భైంసా, వెలుగు : సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అనడం అవివేకమని అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన ఆగాడి వ్యవస్థాపకులు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. శుక్రవారం భైంసాకు వచ్చిన ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణ సీఎంకు ప్రధాని కావాలనే కోరిక ఉందని, ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, ఎవరిని కలిసిన అది సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలో అక్కడి సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌పవార్ లాంటి లీడర్లను కలిశాడని, అయినా ఒరిగేదేమి లేదన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఉక్రెయిన్ లో భారతీయులను సకా లంలో స్వదేశానికి రప్పించడంలో నరేంద్ర మోడి విఫలమయ్యారన్నారు.
వీబీఏ పార్టీని బలోపేతం చేస్తాం..
తెలంగాణ రాష్ట్రంలో వంచిత్ బహుజన ఆగాడి పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. అట్టడుగున ఉన్న ప్రజలందరిని ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. తర్వాత హరియాలి ఫంక్షన్ హాల్ లో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ అణగారిన కులాలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. వారి అభివృద్ధికి ఎంత మాత్రం పాటుపడటం లేదన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గంగాధర్ జాడే, ముథోల్ నియోజకవర్గ కన్వీనర్ నారాయణ వాగ్మరే పాల్గొన్నారు.