- నాన్న చనిపోయినప్పటంత బాధ పడుతున్నా: రాహుల్
- వయనాడ్ బాధితులకు అండగా ఉంటాం
- ఇక్కడి ప్రజల కష్టాన్ని దేశం మొత్తం చూస్తున్నది
- అనాథ పిల్లలను ఆదుకుంటాం: ప్రియాంక
- వయనాడ్‌లోని చురల్మలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు
వయనాడ్: కేరళలోని వయనాడ్ విపత్తు తమ మనసుల్ని కలచివేసిందని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడు అంతే బాధపడుతున్న.. యావత్ దేశం వయనాడ్ బాధను చూస్తున్నది. నేనొక్కడినే కాదు.. ఎంతో మంది ఈ బాధను అనుభవిస్తున్నరు’’అని రాహుల్ అన్నారు. గురువారం వయనాడ్‌లోని చురల్‌మల ప్రాంతాన్ని ప్రియాంక గాంధీతో కలిసి పరిశీలించారు. ప్రజల బాగోగులు, భద్రతా బలగాల సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
దీనికి ముందు, కన్నూరు ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఇద్దరూ వయనాడ్ వెళ్లారు. తర్వాత మెప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో బాధితులను పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది. బాధితులకు అన్నీ రకాలుగా సహాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. వయనాడ్‌కు అండగా ఉంటాం. ఇది మాటలకు అందని మహా విషాదం. ప్రజల బాధలను చూసి చలించిపోయాం’’అని రాహుల్ అన్నారు..
ఈ ప్రాంత పరిస్థితి చూస్తుంటే మాటలు రావట్లేదంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఇక్కడి ప్రజలు కేవలం వారి తండ్రినే కాదు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
అండగా నిలిచేందుకే వచ్చాం: ప్రియాంక
వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నామని ప్రియాంక గాంధీ అన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ విపత్తు చూస్తే తనకు మాటలు రావడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.కాగా, వయనాడ్ జిల్లాలో వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 291కి చేరింది.
విపత్తుకు ముందు, తర్వాత..
కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 86 వేల చదరపు మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో అంచనా వేసింది. సముద్రమట్టానికి 1,550 మీటర్ల ఎత్తులో ఈ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది. ఇరువంజిపుళ నదిలో దాదాపు 8 కిలో మీటర్ల మేర ఈ శిథిలాలు కొట్టుకుపోతున్నట్లు తెలిపింది. విపత్తు తీవ్రతను అంచనా వేసేందుకు ఇస్రోకు చెందిన కార్టోశాట్-3, ఆర్‌ఐఎస్‌ఏటీ హై టెక్నాలజీ శాటిలైట్లను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆ ప్రాంతంలో అంతరిక్షం నుంచి తీసిన 3డీ చిత్రాలను రిలీజ్ చేసింది.