
అనుకున్నది జరగాలని ఇలవేల్పు, కులదైవానికి ముడుపులు కడతారు. మొక్కులు మొక్కుతారు చాలామంది. కోరికలు నెరవేరితే మొక్కినట్టుగానే యాటను కోసి పండుగ చేస్తారు. కానీ, బండసొరికలో వెలిసిన కొమురవెల్లి మల్లన్నకు భక్తులు పట్నాలు వేస్తారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించడం ఇక్కడి స్పెషాలిటీ.
ఇక్కడ పట్నాలు వేసే సంప్రదాయం దాదాపు రెండొందల ఏండ్ల నుంచి వస్తోంది. ఈమధ్యే మల్లన్న 3 నెలల జాతర మొదలైంది. దాంతో ఎక్కడ చూసినా రంగు రంగుల పట్నాలతో కన్నుల పండువగా ఉంది మల్లన్న గుడి.
మల్లన్న ఉత్సవాల్లో పెద్ద పట్నాలు వేయడం మామూలే. సామాన్య భక్తులు కూడా పట్నాల రూపంలోనే మొక్కులు చెల్లిస్తున్నారు. ఒగ్గు పూజారులు పంచ రంగుల పొడితో పట్నం(ముగ్గు) వేసి, మల్లికార్జున స్వామిని ఆవహింపజేసి మొక్కులు చెల్లిస్తారు. పట్నం వేస్తూ మల్లన్న స్వామి చరిత్రను పాట పాడుతూ వినిపిస్తారు ఒగ్గు పూజారులు. పట్నాల మొక్కు తీర్చుకున్న తర్వాత అగ్ని గుండాల కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాతే భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కొమురవెల్లిలో పట్నాల సంప్రదాయం దాదాపు రెండొందల ఏండ్ల క్రితమే ప్రారంభమైందని చెప్తారు ఆలయ పూజారులు.
పట్నాల్లో రకాలు
పట్నం’ అంటే ముగ్గు. పట్నానికి ‘మల్లికార్జున స్వామి కళ్యాణం’ అనే అర్థం కూడా ఉంది. పెండ్లికి ముందు నిర్వహించే పోలు బియ్యం లెక్కనే కొమురవెల్లిలో వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం పట్నం కార్యక్రమం ఉంటుంది. పట్నాలు వేసేందుకు పసుపు, కుంకుమ, గులాబీ రంగు కుంకుమ, తంగేడు ఆకులతో చేసిన ఆకుపచ్చ పొడి, బియ్యం వాడతారు. పట్నాలను మూడు రకాలుగా వేస్తారు. భక్తులు బస చేసిన ప్రాంతాల్లో వేసేది ‘చిలక పట్నం’. ఆలయంలోని గంగిరేణి చెట్టు వద్ద వేసేది ‘నజర్ పట్నం’. ఆలయం లోపల వేసేది ‘ముఖ మండప పట్నం’. ఆలయం లోపల మాత్రం స్థానిక ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తారు. గుడి బయట ఇతర ప్రాంతాల ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తారు. పట్నాలు వేసేవాళ్లు ముందుగా టికెట్ తీసుకోవాలి. చిలక పట్నానికి రూ.100, నజర్ పట్నానికి రూ.150, ముఖమండప పట్నానికి రూ.500. మల్లన్నను కులదైవంగా భావించే వాళ్లు ప్రతి ఏడాది లేదా రెండు లేదా మూడేండ్లకు ఒకసారి పట్నాలు వేసి, మొక్కులు చెల్లించుకుంటారు.
ఐదు వరుసల నుంచి..
మల్లన్న జాతరలో శివరాత్రి రోజు తోటబావి వద్ద వేసే పెద్ద పట్నానికి చాలా స్పెషాలిటీ ఉంది. ఈ పట్నాన్ని చూసేందుకు, ముగ్గు పొడికోసం భక్తులు పోటీపడతారు. పెద్ద పట్నాన్ని పలు రంగుల్లో 41 వరుసల్లో వేస్తారు. జాతర మొదటి వారం 21 వరుసల పట్నం వేస్తారు. భక్తుల మొక్కుల మేరకు ఆలయం లోపల, బయట ఐదు నుంచి పదకొండు వరుసల్లో, రంగురంగుల్లో చిన్న పట్నాలు వేస్తారు హైదరాబాద్‌కు చెందిన ఒగ్గు పూజారులు. సైజ్‌ని బట్టి ఒక్కో పట్నానికి దాదాపు గంట నుంచి రెండు గంటలు పడుతుంది.
::: హెచ్.రఘునందన స్వామి, సిద్దిపేట, వెలుగు
పట్నాల ముగ్గుతో...
మల్లన్న గుడితో పాటు భక్తులు బస చేసిన చోట పంచరంగులతో పట్నాలు వేస్తాం. పట్నంపై మల్లన్న స్వామి, అమ్మవార్లను ఆవాహనం చేసి, దేవుడి కళ్యాణం జరిపిస్తాం . పట్నాల ముగ్గుని తీసుకెళ్లి ఇంట్లో, పంటపొలాల్లో చల్లితే మంచి జరుగుతుందని నమ్ముతారు. కొమురవెల్లి మల్లన్న గుడికి వచ్చే వాళ్లలో సగానికి పైగా పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.
- మక్కపల్లి సంజీవరాజు, ఒగ్గు పూజారి