సూర్యాపేట ఐటీ హబ్​ షట్​డౌన్​

సూర్యాపేట ఐటీ హబ్​ షట్​డౌన్​
  •     ఎన్నికల ముందు హడావుడిగా  ప్రారంభించిన గత సర్కారు  
  •     మాజీ ఎమ్మెల్యే బిల్డింగుకు రూ.3  కోట్లతో వసతులు 
  •     ఎలక్షన్స్​కు ముందే మున్సిపల్​ కాంప్లెక్స్​లోకి  మార్పు 
  •     వెళ్లిపోయిన కంపెనీలు..
  •      ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయీస్​

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో ఎన్నికల ముందు ప్రారంభించిన ఐటీ హబ్ మూతపడింది. అప్పటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు 45 రోజుల ముందు సూర్యాపేట పాత కలెక్టరేట్​లో ఆర్భాటంగా ఐటీ హబ్ ప్రారంభించారు. దీని కోసం ఓ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన బిల్డింగ్​(ఓల్డ్​ కలెక్టరేట్) లో రూ.2 కోట్లతో మౌలిక వసతులు కల్పించారు. మరో రూ.41 లక్షలతో బీటీ రోడ్డు నిర్మించి రూ.50 లక్షలతో సెలక్ట్​ చేసుకున్న వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలిచ్చారు.

అక్టోబర్ ​రెండో తేదీన ఐటీ హబ్​ను ఓపెన్​చేయగా 18 కంపెనీలు కొలువుదీరాయి. అయితే, ఎలక్షన్​ కోడ్​ ఉన్నప్పుడే ఈ కంపెనీలు తమ కార్యకలాపాలు అపేసి తిరిగి వెళ్లిపోగా, ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దీంతో ఇప్పుడు బిల్డింగ్​యజమాని అయిన మాజీ ఎమ్మెల్యే తన బిల్డింగ్​ను ప్రైవేట్ స్కూల్​కు  ఐదేండ్ల పాటు లీజుకు ఇచ్చుకున్నారు. అప్పట్లో తన బిల్డింగుకు ఏర్పాట్లు కల్పించుకోవడానికి, రెంట్ ​కోసమే ఆయన ఐటీ హబ్ పేరుతో హంగామా చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

రూ.2.91 కోట్లతో హంగులు..

గత సంవత్సరం అమెరికా వెళ్లిన మంత్రి కేటీఆర్​సూర్యాపేటలో ఐటీ హబ్ నెలకొల్పుతామని ప్రకటించారు. స్థానికులకు కొలువులు ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్నికలకు 45 రోజుల ముందు సూర్యాపేట పాత కలెక్టరేట్​లో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి ప్రకటించారు. ఇందుకు విదేశాల్లోని 32 కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. మొదట సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు 18 మంది ఎన్నారైలు వచ్చారని, 15 కంపెనీలు తమ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాయని హడావుడి చేశారు.

అనుకున్నదే తడువుగా మాజీ ఎమ్మెల్యే బిల్డింగులో అవసరమైన కాన్ఫరెన్స్ హాల్స్, సెంట్రల్ ఏసీ, విశాలమైన గదులను ఏర్పాటు చేశారు.  దీని కోసం డీఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి రూ.2 కోట్లతో మౌలిక వసతులు కల్పించారు. దీంతో పాటు రూ. సీఎస్సార్ ఫండ్స్ నుంచి రూ.41 లక్షలు ఖర్చు పెట్టి సుమారు కిలోమీటర్​ పొడవున బీటీ రోడ్డు వేయించారు. సూర్యాపేటలో జాబ్​మేళా ఏర్పాటు చేయగా 4,212 మంది ఆశావహులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

వీరిలో 350 మందిని ఎంపిక చేసుకుని 70 మం దికి అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి ఆర్డర్ కాపీలను కూడా అందించారు. వీరికి రూ.50 లక్షలతో టైనింగ్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మరో 600 మందిని నియమిస్తామని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ప్రకటించగా,  ఉన్నవారి ఉద్యోగాలు కూడా పోయాయి. 

మాజీ ఎమ్మెల్యేకు లబ్ధి కోసమే..

గత ఏడాది అక్టోబర్ ​రెండో తేదీన ఐటీ హబ్ ​ఓపెన్​చేయగా, డిసెంబర్​వరకు అన్ని కంపెనీలు ఒక్కొక్కటిగా తమ కార్యకలాపాలు ఆపేసి వెనక్కి వెళ్లిపోయాయి. పాత కలెక్టరేట్ ​సెకండ్​ ఫ్లోర్​లో అంతకుముందే ఈవీఎం స్ట్రాంగ్​రూం ఉండేది. దీని కింద ఫ్లోర్​లోనే ఐటీ హబ్​ ఏర్పాటు చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఐటీ హబ్​ ఉన్న చోట ఈవీఎం స్ట్రాంగ్​రూం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రతిపక్ష లీడర్లు ఎలక్షన్​కమిషన్​కు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల కమిషన్​అక్కడి నుంచి ఐటీ హబ్ మార్చాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో అక్కడి నుంచి సూర్యాపేట మున్సిపల్​కాంప్లెక్స్​లోకి తరలించారు. ఇది చిన్న బిల్డింగ్​ కావడంతో కొన్ని రోజులు తమ కంపెనీలను నడిపించిన నిర్వాహకులు తర్వాత కార్యకలాపాలు నిలిపివేసి వెళ్లిపోయాయి. దీంతో 350 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం మున్సిపల్ ​కాంప్లెక్స్​లోని ఐటీ హబ్​కు తాళం వేయగా, పాత కలెక్టరేట్​లోని ఫ్లోర్​ను కార్పొరేట్ స్కూల్​కు లీజ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేకు లబ్ధి చేకూర్చడానికే గత సర్కారు ఐటీ హబ్​ ప్రతిపాదన తీసుకువచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి.