మండలి మీడియా పాయింట్.. బీసీల సమగ్ర సర్వేపై ఎవరేమన్నారంటే..

మండలి మీడియా పాయింట్.. బీసీల సమగ్ర సర్వేపై ఎవరేమన్నారంటే..
  • మండలి మీడియా పాయింట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర సర్కార్ చేసింది బీసీల సమగ్ర సర్వే కాదు.. అగ్ర కుల సర్వే అని ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్న విమర్శించారు. ‘‘ఈ సర్వే తప్పుల తడకగా ఉంది. సర్వేలో ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదు. తెలంగాణలో4.20 కోట్ల జనాభా ఉండగా, 3.70 కోట్ల మందే ఉన్నట్టు చెబుతున్నారు. 

మరి మిగిలిన 50 లక్షల మంది ఏమయ్యారు? రాష్ట్రంలో 60 శాతం మంది బీసీలు ఉంటారు. కానీ సర్వేలో బీసీల జనాభా తగ్గి, అగ్ర కుల జనాభా పెరిగింది. మరి పెరిగిన ఓసీలు ఎక్కడున్నారు? దీన్ని బట్టే ఈ సర్వేలో లోపాలు ఉన్నాయని స్పష్టమవుతున్నది. ఈ సర్వే బీసీల విషయంలో క్లారిటీగా లేదు. ఈ నివేదికతో బీసీలకు ఒరిగేదేమీ లేదు” అని తీన్మార్ మల్లన్న అన్నారు. 

100% సర్వే చేయాలి: నర్సిరెడ్డి  

ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టిన కులగణన సర్వే రిపోర్ట్ శాస్త్రీయమైనదా? కాదా? అనేది పరిశీలించాల్సి ఉందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ‘‘సర్వేలో చాలా కుటుంబాలను టచ్​చేయలేదు. మిగిలి పోయిన కుటుంబాలను కూడా సర్వే చేయాలి. అసమగ్రంగా కాకుండా, వందశాతం కులగణన చేయాలి. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్​ఇచ్చిన నివేదిక కరెక్ట్ గా ఉంది” అని చెప్పారు.  

మళ్లీ సర్వే చేయాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 

ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, మళ్లీ సర్వే చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ‘‘సర్వే అసమగ్రంగా ఉంది. తప్పులను సరిదిద్దాలంటే రీసర్వే చేయాల్సిందే. అప్పటి వరకూ మా పార్టీ పోరాడుతుంది” అని మధుసూదనాచారి అన్నారు. తూతూమంత్రంగా సర్వే నిర్వహించారని ఎల్.రమణ విమర్శించారు. రీసర్వే చేయాల్సిందేనని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

పార్టీని విమర్శిస్తే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

పార్టీని విమర్శిస్తూ ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం మండలి మీడియా పాయింట్​లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ కులగణనపై తీన్మార్​మల్లన్న చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. పార్టీని విమర్శిస్తూ ఎవరు మాట్లాడినా చర్యలు ఉంటాయి’’ అని  తెలిపారు.

‘‘కులగణన సర్వే,  ఎస్సీ వర్గీకరణ తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయం. బీసీలను పదేండ్లు పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు వాళ్లపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. కులగణన రిపోర్టును మండలిలో ప్రవేశపెట్టగానే బీఆర్ఎస్​సభ్యలు వాకౌట్ చేయడంతో.. వాళ్ల రంగు బయటపడింది” అని మండిపడ్డారు.