
- వ్యాపారాలు కొత్త టెక్నాలజీలకు, విధానాలకు మారాలి
- గ్రోత్ ఎక్స్ సమ్మిట్‌లో మంత్రి డి. శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే టార్గెట్గాపనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)కమిటీ హైదరాబాద్‌లో శనివారం "గో డిజిటల్ గ్రో బిజినెస్" అనే థీమ్‌తో నిర్వహించిన గ్రోత్ ఎక్స్ 2025 సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ జాతీయ వృద్ధి రేటుతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వేగంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని, జాతీయ సగటు వృద్ధి 8 శాతం కాగా, తెలంగాణ 17.98 శాతం సాధించిందని మంత్రి వివరించారు.
‘డిజిటల్ ఇన్నోవేషన్లు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమలు కూడా ముందుకు సాగాలి. మన పరిశ్రమలను మనం మార్చుకోవాలి. పాత విధానాలు పనిచేయవు.
ప్రయాణంలో సవాళ్లు ఉంటాయి. ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలకు మూలధనం లేకపోవడం, మార్పు భయం, అవగాహన లేకపోవడం, తయారీ సవాళ్లు ఉన్నాయి. ఇవి కొత్త టెక్నాలజీలను ఉపయోగించుకోకుంటే పోటీతత్వాన్ని కోల్పోతాయి. దీర్ఘకాలంలో నిలబడలేవు”అని మంత్రి అన్నారు.
ఏఐ.. ఎంతో ముఖ్యం
ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(ఏఐ) అన్ని రంగాలపై పట్టు సాధిస్తోందని, పరిశ్రమలలో, వ్యాపారాలలో ఏఐని ఉపయోగించుకోకపోతే సామర్థ్యాన్ని కోల్పోతామని మంత్రి హెచ్చరించారు. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ముందుకు సాగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా స్పష్టమైన దృక్పథం ఉందన్నారు. రాష్ట్రంలోని కంపెనీలు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో ముందుకు సాగాలని ఆయన చాలా గట్టిగా కోరుకుంటున్నారని తెలిపారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం తన వృద్ధికి ఏఐని అతి ముఖ్యమైన టెక్నాలజీగా భావిస్తోంది. ఇటీవల జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఆ దిశలో ఒక అడుగు”అని అని మంత్రి అన్నారు. గ్రోత్ఎక్స్ 2025 నాలెడ్జ్ పార్టనర్ అయిన ఈవై సంస్థ తీసుకువచ్చిన థాట్ క్యాపిటల్ నివేదికను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇక్కడ సమ్మిట్‌తో పాటు ఎక్స్‌పో జోన్‌ను ఏర్పాటు చేశారు. అనేక స్టార్టప్‌లు ఐటీ కంపెనీలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. చర్చల కోసం ఒక బిజినెస్ లాంజ్‌ను ఏర్పాటు చేశారు.
ఐటీలో సత్తా చాటుతున్నాం :జయేష్ రంజన్
తెలంగాణ ఐటీరంగం నిత్యం బలపడుతూనే ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ మూడు దశాబ్దాల క్రితమే ఐటీ ప్రయాణాన్ని ప్రారంభించిందని, ప్రతి సంవత్సరం బలంగా అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. హైదరాబాద్ వృద్ధికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) వెన్నెముక అని చెప్పారు.
70కిపైగా సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని వెల్లడించారు. ‘‘అమెజాన్ అలెక్సా పని హైదరాబాద్‌లో జరుగుతోంది. గూగుల్ మ్యాప్స్, క్లౌడ్ డెవలప్‌మెంట్ పనులు కూడా నగరంలో జరుగుతున్నాయి. హైదరాబాద్ ఐటీ సేవల కేంద్రం నుంచి ఐటీ ఉత్పత్తుల అభివృద్ధి నగరంగా మారింది”అని ఆయన వివరించారు.