డిసెంబర్ 4న రాత్రి 10 గంటలకు సంధ్య థియేటర్​లో జరిగిన దురదృష్టకర ఘటనలో  అభిమాని రేవతి ప్రాణం కోల్పోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్  ఇరవై రోజులుగా చావుతో పోరాడుతున్నాడు.  ఈ హృదయ విదారక ఘటనను ప్రత్యక్షంగా చూసిన పోలీస్ అధికారులే  బాధతో ఆవేదన చెందుతున్నారు. యావత్ సమాజం కన్నీరు కార్చింది.  ఆ నటుడి నుంచి ప్రజలు ఆశించినంతగా  పశ్చాత్తాపం కనిపించకపోవడం దురదృష్టకరం.


తగ్గాల్సిన చోట తలవంచి క్షమాపణలు చెప్పాలి. తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి తప్ప తుంచుకోవద్దు. థియేటర్ ఘటనను తను ఏ కోణంలో చూస్తున్నాడో.. దాంట్లో తన ప్రత్యక్ష, పరోక్ష పరంగా కొంతైనా ప్రమేయాన్ని  అంత బాహాటంగా తిరస్కరించడం సభ్య సమాజానికి  మంచి మెసేజ్ ఇవ్వలేకపోతున్నాడనే చర్చ అంతటా ఉంది.  నిజానికి ఆ ఘటనను ఆయన చేయాలని చేసింది కాదు.  కావాలని చేశారని కూడా అనడం మూర్ఖత్వమే. కానీ ఆ తర్వాత అతను ప్రవర్తించిన, ప్రవర్తిస్తున్న తీరు మాత్రం ప్రజాపేక్షకు తగ్గట్టు లేదు.  అరెస్ట్, విడుదల జరిగిన తర్వాత తనకు  మద్దతుగా వచ్చినవారు వ్యవహరిస్తున్న తీరు, అల్లు అర్జున్​బాడీ లాంగ్వేజ్​లో పెద్ద మార్పేమీ కనిపించలేదనేది  ప్రజావాక్కు. 

ఎంతసేపూ స్వీయ సమర్థనే

ఎంతో భవిష్యత్ ఉన్న సాధారణ గృహిణి తన కుటుంబాన్ని జీవితాంతం చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.  బంగారు భవిష్యత్​ ఉన్న బాలుడు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఘటన గురించి సినిమా మధ్యలోనే  తెలిసినా ఏం పట్టనట్టుగా, నాకేంటీ అన్నట్టుగా వ్యవహరించారని  పోలీస్ వ్యవస్థలోని ఎస్ఐ నుంచి ఏసీపీ వరకూ ఎవరినీఖాతరు చేయకుండా..  చివరకు డీసీపీ వచ్చి  వివరించినప్పుడు సైతం సానుభూతి లేనట్టుగా వ్యవహరించిన తీరు ఎంతటి అమానవీయం. 

థియేటర్ కు  కొన్ని మీటర్ల ముందు నుంచే కారు రూఫ్ ఓపెన్ చేసి క్రౌడ్ కంట్రోల్ చేశానని ప్రెస్ మీట్​లో చెప్పి తనను తాను సమర్థించుకోవడంలా ఉంది.  ఇక పోతే పోలీసులు థియేటర్​కు రావద్దని చెప్పినా  తెలియదని, పై పెచ్చు అక్కడ క్రౌడ్​లో తోపులాట జరిగేది ఊహించలేదని చెప్పడం కూడా సమర్థించుకోవడమే. అక్కడ తోపులాట జరగొచ్చని తెలుసు. ఎందుకంటే  రక్షణగా దాదాపు యాభై మంది బౌన్సర్లను తెచ్చుకోవడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఒక్క పాయింట్ చాలు ఆయనకు అక్కడ జరిగే అనుకోని సంఘటనలను ఊహించుకోలేదని చెప్పడం ఒక విచిత్రం అని చెప్పడానికి! 

పరామర్శకు చట్టం అడ్డమా?

తోపులాటలో జనాల కాళ్లు, చేతులు విరగొచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరేమైనా సరే, తన సినిమా ప్రమోషనే ముఖ్యమని ఆయన అనుకున్నట్లు అర్థమవుతోంది.  కారులోంచి దిగి హాల్ లోకి వెళ్లే సమయంలో ఆయనకు దారి ఇవ్వడం కోసం జనాల్ని  బౌన్సర్లు ఇష్టారీతిన నెట్టివేశారు.  ఇలాంటిదే తొక్కిసలాటకు దారి తీసింది. ఆ దుర్ఘటనకు అదే కారణమైందని ప్రజలు భావిస్తున్నారు. ఈ విజువల్స్ ను లోకమంతా చూసింది. 

చివరికి ఓ ప్రాణం పోయిందని చెప్పడానికి వచ్చిన పోలీసులను సైతం అనుమతించలేదు. డీసీపీ వచ్చి చెప్తే  మాత్రమే బయటకు వచ్చాడు. పైపెచ్చు మరోసారి తోపులాట జరగకూడదని బయటకు పంపితే.. పోతూ పోతూ కూడా రూఫ్  టాప్ లోంచి నిలబడి రోడ్ షో చేస్తూ అభివాదం చేయడం మరింత బాధాకర విషయం. చావు బతుకుల మధ్య  ఉన్న శ్రీతేజ్, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి చట్టం అడ్డం వచ్చిందనడం మరింత విడ్డూరం. 

చివరికి  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే నిందలు వేసేలా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం.. జరిగిన సంఘటన పట్ల సానుభూతి కన్నా, ఆయన తనను తాను సమర్థించుకోవడంలా ఉంది.  ఇలా సినిమాలో నటిస్తున్నట్టుగా.. నిజ జీవితంలోనూ నటించడం సరైందికాదు. నేషనల్ అవార్డు పొందిన నటుడి నుంచి ఇలాంటి వ్యవహార శైలిని ఎవరూ ఆశించలేరు. నిజానికి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటమే ఉత్తమ నటుల లక్షణం.

అసెంబ్లీలో  భావోద్వేగమైన సీఎం

మజ్లిస్​ సభ్యుడు వెలుబుచ్చిన అభిప్రాయానికి సీఎం సమాధానం చెప్పక తప్పలేదు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సీఎం హోదాలో విశ్వసనీయంగా పోలీసులు అందించిన బాధ్యతాయుత సమాచారాన్ని సభకు చెప్తూ రేవంత్ రెడ్డి ఎంత భావోద్వేగానికి గురయ్యారో అందరూ చూశారు. ఎంతసేపూ సెలబ్రిటీని అలా చేస్తారా..? అని ప్రశ్నిస్తున్న కొందరు.. తమకు పట్టని మానవత్వాన్ని తమకు తామే చాటుకున్నారు! 

పోయిన నిండు ప్రాణానికి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఒక అభాగ్యునికి సభ్య సమాజం అందించాల్సిన మద్దతు ఏంటో సీఎం చెప్పారు. తన రాష్ట్రంలో ఓ సాధారణ కుటుంబానికి అన్యాయం జరిగినా సహించననే నిజాన్ని నిండు శాసనసభ ద్వారా  చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి యావత్ ప్రజానీకానికి భరోసా అందించారు. అందులో రాజధర్మం ఉంది తప్ప మరొకటిలేదు.  చట్టం తన పని తాను చేస్తుందని, అతిగా ప్రవర్తిస్తూ  ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడొద్దని, సంబంధంలేని పోలీసు అధికారులు స్పందించొద్దని సైతం ఆదేశించారు.

ప్రాయశ్చిత్తం ముఖ్యం

సీఎం రేవంత్​రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాలకు కౌంటర్​గా  సినిమా నటుడు ఖండించడం అంటే, అది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని ఖండించడం కాదు.
నిజాన్ని అంగీకరించడానికి మనసొప్పకపోవడంగానే కనిపిస్తున్నది. ఇది ఎంత మాత్రం సహించలేనిది.  చట్టాలను తుంగలో తొక్కడం సాధ్యం కాదు. హ్యుమానిటీ మరవడం వల్ల వచ్చిన సమస్యగా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఆ నటుడిలో ఘటన పట్ల  ప్రాయశ్చిత్తం కన్నా, సీఎం చెప్పిన నిజాలని కాదని చెప్పడమే లక్ష్యంగా ప్రెస్​మీట్లో మాట్లాడటాన్ని ప్రజలు గమనించారు.

 కానీ ఆ నటుడు మాత్రం తనను తాను సమర్థించుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇది శోచనీయం.  ఆ నటుడు ఆ సంఘటనకు ప్రత్యక్షకారకుడు కాకపోవచ్చు, కానీ తన అత్యుత్సాహ ప్రదర్శన  తోపులాటకు కారణమైందనే విషయాన్ని  మానవత్వం కోణంలో ఆలోచించలేకపోతున్నాడు.  ఇప్పటికైనా ప్రాయశ్చిత్తాన్ని చెప్పుకునే పరిస్థితిలో ఆ నటుడు ఉండాలి. 

మాన్యునికైనా.. సామాన్యునికైనా.. ఒకే రకమైన న్యాయం అందుబాటులో ఉండాలి. ఆ దిశగా చిత్తశుద్ధితో  తెలంగాణ ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదనడానికి.. అసెంబ్లీలో సీఎం నిజాలను బయటపెట్టిన తీరును ప్రజలు ప్రశంసించడమే అందుకు నిదర్శనం . ఇది సినిమా కాదు, నిజ జీవితంలో తగ్గాల్సిందే!  నటన వేరు, నిజ జీవితం వేరు. కాబట్టి నిజజీవితంలో జీవించాలి తప్ప నటించడం సాధ్యం కాదనేదే.. ఈ ఎపిసోడ్​లో వెలుగు చూసిన సారాంశం అని చెప్పాలి. 

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,సీఈవో,టిసాట్ నెట్వర్క్-