బీఆర్​ఎస్​ లీడర్లు సర్కారును కూలుస్తామనడం కరెక్ట్​ కాదు : కోదండరాం

  •     ప్రాంతాల అస్తిత్వాన్ని మరిచి జిల్లాలను విభజించారు
  •     పీవీ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తే దేశానికే గర్వకారణం
  •     ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

హుజురాబాద్, వెలుగు: అధికారంలో లేకుంటే జీవించలేని స్థితి బీఆర్ఎస్ నాయకుల్లో ఉందని, తాము తప్ప ఎవరూ పాలన చేయొద్దంటే ప్రజలు సహించరని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఏ ప్రభుత్వమైనా స్కీమ్​లు ప్రకటిస్తుందని, కానీ ప్రజాస్వామిక పాలన‌ చేయడం ముఖ్యమన్నారు. పైసలతో రాజకీయాలను తారుమారు చేద్దామనే పద్ధతి పోవాలన్నారు. హుజురాబాద్​లో పీవీ హుజురాబాద్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామిక పాలన - ఉద్యమకారుల పాత్ర’ అనే అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ బీఆర్ఎస్​ సర్కార్ హయాంలో ప్రాంతాల అస్తిత్వాన్ని విస్మరించి జిల్లాలను విభజించారని, కానీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కమిషన్ వేయాలని నిర్ణయించిందన్నారు. త్వరలో జరగబోయే నియోజకవర్గాల విభజనలోనూ ప్రాంతాల  అస్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్​ సంగతి చూస్తామని బీఆర్ఎస్​ లీడర్లు బెదిరిస్తున్నారని, ఎవరూ కిరీటాలతో పుట్టలేదని, కిరీటాలతో పోరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనేకమంది పోరాటం చేస్తే తనకు పేరొచ్చిందని, అధికారం, గుర్తింపు ప్రజలకు ఉపయోగపడాలే కానీ.. కేసీఆర్ లెక్క సొంతానికి వాడుకోబోనన్నారు.  

డీజిల్ ​ఇంజిన్ ​తెచ్చింది పీవీనే...

దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు దేశంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను తీసుకురాక ముందు కూడా ఈ ప్రాంతంలో కొత్త ఆవిష్కరణలకు తెరలేపారని కోదండరాం అన్నారు. ‘ఈ ప్రాంతానికి తొలిసారిగా డీజిల్ ఇంజిన్ తీసుకొచ్చింది ఆయనే. దానిని విప్పి ఎలా రిపేర్ చేయాలో కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ వచ్చింది.. యుగం మారింది. దానిని నేర్చుకోకుంటే వేస్టు అని ‌కంప్యూటర్ కూడా నేర్చుకున్నారు. 80 ఏండ్ల వయసులో తెలుగులో టైపు చేయడం నేర్చుకుని తన పుస్తకాలను తానే టైపు చేసుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ విశేషమైన కృషి చేశారు. అదే పీవీ ప్రత్యేకత. ఇలాంటి నేత పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తే రాష్ట్రానికే‌కాదు దేశానికే గర్వకారణంగా ఉంటుంది.' అని కోదండరాం అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీ వొడితల ప్రణవ్ బాబు,  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, ముక్కెర రాజు, జేఏసీ చైర్మన్ ఆవునూరి సమ్మయ్య, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, పలకల ఈశ్వర్ రెడ్డి,  పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, ఈదులకంటి రవీందర్ రెడ్డి, వేల్పుల రత్నం, వర్డినేని రవీందర్ రావు, భీమదేవరపల్లి జేఏసీ కన్వీనర్ రాచమల్ల సారయ్య, డాక్టర్ తడికమళ్ల శేఖర్ పాల్గొన్నారు.