- కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి: కేటీఆర్
- జార్ఖండ్, మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు
- ఆ రెండు పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి
- హేమంత్‌ను వేధించినందుకు బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో రాబోయేది ప్రాంతీయ పార్టీల శకమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌లాంటి బలమైన ప్రాంతీయ నాయకులను ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలిస్తేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అండతోనే ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్, ప్రాంతీయ అస్థిత్వాలను చులకన చేసిన బీజేపీని ఆ రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని అన్నారు.
ఆ రెండు జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలోనూ సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై శనివారం కేటీఆర్ఓ ప్రకటన జారీ చేశారు. రాష్ట్రాల అస్థిత్వం, అభివృద్ధి కోసం పోరాడే పార్టీలను వేధిస్తే ప్రజలు తిరగబడి బుద్ధి చెబుతారనడానికి జార్ఖండ్ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.
హేమంత్ సోరెన్‌ను వేధించిన కేంద్రంలోని బీజేపీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. మహారాష్ట్రలోనూ ప్రాంతీయ పార్టీల నేతలైన ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లే బీజేపీకి కీలకమయ్యారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరగడం దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. 2024 పార్లమెంట్ ఎన్నికల నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైందని చెప్పారు.
రేవంత్ అబద్ధాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయకుండానే అన్నింటినీ అమలు చేశామన్న ప్రచారాన్ని అక్కడి ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు చెందిన రూ.300 కోట్ల సొమ్ముతో మహారాష్ట్రలో ప్రకటనలు ఇచ్చి, తిమ్మిని బమ్మిని చేద్దామని ప్రయత్నించారని, అయినా వారి ఆటలు సాగలేదని అన్నారు. రేవంత్ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు కూడా కాంగ్రెస్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ఇక్కడ గెలిపించిన ప్రజల కోసం రేవంత్ రెడ్డి పనిచేయాలని, హామీలను అమలు చేయాలని సూచించారు. కాగా, మహారాష్ట్రలో ఓటమితో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలహీన పడుతుందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తున్నదని పేర్కొన్నారు.
రేవంత్ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నరు
రేవంత్ రెడ్డి కన్నా పెద్ద పెద్ద నియంతలే కాలంలో కొట్టుకుపోయారని, రేవంత్ కూడా కొట్టుకుపోతారని కేటీఆర్ అన్నారు. శిశుపాలుడి తప్పులను లెక్కించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, రేవంత్ పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారని తెలిపారు. శనివారం చర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు.
అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. రేవంత్ కక్షసాధింపు చర్యలకు సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు ఏ తప్పు చేయని అమాయకులే జైలు శిక్ష అనుభవిస్తున్నారని, కానీ, కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు మాత్రం గద్దెనెక్కి కూర్చున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో ఆ ఊరి మాజీ సర్పంచ్ అయిన సాయిరెడ్డి అనే 85 ఏండ్ల వృద్ధుడిపై పగబట్టారని, ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి బాట లేకుండా చేశారని విమర్శించారు. ఆ క్షోభ, అవమానంతోనే సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. చేయని తప్పుకు జైల్లో ఉన్నోళ్లు ఎవరూ భయపడవద్దని, మన వెనుక కేసీఆర్ ఉన్నారని అన్నారు.