హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఫైనల్ రిపోర్ట్ దాదాపు సిద్ధమైనట్టు తెలిసింది. మరో వారం, పది రోజుల్లో కమిషన్‌కు అందించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్‌కు విజిలెన్స్ డిపార్ట్మెంట్ డీజీ వెల్లడించినట్టు తెలిసింది. మంగళవారం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జస్టిస్ ఘోష్ తో విజిలెన్స్ రిపోర్ట్‌పై చర్చించారు.
ఇప్పటికే మధ్యంతర నివేదిక అందినా.. తుది నివేదిక ఎప్పటిలోగా అందిస్తారని డీజీని కమిషన్ అడిగినట్టు తెలిసింది. రిపోర్ట్ దాదాపు పూర్తయిందని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరికొన్ని డాక్యుమెంట్లు రావాల్సి ఉందని కమిషన్‌కు డీజీ వివరించినట్టు సమాచారం. ఆ డాక్యుమెంట్లు అందగానే మరో వారం పది రోజుల్లో తుది నివేదికను సిద్ధం చేసి అందజేస్తామని కమిషన్‌కు వివరించినట్టు తెలిసింది. కాగా, తుది నివేదిక వచ్చే లోపు కమిషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా రావాల్సిన డాక్యుమెంట్లు ఏమున్నాయని కమిషన్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే పలు లాగ్‌బుక్‌లు, రిజిస్టర్లు, బ్యారేజీల నిర్వహణ రికార్డులను విజిలెన్స్ డిపార్ట్మెంట్కు అందించినప్పటికీ.. క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి నీటి పరీక్షలు, కెమికల్ విశ్లేషణలకు సంబంధించిన రికార్డులు అందలేదని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
ఇప్పటికే మధ్యంతర నివేదిక
కాళేశ్వరం కమిషన్‌కు విజిలెన్స్ ఇప్పటికే మధ్యంతర నివేదికను అందజేసింది. ఈ ఏడాది ఆగస్టులో అప్పటి విజిలెన్స్ ఇన్చార్జ్ డీజీ సీవీ ఆనంద్.. కమిషన్ ముందు హాజరై నివేదిక సమర్పించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత ఈ ఏడాది జనవరిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణకు స్వీకరించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అప్పటి డీజీ రాజీవ్ రతన్ పరిశీలించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసుల్లోనూ సోదాలు చేశారు. అధికారులను పలు దఫాలుగా విచారించారు.
విచారణ కొనసాగుతున్న క్రమంలోనే రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందడంతో విచారణకు అనుకోని బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే విచారణ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్.. రాజీవ్ రతన్ చేసిన విచారణాంశాల ఆధారంగా మధ్యంతర నివేదికను సమర్పించారు. అందులో 22 మంది ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లకు ఆయచిత లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు.
పనులు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని, సంస్థ నుంచి కనీసం అండర్‌టేకింగ్ కూడా తీసుకోలేదని రిపోర్ట్‌లో వెల్లడించారు. క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదని, చేయాల్సిన టెస్టులు చేయలేదని, నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఆ తర్వాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి డీజీగా బాధ్యతలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ ఈఎన్సీ మురళీధర్‌తో పాటు సీడీవో రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్ రెడ్డి, పలువురు ఇంజినీరింగ్ అధికారులు, అకౌంట్స్ డైరెక్టర్ అధికారులను ఇటీవల విచారించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా తుది నివేదికపై విజిలెన్స్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.