గురుకులాలన్నీ ఉంటయ్.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో అవి మూతపడతాయనేది అబద్ధం

గురుకులాలన్నీ ఉంటయ్.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో అవి మూతపడతాయనేది అబద్ధం

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో అవి మూతపడతాయనేది అబద్ధం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • పక్కా భవనాలున్న వాటిని మూసివేయం 
  • చిన్న చిన్న షెడ్లలో కొనసాగుతున్నవాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతామని వెల్లడి  
  • మధిర నియోజకవర్గం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్​కు శంకుస్థాపన

మధిర, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ కొనసాగుతాయని.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రాకతో అవి మూతపడతాయనేది అబద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో భట్టి మాట్లాడుతూ.. ‘‘ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు మూసివేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. కానీ అది నిజం కాదు. పక్కా భవనాలు ఉన్న ఏ రెసిడెన్షియల్ స్కూల్ ను మూసివేయం. కొత్త స్కూళ్లకు బిల్డింగ్​లు కట్టి అవసరమైన స్టాఫ్ ను కేటాయిస్తాం. కల్యాణ మండపాలు, చిన్న చిన్న షెడ్లలో కొనసాగుతున్న గురుకులాలను ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతాం” అని తెలిపారు. ‘‘ప్రపంచంతో పోటీ పడేలా మన స్టూడెంట్స్ ను తయారు చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. అందుకు అనుగుణంగా సిలబస్​తయారు చేసి, మౌలిక వసతులు కల్పిస్తాం” అని పేర్కొన్నారు. 

అందరికీ అడ్మిషన్లు.. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ కులాలు, మతాల పేరుతో విడదీయకుండా.. అందర్నీ కలుపుకుని వెళ్లేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు నాంది పలికామని భట్టి తెలిపారు. వీటిల్లో అన్ని వర్గాల వారికి అడ్మిషన్స్ ఇస్తామని చెప్పారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినేడు రెసిడెన్షియల్ పాఠశాలలకు కేవలం రూ.73 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​స్కూళ్లకు రూ.5వేల కోట్లు కేటాయించింది. ఈ ఫండ్స్​తో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం అవుతుందా? అని ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేశారు. సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే.. చేసే పని మంచిదైతే సాధ్యం కానిది ఏదీ లేదు. స్థలాలు గుర్తించిన నియోజకవర్గాలకు స్కూళ్లు మంజూరు చేశాం. దసరా సందర్భంగా ఒక్క రోజే 28 పాఠశాలలకు శంకుస్థాపన చేశాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుంది” అని వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌలతులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్స్ ను నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.