అనిల్ రెడ్డికి ఎంపీ సీటు ఆఫర్!

  •     2024 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీకి దింపాలని కేసీఆర్ యోచన
  •     మూడు నియోజకవర్గాల నేతలతో సంబంధాలు కలిగి ఉండడమే కారణం
  •     అదే జరిగితే నల్గొండ పార్లమెంట్ సీటు బీసీలకు ఖాయం

నల్గొండ, వెలుగు : యాదాద్రి డీసీసీ మాజీ ప్రెసిడెంట్ కుంభం అనిల్​కుమార్​రెడ్డికి బీఆర్ఎస్​ హైకమాండ్​ పార్లమెంట్​సీటు ఆఫర్​ చేసినట్లు తెలిసింది. సిట్టింగ్​ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని కాదని భువనగిరి ఎమ్మెల్యే టికెట్​ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఎంపీ టికెట్ హామీతోనే అనిల్​రెడ్డి అధికార పార్టీలో చేరినట్లు బీఆర్‌‌ఎస్‌ సీనియర్​ లీడర్​ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. ఇదే జరిగితే నల్గొండ ఎంపీ సీటు బీసీలకు ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే ఆహ్వానం..

లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన మునుగోడు ఎన్నికల  టైంలో కూడా అనిల్​ రెడ్డిని పార్టీలో ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​ ఫాంహౌజ్‌లో చర్చలు జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగినా.. అనిల్​రెడ్డి దాన్ని కొట్టిపారేశారు. అయితే ఎంపీ కోమటి రెడ్డితో విబేధాల కారణంగా రెండు రోజుల కింద సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.  డీసీసీ​అధ్యక్షుడిగా అనిల్​రెడ్డి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీగా నిలబడితేనే బాగుంటుందని కేసీఆర్ ​భావించినట్లు తెలిసింది.

భువనగిరి, ఆలేరు, నకిరేకల్​, మునుగోడు ప్రజలు, పార్టీ నాయకులతో అనిల్​రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​ రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉండడం, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త మహేందర్​ రెడ్డి సమీప బంధువు కావడం కూడా అనిల్​ రెడ్డికి కలిసొస్తుంది. ఇబ్రహీంపట్నం, జనగాం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ బలం కూడా ప్లస్‌ అవుతుంది.  

బలమైన సామాజిక వర్గం

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీసీ ఓటర్లతో పాటు, రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. 2014లో బీసీ ప్రయోగం చేసిన బీఆర్​ఎస్​ తొలి విజయాన్ని అందుకుంది. కానీ, 2019లో బీసీల్లో అనైక్యత, రెడ్డి సామాజిక వర్గం కలిసికట్టుగా పనిచేయడంతో బూర నర్సయ్యగౌడ్​ ఓడిపోయారు. అయితే ఈయన పార్టీ మారడంతో బీఆర్ఎస్​కు బలమైన లీడర్​ కరువయ్యారు. దీంతో బీఆర్‌‌ఎస్ హైకమాండ్ ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న అనిల్​ రెడ్డిని పార్టీలో చేర్చుకుందని తెలుస్తోంది.  

ALSO READ :8 మంది ఐఏఎస్​ల బదిలీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

నల్గొండ సీటు బీసీలకేనా?

బీఆర్ఎస్ ఇప్పటివరకు నల్గొండ ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేదు. 2014, 201 9 ఎన్నికల్లోనూ ఓడిపోయింది.  నల్గొండ సెగ్మెంట్​లో కాంగ్రెస్​, కమ్యూనిస్టులు బలంగా ఉండటంతో రెండుసార్లు విజయం దక్కలేదు. అయితే భువనగిరి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే నల్గొండ బీసీలకు ఇస్తారనే టాక్​ నడుస్తోంది. ఇప్పటికైతే ఎంపీగా పోటీ చేసే బలమైన బీసీ లీడర్​ పార్టీలో లేరనే చెబుతున్నారు.  కానీ, ఇప్పటికే ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టిన బీఆర్‌‌ఎస్‌కు బీసీ లీడర్‌‌ను తెరపైకి తేవడం పెద్దపనేమీ కాదని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్​ రెండు ఎంపీ స్థానాలు రెడ్లకే ఇస్తోంది.  

ఇదే ఫార్మూలాను బీఆర్‌‌ఎస్‌ పాటిస్తే  గుత్తా సు ఖేందర్ రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డికి అవకాశం ఉందని సమాచారం.   అమిత్​ రెడ్డి  ఎమ్మెల్యే టికెట్‌ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు.  ఛాన్స్ మిస్సయితే తండ్రి గుత్తా వారసుడిగా ఎంపీగా బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నారు.  ప్రముఖ సినీన టుడు అల్లు అర్జున్ మామ వ్యాపార, విద్యా వేత్త కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.