- కలిపారు.. వదిలేశారు!
- విలీన గ్రామాల్లో కానరాని అభివృద్ధి
- ఆదాయం ఉన్నా నిధుల కేటాయింపు సున్నా
- విపక్షాల డివిజన్లపై పక్షపాతం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విలీన గ్రామాల అభివృద్ధిపై అటు ప్రభుత్వం.. ఇటు ఆఫీసర్లు శీతకన్ను వేస్తున్నారు. స్పెషల్ ఫండ్స్ మంజూరులో పక్షపాతి ధోరణి వల్ల ఈ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. కార్పొరేషన్‌కు మంజూరైన రూ.100 కోట్ల స్పెషల్ ఫండ్స్ అధికార పార్టీ ప్రాతినిధ్యం వహించే డివిజన్లకే కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.15 నుంచి రూ.40 లక్షల ఆదాయం..
నగర శివారులోని బొర్గాం(పి), పాంగ్రా, ఖానాపూర్, గూపన్‌పల్లి, కాలూర్, ముబారక్ నగర్, సారంగాపూర్, బొర్గాం(కె), మాణిక్ బండార్ మొత్తం తొమ్మిది గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఈ గ్రామాల ద్వారా కార్పొరేషన్‌కు ఏటా రూ.15 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వివిధ పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. భారీగా వెంచర్లు వెలియడం, వందల సంఖ్యలో ఇండ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతుండడంతో వాటి అనుమతుల రూపంలో రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. కానీ ఆ స్థాయిలో అభివృద్ధి పనులు ఇక్కడ చేపట్టడంలేదు. అర్బన్‌కు గతంలో రూ.100 కోట్లు స్పెషల్ ఫండ్ కేటాయించారు. మొదటి సారి ఒక్కో డివిజన్‌కు ఏటా రూ.10 లక్షల చొప్పున సాధారణ నిధులు మాత్రమే కేటాయించారు. మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్ అర్బన్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో విలీన గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తం..
విలీన గ్రామాల డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ల సమస్యలు ప్రధానంగా ఉంది. బోర్గాం(పి), గూపన్‌పల్లి, ముబారక్ నగర్, పాంగ్రా గ్రామాల్లో అంతర్గత రోడ్ల సమస్య తీవ్రంగా మారింది. భాగ్యనగర్ కాలనీ, తారకరామనగర్, బోర్గాం(కే), సారం గాపూర్ ఇందిరమ్మ కాలనీ, మహమ్మద్ నగర్ ప్రాంతాల్లో విస్తరించిన అంతర్గత రోడ్ల వెంట పిచ్చిమొక్కలు పెరగుతున్నాయి. ఆ వెంచర్ల ద్వారా వచ్చిన 45 కు పైగా ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేయకుండా వదిలేయడంతో అన్యాక్రాంతమవుతున్నాయి. ఆర్యనగర్, వీవీనగర్, బ్యాంకు కాలనీ, సంజీవ్ రెడ్డి, సాయి శ్రీనగర్ కాలనీలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోంది.
ఆయా కాలనీల్లోని ప్రజలు ఖాళీ ప్రాంతాల్లో చెత్త వేయాల్సి వస్తోంది. బోర్గాం(పి), మాధవనగర్, పాంగ్రా, ఖానాపూర్, కాలూర్, సారంగపూర్‌లో డంపింగ్ యార్డులు లేవు. దీంతో ఇళ్ల వద్ద సేకరించిన చెత్తను గ్రామ పొలిమేరల్లో వేస్తున్నారు. నగర్ కాలనీ, సాయిలక్ష్మీనగర్, టెలీకాం, సంజీవయ్య, గూడెం కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఫలితంగా మురుగు నీరు ఖాళీ స్థలాల్లో నిలుస్తోంది. మానిక్ బండార్, ముఖారక్ నగర్, సారంగపూర్ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్య ఉంది. చెత్త సేకరణ, డ్రైనేజీలను శుభ్రం చేయడం, ఇంట ర్నల్ రోడ్లపై పేరుకుపోయే చెత్త తొలగించడం వంటి పనులు ముందుకు సాగడం లేదు.
నరకం చూస్తున్నాం..
ఒకటో డివిజన్ ఖానాపూర్‌లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్ల నిర్మాణానికి 2 నెలల కింద భూమి పూజ చేశారు. కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు.
- వీరయ్య, ఖానాపూర్వాసి
అభివృద్ధి జరగడం లేదు..
విలీన గ్రామాల డివిజన్లలో అభివృద్ధి జరగడం లేదు. ఈ డివిజన్ల నుంచి రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ నిధులు మంజూరు చేయడం లేదు. రెండేళ్లలో కేవలం రూ.20 లక్షలు కేటాయించారు.
- ఎస్.రాజశేఖర్‌రెడ్డి, బోర్గాం(పి)