‘విద్య లేక వివేకం లేదు. వివేకం లేక వికాసం లేదు. వికాసం లేక ప్రగతి లేదు’’ మహాత్మా జ్యోతిబా ఫూలే అన్న మాటలివి. ఫూలేతో కలిసి దేశంలో ఆనాటి అంధకార యుగంలోనే జ్ఞానజ్యోతులు వెలిగించిన మహాతల్లి సావిత్రీబాయి. వారిద్దరి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి అందరికీ అన్నీ చేస్తున్నామని మన పాలకులు ఉపన్యాసాలు దంచుతారు. కానీ, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పేద, మధ్యతరగతి జనాలు ఎక్కువగా ఆధారపడేది బడ్జెట్ స్కూళ్లు/కాలేజీలపైనే. కరోనాతో దారుణంగా దెబ్బతిన్న వీటిని పట్టించుకునే తీరిక మన పాలకులకు లేదు. ఎంతో మంది ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు మహమ్మారి కారణంగా బతుకుదెరువు కోల్పో యారు. వీరిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ స్కూళ్లు 25,966. ఇందులో 19,100 స్కూళ్లలో మాత్రమే తాగునీటి వసతి ఉన్నది. కేవలం 14,000 స్కూళ్లలో ఆటస్థలాలు ఉన్నవి. టీచర్లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు ఆఖరికి మరుగుదొడ్లు లేని స్కూళ్లు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. అందువల్లే రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. తమ చేతకానితనానికి పాలకులు టీచర్లను నిందించడం- ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా కనిపిస్తోంది. వంద మంది స్టూడెంట్లు సర్కారు ప్రైమరీ స్కూళ్లలో చేరితే, పదో క్లాస్‌కు చేరుకునేసరికి 63 మంది మాత్రమే మిగులుతున్నారు. సామాజిక, ఆర్థిక కారణాల వల్ల ఎంతో మంది స్టూడెంట్లు డ్రాప్ ఔట్స్‌గా మిగిలిపోతున్నారు. ఈ 63 మందిలో కూడా 30 శాతం మాత్రమే టెన్త్‌లో ఉత్తీర్ణులు అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం విద్యను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేయడమే. రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిన ఈ రంగాన్ని ఎన్నో ఏండ్లుగా ఆదుకుంటున్నది బడ్జెట్ స్కూళ్లే. రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్ స్కూళ్లు 11,470. వీటిలో పనిచేసే టీచర్ల సంఖ్య 2 లక్షల పైచిలుకు ఉంటుంది. రాష్ట్రంలో చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లకు పోతున్న స్టూడెంట్ల సంఖ్య 60 శాతానికిపైగా ఉంది. ఇంత ప్రాధాన్యం ఉన్న, అక్షరాస్యతలో ఎంతో భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్ల టీచర్లను, యాజమాన్యాలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బజారున పడేసింది.
మూతపడే స్థితిలో బడ్జెట్ స్కూళ్లు
కార్పొరేట్ స్కూళ్లను మినహాయిస్తే.. దిగువ మధ్యతరగతి, పేద వర్గాల పిల్లలు ఎక్కువగా చదివేది ఈ బడ్జెట్ స్కూళ్లలోనే. సాధారణంగా వీటిలో ఫీజులు తక్కువ, అందునా పేరెంట్స్ స్కూల్ ఫీజులు కట్టేది సంవత్సరం చివరలో. కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని స్కూళ్లూ దాదాపు మూతబడ్డాయి. దీంతో ఫీజుల చెల్లింపు ఆగిపోయింది. టీచర్లకు జీతాలు ఇవ్వలేక, బిల్డింగ్‌లకు అద్దె చెల్లించలేక, అప్పులకు కిస్తీలు కట్టలేక బడ్జెట్ స్కూళ్ల నిర్వాహకులు తీవ్ర వేదనలో ఉన్నారు. ఇక ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది. తమ గోడు పట్టించుకోవాలని, తమ బతుకుదెరువు నిలబెట్టాలని నిరసనగళం ఎత్తినా వీరి గోడును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసులు, పట్టణాల్లోని విద్యా శాఖ ఆఫీసులు, ధర్నాచౌక్‌లో సైతం నిరసనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. బడ్జెట్ కాలేజీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం కాలేజీల్లో దాదాపు 25 శాతం ప్రైవేట్ బడ్జెట్ కాలేజీలే. వీటిలోనూ దాదాపుగా బడ్జెట్ స్కూళ్లలోని పరిస్థితులే ఉన్నాయి.
ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న బడ్జెట్ స్కూళ్లు
1990ల్లో సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రభుత్వాలు విద్యను ప్రైవేట్‌పరం చేయడం మొదలైంది. విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గించడం, టీచర్ రిక్రూట్‌మెంట్‌లు ఆపేయడం కారణంగా డిగ్రీలు, పీజీలు చదువుకున్న లక్షలాది మంది విద్యావంతులకు ఉపాధి, ఉద్యోగాలు లేకుండా పోయింది. దీంతో వీరిలో చాలా మంది చిన్నచిన్న స్కూళ్లు, హోం ట్యూషన్లు, ట్యుటోరియల్ కాలేజీలు పెట్టుకుని జీవించడం మొదలైంది. ఇదేమీ ప్రజలను దోచుకునే వ్యాపారం కాదు. అవేమీ కార్పొరేట్ స్కూళ్లు కాదు. జనాభాలో 52 శాతం మందికి విద్యను అందిస్తూ, మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నవే ఈ బడ్జెట్ స్కూళ్లు. వీటిలో- స్కూల్ బస్సులు నడిపేవారు, వాటిని మెయిన్‌టైన్ చేసేవారు, స్కూలు పుస్తకాలు అమ్మేవారు, స్కూలు డ్రస్సులు కుట్టేవారు, ఆయాలు, స్వీపర్లు.. ఇట్లా మొత్తంగా లక్షలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అలాంటి బడ్జెట్ స్కూళ్లను గోస పెట్టడం ప్రభుత్వానికి తగదు.
కూలి పని చేసుకుంటున్నరు
రెండు లక్షల మంది ప్రైవేట్ టీచర్లకు, మరో లక్ష మంది నాన్-టీచింగ్ స్టాఫ్‌కు సగటున పది వేల రూపాయల జీతం లెక్క వేసినా కరోనా కారణంగా ప్రతి నెలా దాదాపు రూ.300 కోట్లు ఆగిపోయినై. మరో పది వేల మంది విద్యా వలంటీర్లు కూడా బతుకుదెరువు కోల్పోయారు. ఈ ప్రభావం వారి జీవన ప్రమాణాలపై, సమాజంపై, ఆర్థిక వ్యవస్థపైనా పడుతోంది. ఐటీ ఆధారిత సేవలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ తర్వాత అంత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం ఎడ్యుకేషనే. అలాంటి రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లను గాలికి వదిలేయడం సరికాదు. బతుకుదెరువు లేక ఊళ్ల బాట పట్టి ఉపాధి హామీ కూలీ లాంటి పనులు చేసుకుంటున్న ప్రైవేట్ టీచర్లు ఎంతో మంది ఉన్నారు. వీరంతా తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. కరోనా ఒక విపత్తును తీసుకువస్తే.. పాలన సరిగ్గా చేయక కేసీఆర్ ఒక ఉత్పాతాన్ని తెచ్చి పెట్టారు.
ఒక అకడమిక్ ప్లాన్ లేదు
ఆన్‌లైన్ క్లాసులు అనేది మరో ప్రహసనం. దీని వల్ల పేద, దిగువ మధ్యతరగతి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, కనీసం టీవీలు కూడా లేక చదువు దక్కడం లేదన్న మనస్తాపంతో చాలా మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా సరే ఇవేవీ సీఎం కేసీఆర్‌కు పట్టకపోవడం శోచనీయం. ఒక అకడమిక్ ప్లాన్ లేదు. ఒక కమిటీ లేదు. ఒక రివ్యూ లేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ లాంటి మంచి మోడల్స్ ఉన్నా.. మన పాలకులకు, అధికార యంత్రాంగానికీ పట్టడంలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటూ విద్యా శాఖ అధికారులు మూడు నెలల కింద ఒక నివేదిక ఇస్తే, ఇప్పటివరకూ కేసీఆర్ కంటిచూపునకు కూడా అది నోచుకోలేదు.
డిమాండ్లను పరిష్కరించాలి
బడ్జెట్ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింప చేసి అమలు చేయాలి. తద్వారా స్కూళ్ల నిర్వాహకులు కొంత ఊరట పొందుతారు. టీచర్లకు జీతాలు ఇవ్వగలుగుతారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే అకడమిక్ ప్లాన్ ప్రకటించాలి. క్లాసులు, పరీక్షలు జరుగుతాయో లేదో ఆందోళనలో ఉన్న పేరెంట్స్, స్టూడెంట్లకు భరోసా ఇవ్వాలి. ఏ ఒక్క స్టూడెంట్ చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇది వారి ప్రాథమిక హక్కని పాలకులు గుర్తుంచుకోవాలి.
అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నం
విద్య అనే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకోవడం మొదలైన తర్వాత అందరికీ అక్షరాస్యత మాట కల్లలైపోయింది. ఏడేండ్ల కేసీఆర్ పాలనలో ఇది మరింత దారుణంగా మారింది. నేడు అక్షరాస్యతలో దేశంలోనే మనది 32వ స్థానం. మన అక్షరాస్యత కేవలం 66 శాతం. ఇందులో మగవాళ్లు 75 శాతం కాగా, ఆడవాళ్లు 57 శాతం. తొలి విడత ఐదేండ్ల టీఆర్ఎస్ పాలనలో మహిళా మంత్రి లేని, నిన్న మొన్నటిదాకా మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్ దిక్కులేని పరిస్థితిలో అక్షరాస్యత ఇట్లా ఎందుకుందో ఊహించడం కష్టమేమీ కాదు. మహిళా సాధికారత సంగతి దేవుడెరుగు, అక్షరాస్యతలో మహిళల శాతం 57 మాత్రమే కావడం విషాదం. అందునా, చాలా జిల్లాలు మహిళా అక్షరాస్యతలో రాష్ట్ర సగటుకంటే వెనుకబడి ఉన్నాయి. మెదక్ 51, నిజామాబాద్ 51, ఆదిలాబాద్ 51, మహబూబ్‌నగర్ 44 శాతాలతో మన పాలకులు ఘనంగా చెప్పుకుంటున్న ‘దేశమంతా తెలంగాణ దిక్కే చూస్తున్నది’అనే మాట పరిహాసంగా మారింది! హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను మినహాయిస్తే మహిళల విద్యలో మనం అధ:పాతాళంలో ఉన్నాం.-శ్రీశైల్‌రెడ్డి పంజుగుల, టీజేఎస్ నేత