తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తీరును పరిశీలిస్తే సరిగ్గా విపక్ష పార్టీలు అనుసరించిన విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు అర్థమవుతాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం ప్రచార సరళి ఒక లోటుగా కనిపిస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. పైగా ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కడే అన్నిచోట్ల అంతటా తానై ప్రచారం చేశాడు. బీజేపీ ముందుగా మీనమేషాలు లెక్కించకుండా అభ్యర్థుల ఎంపిక ఖరారు చేయడం జరిగింది. దాంతో ఆయా స్థానాలలో ప్రచారం, టీం వర్క్సమన్వయంతో పనిచేయడంవల్ల బీజేపీ అభ్యర్థులు గెలుపుబాటలో నిలిచారు.
బీజేపీకి ఇవన్నీ కలిసి రావడం ఒక ఎత్తు అయితే, కవితను అరెస్టు చేయడం వలన గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేయడం మరొక ఎత్తు. ఇవన్నీ బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడేలా చేశాయి. బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ తమకు రాజకీయ ప్రథమ శత్రువు, ద్వితీయ శత్రువును నిర్ణయించుకోవడంలో కూడా పూర్తిగా విఫలం చెందాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది పై చేయిగా ఉండేది. అందుకే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో పరోక్షంగా కలుగజేసుకున్నాడు. బీఎస్పీకి మాదిగ ఓట్లను చీల్చాలని, చౌకబారు ఎత్తుగడతో ఆ పార్టీలోకి ఆర్ఎస్పీని పంపించి ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నికలో కూడా తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడు. ఆ ఎన్నికలలో ఆయన ఎత్తులు, జిత్తులు రహస్యంగా వలపన్నిన వ్యూహాలు వికటించాయి.
జాతీయ పార్టీలవైపు తెలంగాణ ఓటర్లు మొగ్గు
బీఆర్ఎస్ అధినేత అదే అహంభావ వైఖరితో, తమ ఓటమికి ప్రజలే కారణం అన్నట్లు అధినాయకుడు నుంచి ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకులు సైతం ప్రచారంలో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే డబ్బులతో ఓట్లను దండుకోవచ్చనే ప్రణాళికతో పనిచేశారు. అందుకే బీఆర్ఎస్ ఎన్నికల బరిలో చతికిలపడింది. పైగా బీఆర్ఎస్కు చెందిన ఓటర్లు బీజేపీకి బదిలీ అయ్యారు. బీజేపీ మూల సిద్ధాంతాలపైన వైఖరిపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపెట్టింది. అంతేగాక, ఈసారి ప్రజలు సామాజిక మీడియా పైన ఎక్కువగా నమ్మకాన్ని ఉంచడం జరిగింది. ఏది మార్ఫింగో ఏది నిజమో గ్రహించడంలో ఓటర్లు తెలివిగా ప్రవర్తించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అహంకారంతో తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లుగా ప్రచారం చేయడం వలన ఎన్నికల గోదాలో మచ్చుకు కూడా లేకుండా పోయింది. తెలంగాణ ఓటర్లు జాతీయ పార్టీల వైపు సరి సమానంగా మొగ్గు చూపారు. అందుకనే బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.
కేసీఆర్ అవినీతిని ప్రజలు మర్చిపోరు
కేసీఆర్ పొలిటికల్ ప్రిస్క్రిప్షన్ కు ఆయన ఇచ్చిన మెడిసిన్ కు కాలం చెల్లిపోయింది. కేసీఆర్ తన కూతురును విడిపించాలనే లోపాయికారి వ్యవహారాలు నడపడం వలన కాంగ్రెస్ పార్టీ ఇంకొక నాలుగు స్థానాలను కోల్పోయింది. ఆయన చాటుమాటుగా చేసే కార్యక్రమాలు, సంధి--ప్రణాళికల రచనను ప్రజలు గుర్తించరనే అహంతో తానే సర్వజ్ఞుడునని అనుకుంటాడు. కానీ, ప్రజలు అసామాన్యులు అన్నీ గమనిస్తున్నారు. అవకాశం రాగానే కర్రు కాల్చి వాత పెడతారనడానికి నిదర్శనం మొన్నటి శాసనసభ ఎన్నికల్లో, నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నిరూపించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో చేసిన అవినీతి, అక్రమాలను ఇప్పట్లో తెలంగాణ సమాజం మరిచిపోయే అవకాశం లేదు. కేసీఆర్ ఆయన పరివారం పట్ల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు జాగరూకతతో ఉంటారు. టెస్ట్ మ్యాచ్ల్లో స్టాండ్ బై ఆటగాడుగా ఆయన రానున్న రోజులలో మిగిలిపోతాడు.
- జూకంటి జగనాన్థం,
కవి, రచయిత