అగ్నిపథ్‌పై తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు, ఆందోళనలు, హింస చెలరేగుతున్నాయి. విచక్షణ, లోతైన చర్చ లేకుండా ప్రతీదాన్ని వ్యతిరేకించడం, లేదా సమర్థించడం సరికాదు. అగ్నిపథ్ మంచిదో కాదో తేల్చాల్సింది, వీధుల్లోనో, రోడ్లపైనో కాదు. ప్రభుత్వం ఓ పని చేస్తే.. అది ఏమిటి? ఎందుకు? అని చూడకుండా వెంటనే దాన్ని విమర్శించడం ఆనవాయితీగా మారింది. ఇది మంచా? చెడా? మరింత బాగా చేయడం సాధ్యమా? ఎలా చేయాలి? అనే చర్చపోయి.. ప్రతిపక్షాలు, ప్రభుత్వ వర్గాలు ఒకరినొకరు తిట్టుకోవడం పారిపాటిగా మారింది. మార్పు మొదలైనప్పుడు ప్రతిఘటన ఎదురవడం సహజం. బ్యాంకుల్లో కంప్యూటరీకరణ ప్రారంభించినప్పుడు వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు కంప్యూటర్లేకుండా బ్యాంకులు నడిచే పరిస్థితి లేదు. అగ్నిపథ్ విషయంలోనూ మంచి చెడులు, లోతును అర్థం చేసుకోకుండా, విశ్లేషించకుండా గుడ్డెద్దు చేన్లో పడినట్లు దాన్ని వ్యతిరేకించడం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు.
సైనిక దళాల ఆధునికీకరణ దిశగా
దేశంలో దాదాపు15 లక్షల మంది సైన్యంలో ఉన్నారు. బయట మరో10 లక్షల మంది రిజర్వ్డ్దళాల్లో కొనసాగుతున్నారు. ఆధునిక యుగంలో సైనిక సంఖ్యా బలం కంటే, సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు, వాటిని వాడే శక్తి సామర్థ్యం, నేర్పరితనం అవసరం. ఎంత పెద్ద సైన్యమున్నది అని కాకుండా.. ఎంత సమర్థమైన సైన్యం ఉన్నదన్నది ముఖ్యం. ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే.. ప్రపంచంలో దానిది సాటిలేని మేటి సైనిక శక్తి. ఏ దేశం కూడా అమెరికాను తేరిపారా కూడా చూడలేదు. అమెరికాకు దీటుగా చైనా ఆర్థిక శక్తిగా ఉన్నా.. సైన్యం విషయంలో అమెరికా ముందు దిగదుడుపే. ఇక్కడ చైనాకు సైన్యం లేదని కాదు.. అమెరికాతో పోలిస్తే అయిదురెట్ల ఎక్కువ సైన్యం ఉంది. మరి అమెరికాకు బలం ఎక్కడున్నదంటే.. సాంకేతిక శక్తిలో ఉన్నది. సరైన యుద్ధవిమానాలు, నౌకలు, డ్రోనులు, క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు, ఉన్న సైన్యానికి కూడా వేగంగా స్పందించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల దేశానికి ఉపయోగం ఉంటుంది కానీ, ఊరికే మందిని తీసుకొని, జీతాలు ఇస్తూ.. కవాతు చేయిస్తే ప్రయోజనం ఉండదు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ పదాతిదళాలను ఆధునిక యుద్ధ తంత్రానికి తగినట్లుగా తయారు చేయడం అవసరం.
ఉక్రెయిన్ సైన్యం ఆదర్శం..
సైన్యం ఎలా ఉండాలి. ఎలాంటి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలనే దానికి ఉక్రెయిన్ఆదర్శం. రష్యాతో జరుగుతున్న పోరులో ఉక్రెయిన్ చాలా పటువైన ఆయుధాలు.. డ్రోన్సు సహా వివిధ ఆధునిక ఆయుధాలు ఉపయోగిస్తోంది. రష్యా అంతటి పెద్ద దేశాన్ని.. చిన్న దేశమైన ఉక్రెయిన్ నిలువరిస్తోందంటే అది సాంకేతిక విజ్ఞానం, ఆధునిక ఆయుధాల వల్లే సాధ్యమవుతోంది. కాగా ఉక్రెయిన్ ఒక్క సైనికుడిని కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేదు. ఉన్న సైన్యంతోనే రష్యాను నిలువరిస్తోంది. ఆధునిక యుద్ధ తంత్రం అంటే అది. భారత సైన్యం విషయంలోనూ ఇలాంటి మార్పులే రావాల్సి ఉంది. కాలక్రమేణ రక్షణ కోసం పెట్టే బడ్జెట్.. యుద్ధంలో పనికొచ్చే రీతిలో ఖర్చు పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అగ్నిపథ్‌ను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం సైనిక దళాల కోసం ఏటా 5 లక్షల 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇందులో 54 శాతం నిధులు సైనికుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం పోతుండగా.. ఆయుధాలు, క్షిపణలు, ఇతర శక్తి సామర్థ్యాల పెంపునకు ఖర్చు చేస్తోంది కేవలం 46 శాతమే. ఆయుధాలన్నీ తుప్పుపడుతోంటే, ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకోకపోతే, దానిలో ఆధునిక శిక్షణ, సామర్థ్యం, నేర్పరితనం లేకపోతే ప్రపంచ దేశాల ముందు ఇండియా వెనకబడే అవకాశం ఉంది. అందుకే అగ్నిపథ్‌లో భాగంగా.. ఏటా 40 నుంచి 50 వేల మందిని, కాల క్రమేణా లక్షా 60 వేల మందిని సైన్యంలోకి తీసుకోవాలని, నాలుగేండ్ల తర్వాత.. వారిలో మూడో వంతు మందిని, వారు ఇష్టపడితే, మంచి సామర్థ్యం చూపిస్తే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన వారు మంచి పారితోషికంతో రిటైర్‌అవుతారు. వారికి వెంటనే చిన్న వయసులోనే వేరే ఉద్యోగం, స్వయం ఉపాధికి అవకాశం ఉంటుంది. ఒక ప్రయత్నం చేద్దాం.. ఒక ప్రయోగం చేద్దాం.. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించుకుందాం. కానీ దేశంలో ప్రభుత్వం ఏం చేసినా? ఏ చట్టం తెచ్చినా? పూర్వాపరాల పరిశీలన లేకుండా వెంటనే ఖయ్యుమని వ్యతిరేకించడం సరికాదు. అగ్రి చట్టాల విషయంలోనూ ఇదే జరిగింది. రైతులకు పనికొచ్చే చట్టాలు, స్వేచ్ఛనిచ్చే చట్టాలు, కాలక్రమేణా రైతుకు మార్కెట్లో రేటు ఎక్కువ ఇచ్చే చట్టాలు వస్తే.. రైతులు అపోహలతో వ్యతిరేకించారు. వాటిలో ఉన్న మంచిని రైతులకు వివరించడంలో ప్రభుత్వం విఫలమై చట్టాలను వెనక్కి తీసుకుంది. ఫలితంగా వ్యవసాయంలో ఆధునికీకరణ, వ్యవసాయానికి సంకెళ్లు తొలగించడంలో మరింత ఆలస్యమవుతోంది. అగ్నిపథ్విషయంలోనూ మంచి, చెడుల విశ్లేషణ లేకుండా గందరగోళం చేస్తున్నారు.
గందరగోళంగా రాజకీయం..
దేశంలో రాజకీయం గందరగోళంగా మారింది. జనజీవనం కంటే, ఈ దేశ భవిష్యత్కంటే, ఆటంకం లేని శాంతియుత సమాజం కంటే.. రాజకీయంగా నేతలు అధికారం పొందడం, నిలుపుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తూ పనిచేస్తున్నారు. ఈ పార్టీ, ఆపార్టీ అనే తేడా లేదు. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్లు గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఆ పనే చేశారు. గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంగా కొనసాగుతున్న వారు అదే పని చేస్తున్నారు. ఇది సరికాదు. ఏ విషయమైనా సరే సాధ్యాసాధ్యాలు, మంచి చెడులు, లాభనష్టాలు సునిశితంగా పరిశీలిద్దాం. ప్రభుత్వం తన పని తాను నిజాయితీగా వేగంతో చేయాలని కోరుకుందాం. ప్రభుత్వం ఏ చేస్తోంది ? చేస్తున్నది పనికొస్తుందా? లేదా? అది సమాజ ప్రయోజనాలను కాపాడుతుందా? లేదా? వాస్తవాల ఆధారంగా ఉందా? లేదా? హేతుబద్ధంగా ఉందా? లేదా? మనం దాన్ని బట్టే నిర్ణయం చేయాలి.
ప్రభుత్వాలు ఉన్నది ఉద్యోగాలిచ్చేందుకేనా?
ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు ఉన్నాయన్న భావన రాష్ట్రాల్లో, కేంద్రంలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇంతకంటే మూర్ఖపు ఆలోచన మరొకటి లేదు. రక్షణ శాఖ ఉద్యోగాలు ఇచ్చే సంస్థ కాదు. దేశ రక్షణకు ఏం కావాలో, ఏం చేయాలో నిర్ణయించే విభాగం. అగ్నిపథ్పేరుతో కాంట్రాక్టు సైనికులను నియమించాలని ప్రభుత్వం చూస్తోందని కొందరు అంటున్నారు. అగ్నిపథ్ ఉద్యోగం కాంట్రాక్టు అనడం సరికాదు. ఆ మాటకొస్తే ఏదైనా కాంట్రాక్టే. 15 ఏండ్ల సర్వీస్ కాంట్రాక్టు కాదా? గతంలో షార్ట్సర్వీస్కమిషన్ ఉండేది. ఒకప్పుడు ఐదేండ్లే ఉండేది అది కాంట్రాక్టు కాదా? తర్వాత ఏడేండ్లు ఉండేది. అది కాంట్రాక్టు కాదా? ఇవన్నీ పసలేని వాదనలు. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఇదే విధానం కొనసాగుతోంది. ప్రభుత్వాలను ఎన్నుకున్నది.. నిర్ణయాలు, పాలన చేయడం కోసం. ఆ పాలన చేసేటప్పుడు వాస్తవాల ఆధారంగా హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నారో మన ముందు పెట్టాలి. కొంతమందికి ఆ నిర్ణయం ఇష్టం లేకపోవచ్చు.. అప్పుడు రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా విమర్శించవచ్చు, మరో మార్గం సూచించవచ్చు, పార్లమెంట్లో, బయట చర్చలు చేయొచ్చు. అంతేగానీ ఇష్టమొచ్చినట్లు హింసకు పాల్పడటం, జనాలకు ఇబ్బంది కలిగించడం సరికాదు.
జయప్రకాశ్ నారాయణ,
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు