- వందల ఎకరాలు అన్యాక్రాంతమైనా స్పందించరా: మంత్రి శ్రీధర్‌బాబు
- నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
- ఇండస్ట్రీస్, కామర్స్, టీజీఐఐసీ, హెచ్ఎండీఏ అధికారులకు లేఖ
హైదరాబాద్, వెలుగు: వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించడం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. సర్కారు భూములు కబ్జా అవుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని విలువైన భూములు కబ్జా అవుతుండడంపై సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ ఎం. రాగమయి ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా ఐటీ, ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఎండీ, హెచ్ఎండీఏ కమిషనర్లకు మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం లేఖ రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఖానామెట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 41/14లో 252.24 ఎకరాల భూమి ఉండగా.. 2008లో అప్పటి ప్రభుత్వం 180.13 ఎకరాలను హుడా (ఇప్పటి హెచ్ఎండీఏ)కి కేటాయించిందని తెలిపారు.
అందులో 75 ఎకరాలను టీజీఐఐసీకి బదిలీ చేశారని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం హెచ్ఎండీఏ అధీనంలో ఉన్న 105.13 ఎకరాలు, టీజీఐఐసీ అధీనంలో ఉన్న 75 ఎకరాల్లోని పెద్ద మొత్తం భూములు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. తాజాగా, శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్లలోని 100 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొం దరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజల అవస రాలకు ఉపయోగపడాల్సిన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణను ప్రారంభిం చాలన్నారు.
వెంటనే సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయి సిబ్బందికి బాధ్యతలను అప్పగించాలన్నారు. ఆక్రమణల సమాచారం ఉంటే వెంటనే స్పందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.