- తుంగతుర్తి ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ క్యాడర్ మీటింగ్
మోత్కూరు, వెలుగు: గ్రామ సర్పంచిగా గెలవనోళ్లు ఎమ్మెల్యే అయితే పరిస్థితి గిట్లనే ఉంటుందని, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధత తనదేనని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నారు. కార్యకర్తల కష్ట ఫలితంగానే తనకు చైర్మన్ పదవి వచ్చిందన్నారు. కార్యకర్తలు పంపిన లిస్టే ఫైనల్ అని, వారికి ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లకే ప్రయారిటీ ఇస్తూ.. కాంగ్రెస్ క్యాడర్ ను పట్టించుకోవడంలేదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీరును నిరసిస్తూ సోమవారం మోత్కూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. 9 మండలాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ఏ పని చెప్పినా చేయడం లేదని, కనీసం కాంగ్రెస్ కార్యకర్తలను దగ్గరకు కూడా రానివ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రూ. 10 కోట్ల ఫండ్ ఇస్తే ఎమ్మెల్యే తన కొడుకుకు రూ.90 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడని, మిగతా ఫండ్ ను 20 శాతం పర్సంటేజీలతో బీఆర్ఎస్ కాంట్రాక్టర్లకే ఇచ్చాడని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలనే మెంబర్లుగా పెట్టారని, ఎమ్మెల్యే వెంట ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సూర్యాపేట, యాదాద్రి డీసీసీ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, ధరూరి యోగానందచా ర్యులు, రాష్ట్ర నేతలు వల్లంభట్ల పూర్ణచంద్రరావు, నారగోని అంజయ్య, పర్రెపాటి యుగంధర్, కాసోజు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.