- కేటీఆర్ చేతుల మీదుగా నేడు ప్రారంభం
- మినీ ట్యాంక్‌బండ్, శ్మశాన వాటికనూ ప్రారంభించనున్న మంత్రి
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని నిరుద్యోగ యువతలో జాబ్ఆశలు రేకెత్తిస్తున్న ఐటీ హబ్స్టార్ట్ కాబోతుంది. దీన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మినిస్టర్ కల్వకుంట్ల తారకరామారావు బుధవారం నిజామాబాద్వస్తున్నారు. గత నెల 28న ప్రారంభం కావాల్సి ఉన్నా భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది. సిటీ శివారులోని కొత్త కలెక్టరేట్పక్కన రూ. 50 కోట్ల ఖర్చుతో 3.20 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఇందుకు సుమారు అయిదేండ్లు పట్టింది. యువతకు శిక్షణనిచ్చి ఇతర దేశాల్లో జాబ్‌లు పొందేలా ట్రైనింగ్ఇవ్వడానికి ఐటీ హబ్ పక్కనే రూ.6.15 కోట్లతో న్యాక్ బిల్డింగ్ నిర్మించారు.
జిల్లాలో 4 లక్షల యువకులు..
జిల్లాలో 13 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో సుమారు 4 లక్షల మంది యూత్ఉన్నారు. అనేక మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఇతర చోట్లకు వలస వెళ్తున్నారు. గత నెల 21న నిర్వహించిన జాబ్‌మేళాకు సుమారు పదివేల మంది హాజరవ్వడం జిల్లాలో నిరుద్యోగ తీవ్రతను తెలిపింది. ఈ జాబ్‌మేళాకు 15 కంపెనీలు హాజరై 280 మందిని సెలెక్ట్ చేశాయి.
రూ.22 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్..
నిజామాబాద్ సిటీలో సుమారు 6 లక్షల జనాభా ఉంది. ఏటా సిటీ విస్తరించడంతో కాలుష్యం పెరగి ఆహ్లాదం కరువవుతోంది. ఈ నేపథ్యంలో ఖిల్లా వద్ద రఘునాథ్ చెరువును మినీ ట్యాంక్‌బండ్ పేరుతో అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ.22 కోట్లు ఖర్చు చేశారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, రంగురంగుల కరెంట్ దీపాలతో అలకరించారు. నేడు మినీ ట్యాంక్ బుధవారం నుంచి నగర ప్రజలకు ఉపయోగంలోకి రానుంది.
హైటెక్ శ్మశానాలు..
నగరంలోని వర్ని రోడ్, దుబ్బా, అర్సాపల్లి శ్మశాన వాటికలకు రూ.15 కోట్లతో అభివృద్ధి చేశారు. వాటర్, పవర్ ఫెసిలిటీతో పాటు అస్తికలు సేఫ్‌గా పెట్టడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. రూ.7 కోట్ల ఖర్చుతో నిర్మించిన మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్ సైతం బుధవారం స్టార్ట్ కాబోతుంది. ఖాళీ అయ్యే పాత భవనాన్ని నుడాకు అప్పగించనున్నారు.