యూనిఫాం సివిల్‌‌ కోడ్‌‌ అందరికీ అవసరమే

దేశంలో చర్చనీయాంశంగా ఉన్న ఉమ్మడి పౌర స్మృతి అనే అంశం భవిష్యత్‌‌ తరాలకు సంబంధించినటువంటి ఒక విషయం ఇందులో ఇమిడి ఉంది. స్త్రీల హక్కులు, దేశంలో పౌరులందరికీ ఒకే చట్టం అమలు చేయడం అనే విస్తృతమైన అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. గడచిన 75 ఏండ్లుగా వాయిదా పడుతూనే వచ్చింది, ఇకనైనా ముందుకు జరుగుతుందేమో అని ప్రజలు, ముఖ్యంగా ప్రజాస్వామిక వాదులు ఆశిస్తున్నారు. 

ఉ మ్మడి పౌర స్మృతి అవసరం ఈ రోజు పెరిగిందా? ప్రతి సమాజంలోనూ రాజ్యాంగం కొన్ని ఉదాత్తమైన విలువలను ప్రతిపాదిస్తుంది. అదే సమయంలో ఒక సామాజిక రీతి అనేది ఉంటుంది.  ఛాందసం కొనసాగుతుంటే నమ్మకం అనే పేరుతో దానిని కొనసాగనివ్వకూడదు. అంటే రాజ్యాంగ విలువలు చేరుకోవడానికి సమాజాన్ని ప్రేరేపించాలి. ఈ రాజ్యాంగ విలువలకు, సామాజిక రీతికి మధ్య సంఘర్షణే రాజకీయం.

భారతీయ సమాజం ఉన్నతమైంది

భారతీయ సమాజం చాలా బలమైంది. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ భాషైనా, ఏ ప్రాంతమైనా కూడా కుటుంబాలు ఇంత బలంగా ఉండే దేశాలు చాలా అరుదుగా ఉంటాయి. బహుశా మన ఇండియాలో ఉన్న బలమైన కుటుంబాలు ఇంకే ఇతర దేశాల్లో లేవు. అంత బలమైన కుటుంబాలు ఉన్నాయి కనుకే ఇంత బీదరికం ఉన్నా, ప్రభుత్వాలు చాలా రంగాల్లో విఫలమౌతున్నా కూడా పెద్దగా సమాజంలో నేర ప్రవృత్తి, అశాంతి, హింస మనకు పెద్దగా కనిపించడం లేదు.  సమస్యలున్న సమాజాలు అల్లోకల్లోలంగా ఉంటాయి. బయటకు వెళ్లాలంటే భయంగా ఉంటుంది. మతాలకు అతీతమైన ధర్మ నిరతి, అంటే మంచీ చెడు విచక్షణ సహజంగా ఈ దేశంలో అత్యధిక ప్రజలకు ఉంది.

అది సంప్రదాయంలో భాగంగా వచ్చింది. తప్పులు చేయరని కాదు, తప్పు అన్న స్పృహ ప్రజల్లో బాగా కనపడుతుంది. తప్పు చేస్తే సమాజం మనల్ని వెలివేస్తుందేమో, మనల్ని తక్కువగా చూస్తుందేమో, చులకన అయిపోతామేమో అన్న భావన చాలామందిని మంచి మార్గంలో పెడుతుంది. ఇలాంటి గొప్ప విషయాలు మన సంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. 

షాబానో కేసు ఓ ఉదాహరణ

మనదేశంలో ప్రతీ పనినీ తమ కులాలకు, మతాలకు ఆపాదించుకుని రాజకీయం చేయడం అనేది చాలామందికి అలవాటైపోయింది. ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది ఇస్లాంకు, క్రిస్టియానిటీకి సంబంధించింది కాదు, ఇది ఎందుకు ప్రతిపాదిస్తున్నారు, ఈ మార్పు ఆధునిక సమాజంలో అవసరమా? కాదా? ఆ రకంగా ఆలోచిస్తే అప్పుడు పరిష్కారం వస్తుంది. ఇలాంటి ఆలోచనలు లేక ఈ దేశానికి చాలా నష్టం జరిగింది. 80వ దశకంలో రాజీవ్‌‌ గాంధీ పదవిలో ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చిన్న తీర్పు షాబోనా కేసులో ఒక ముస్లిం బీద మహిళ సీఆర్పీసీ చట్టంలో విడాకులకు గురయ్యింది. ఆమెకు మనోవర్తి ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో వారి మతంలో గందరగోళాలు చెలరేగాయి. దానిని కాంగ్రెస్‌‌ నాయకులు కూడా వ్యతిరేకించారు. ఇప్పటి కేరళ గవర్నర్‌‌‌‌ ఆరిఫ్‌‌ మహమ్మద్‌‌ ఖాన్‌‌ అప్పుడు హోం మంత్రిగా పనిచేసి రాజీనామా చేశారు.

ఖాదీర్‌‌‌‌ హుస్సేన్‌‌ ఖాన్‌‌ వంటి వారు చాలా వ్యతిరేకించారు. అప్పుడు రాజీవ్‌‌గాంధీ పీవీ నరసింహారావు మెడలు వంచి ముస్లిం ఎంబసీకి తీసుకొచ్చారు. ఇటువంటి వారి వల్ల దేశం చాలా నష్టపోయింది. కనుక ఇప్పుడు దీనిని మత పరంగా కాకుండా హేతుబద్ధంగా మహిళల హక్కులు, పిల్లల హక్కులు, ఆధునిక సమాజంలో భాగస్వామ్యం దిశగా ఆలోచిస్తే దేశ భవిష్యత్‌‌కు ప్రయోజనం చేకూరుతుంది.

వెయ్యేళ్ల వెనక్కి వెళ్లొద్దు

యూనిఫాం సివిల్‌‌ కోడ్‌‌ వస్తే ముస్లింల వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వ జోక్యం పెరుగుతుంది అనే వాదన పూర్తిగా అసంబద్ధమైనదే. ఒక ప్రభుత్వాన్ని మానవ సమాజం ఎందుకు ఏర్పాటు చేసుకుంటుంది? మొదటిది ఉమ్మడి ప్రయోజనాలను కాపాడటం కోసం, వ్యక్తులుగా నేను, నా కుటుంబం, నా సంగతి నేను చూసుకోవచ్చు కానీ బలం ఉన్నవాడు బలం లేనివాడిని చితక్కొట్టకూడదు కదా! మీ జీవితాల్లో తొంగి చూసే అవసరం ఏ రాజ్యాంగానికి ఉండదు. మీరు ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు వంటి వ్యక్తిగత విషయాల్లోకి రాజ్యం ఏనాడూ కలుగజేసుకోదు. అలాకాకుండా వివాహక సంబంధాలు ఇద్దరికీ సమానంగా ఉండాలి, మౌలికమైన హక్కులను కాపాడాలి అని రాజ్యాంగం చెబుతుంటే అక్కడ నా మతం, నా సంప్రదాయం దెబ్బ తింటుంది అన్న వాదన చాలా విడ్డూరమైంది. దాన్ని తిరస్కరించి తీరాలి.

ఎవరు చేసినా సరే.  ప్రపంచ ఇస్లామిక్‌‌ దేశాలు షరియాను అనుసరిస్తున్నాయి. ఇక్కడ ఆ షరియా లేదు, ఉండకూడదు. సివిల్‌‌ సంబంధాల వరకూ వారి ఇష్ట ప్రకారం ఉండొచ్చు. తప్పు చేస్తే కాళ్లు, చేతులు నరకడం లాంటి షరియా పద్ధతులు ఇక్కడ వర్తించవు. దానిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అమలు చెయ్యడం కుదరదు. ఒక ఆధునిక సమాజ నిర్మాణంలో చట్టబద్ధ పాలనకు కొన్ని పద్ధతులున్నాయి. దాన్ని మనం ఒప్పుకున్నాం. మళ్లీ మనం ఒక వెయ్యేళ్ల వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయడం ఎవరూ పొరపాటున కూడా ఒప్పుకోరు.

ఇస్లాంలో ఉన్న నిఖా పద్దతిని ఏ ప్రభుత్వమూ ఆపలేదు. అది కాంట్రాక్ట్‌‌ వివాహ పద్దతే అని తెలిసినప్పటికీ ఏ ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోలేదు ఎందుకంటే అది వారి సంప్రదాయం కనుక. కానీ అదే మతంలో ఒక మహిళకు విడాకుల విషయంలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించాల్సిందే. ఎందుకంటే ఒక ఆడపిల్లకు తేలిగ్గా విడాకులిచ్చేసి, ఆమెకు ఎలాంటి భృతి లేకుండా చేసి, అన్యాయం చేస్తే మాత్రం రాజ్యం చూస్తూ ఊరుకోదు.

 అందరికీ అవసరమే

వ్యవసాయ చట్టాలు నూటికి నూరుపాళ్లు పనికి వచ్చేవే. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఒక చర్చను ప్రవేశపెట్టి పార్లమెంట్‌‌లో బిల్లు పెట్టి కొంచెం ఓపిగ్గా చేసినట్లయితే బహుశా చాలా తేలిగ్గా చట్టాలు అమల్లోకి వచ్చేవి. రాజకీయ నేతల మాటలకు తలొగ్గి  రైతులు తమకు సంకెళ్లే కావాలని కోరుకున్నారు. ప్రపంచ చరిత్రలో బానిసత్వాన్ని కోరుకున్న సంఘటన బహుశా ఇదొక్కటే అయి ఉండొచ్చు. అయితే ప్రభుత్వం మంచి చేయాలనుకున్నప్పుడు దానిని చర్చావిధానాల ద్వారా సాఫ్ట్‌‌గా ఒప్పిస్తే  సులువుగా అవుతుంది. నువ్వది చేసి తీరాల్సిందే అని కఠినంగా చెబుతుంటే మంచి కూడా చెడుగానే కనిపిస్తోంది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఉండాలంటే  యూనిఫాం సివిల్​ కోడ్ ఈ దేశంలోని అన్ని మతాలకు, సంప్రదాయాలకు అవసరమే.

హిందూ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి

ఒక రాజ్యానికి, రాజ్యాంగానికి ఇవాళ సవాలు ఏమిటంటే  మంచిని కాపాడుకోవడమే. హిందూ సమాజం  అంటే భిన్న సంస్కృతుల సమ్మేళనం.   ఇదొక భౌగోళికంగా ఏర్పడిన హిందూ సమాజం. మన హిందూ సమాజంలో చాలా దుర్లక్షణాలు ఉండేవి. నాలుగు తరాల కిందట సతీసహగమనం ఉండేది. దాన్ని అప్పట్లో చాలా గొప్ప అనుకునేవారు. దాన్ని మనం ఆపాం. తెల్లవాళ్ల కాలంలోనే దాన్ని రూపుమాపాం. రాజారామ్మోహన్‌‌రాయ్​ టైంలో గట్టిగా పట్టుబట్టి తెల్లవాళ్ల రాజ్యాధికారాన్ని ఉపయోగించి దాన్ని ఆపగలిగారు. ఆనాడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారున్నారు. అలాగే బాల్య వివాహాలను తిరస్కరించే ప్రయత్నం చేసిన ఈశ్వర్‌‌‌‌ చంద్ర విద్యాసాగర్‌‌‌‌, వీరేశలింగం పంతులు గారిపై భౌతిక దాడులు చేశారు, వారిని వెలివేశారు కూడా.

అలాగే వితంతు వివాహాలు. మా పెంపుడు తల్లి బాల్య వితంతువే. అందుకే అది హైందవం కావచ్చు, మరో మతం కావచ్చు సంప్రదాయంలో ఉన్న బలాన్ని సమాజానికి పనికొచ్చేలా కాపాడుతూ, దానిలో ఉన్న చెడుని, ఆ పాత వాసనలను ఆధునిక యుగానికి సరిపోనటువంటిది. దానిని మనం కనుక నిర్జించకపోతే ఇప్పటి రాజ్యాంగ విధులకి అర్థం లేదు. కాబట్టి ఉమ్మడి పౌర స్మృతిని ఆదేశ సూత్రాల్లో ఒక భాగంగా ఎందుకు పెట్టారంటే ఒక ఆధునిక సమాజం నిర్మాణం కావాలంటే సాంప్రదాయంలో ఉన్న మానవ సమాజానికి హాని చేసే కొన్ని ఛాందసాలను తొలగించాలి.

మహిళలకు న్యాయం జరగాలి

ఎన్నో తరాల నుంచి మహిళలకు అన్ని  రకాలుగా అన్యాయం జరిగింది. కొన్ని మతాల్లో ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ మ్రోడన్‌‌ యుగంలో బహు భార్యత్వం అనేది మనం సమర్ధించలేం. కచ్చితంగా అది ఏ మతం పేరుతో ఉన్నా, ఏ కులం పేరుతో ఉన్నా కూడా. అలాగే భ్రూణ హత్యలను అంగీకరించలేం. ఆడపిల్ల పుట్టగానే చంపేయడం కూడా కొంతమంది సంప్రదాయమన్నారు. దాన్ని ఆపాలి. అలాగే వివాహ విషయంలో కూడా మగవారికో విధంగా, స్త్రీలకో విధంగా పద్ధతులున్నాయి. అలాగే ఆస్తి హక్కులో కూడా. అది తప్పు. దాన్ని ఈ మోడ్రన్‌‌ సొసైటీ అంగీకరించే పరిస్థితిలో లేదు. ఒకప్పుడు ఇవన్నీ చెల్లినాయి.

కనుక మహిళలకు వైవాహిక సంబంధాల్లో సమాన హక్కులు, కొన్ని వ్యక్తి హింసకు దారితీసేటటువంటి, పౌర హక్కులకు ఉల్లంఘన జరిగేటటువంటి ఛాందస భావాలను పక్కకు పెట్టడం వంటి పనులన్నీ ఆధునిక రాజ్యాంగం చేయవలసిన పనులే. దీనికి కులాల, మతాలతో ప్రమేయం లేదు. అన్ని మతాల్లో ఉన్న పొరపాట్లను తొలగించాలి. అంతకు మించి దీనిని మతాలకు సంబంధించిన విషయంగా పరిగణించడం ఆధునిక రాజ్యంలో సరైన పద్ధతి కాదు.

- డా. జయప్రకాశ్​ నారాయణ,లోక్​సత్తా వ్యవస్థాపక అద్యక్షుడు