స్వచ్ఛంద సంస్థలపై పొలిటికల్ పార్టీల ఆత్రం : దొంతి నర్సింహారెడ్డి

భారతదేశంలో పౌర సమాజానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒక గుర్తింపు ఉన్నది. సామాజిక సమస్యలను గుర్తించడంలో రాజ్యం లేదా పాలక వ్యవస్థ విఫలమైనప్పుడు సామాజిక ఎజెండాను చేపట్టిన సంఘ సంస్కర్తలు చాలా మంది ఉన్నారని చరిత్ర చెబుతోంది.  స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, దాతలు, సంఘ సంస్కర్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వేతర అభివృద్ధి సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు, అనేక రకాల వేదికలు పౌర సమాజంలోకి వస్తాయి. సీసీఐ, చాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి కంపెనీల సంస్థలు కూడా ఈ కోవలోకే  వస్తాయి. ఆధునిక పౌర సమాజంలో, ప్రత్యేకంగా ప్రపంచీకరణ నేపథ్యంలో, పాలకులతో కలిసి అడుగులు వేసే సంస్థలు, పాలకులకు  భిన్నంగా నడిచే సంస్థలు, అచ్చంగా ప్రజలతోనే నడిచే సంస్థలుగా విభజించుకుంటే ఎవరు, ఎక్కడ, ఏ ప్రయోజనాల కొరకు పని చేస్తున్నారు అనే విషయం మనకు బోధపడుతుంది. 1990 నుంచి భారత దేశంలో ఉదారవాద అభివృద్ధి దిశకు మళ్లినప్పటి నుంచి పౌర సమాజం మన దేశంలో అనేక మార్పులకు, ఒత్తిడులకు లోను అయ్యింది. క్రమంగా, స్వతంత్ర పౌర సమాజం బలహీనపడుతూ వస్తున్నది.

పాలకుల స్వచ్ఛంద సంస్థలు..

ప్రభుత్వ విధానాల మీద నిఘా పెట్టి, సరి చేసే పౌర సమాజం బలహీనం కావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రభుత్వాలు కూడా పని గట్టుకుని పౌర సమాజం మీద దాడి చేస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా, తక్కువ ఖర్చుతో చేరాలంటే స్వచ్చంద సంస్థల అవసరం ఉంది అని గుర్తించిన ప్రభుత్వాలు, గత 20 ఏళ్ళ నుంచి వాటిని దూరం పెట్టడం ప్రారంభించారు. అదే సమయంలో, వ్యాపారం, వాణిజ్యం, ఉదారవాద విధానాల కోసం పాటుపడే స్వచ్చంద సంస్థల ప్రభావం పెరిగింది. ప్రజలకు దగ్గర ఉండే సంస్థల కంటే, పాలకులకు దగ్గరగా ఉండే సంస్థల పాత్ర పెరిగింది. ఇవి కన్సల్టెంట్లుగా మారి, ప్రభుత్వంలో భాగం అయ్యి, తెరచాటున ప్రభుత్వ విధానాల్లో, కార్యక్రమాల్లో ఇతోధిక పాత్ర పోషిస్తున్నాయి. గత 20 ఏళ్లలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, స్వతంత్ర స్వచ్చంద సంస్థలకు వచ్చే నిధులపై దృష్టి పెట్టి బలహీనం చేస్తూనే ఉన్నారు. అందులో ప్రభుత్వం వాడుతున్న ఆయుధం, విదేశీ నిధుల మీద నిర్బంధం.

విదేశీ పెట్టుబడులు ఓకే..  మరి స్వచ్ఛంద సంస్థలకు?

విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, విదేశీ నిధులు వ్యాపారంలో, ఉత్పత్తిలో, విపణులలో ప్రవహించటానికి నిబంధనలు సడలిస్తూ, కొత్త చట్టాలు తెస్తూ, స్వచ్చంద సంస్థలకు మాత్రం నిధులు రాకుండా అడ్డుకట్టలు వేయడం గత 30 ఏళ్ళుగా పరిపాటిగా మారింది. దేశంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా పని చేసే స్థాయిలో ఉండడానికి స్వచ్చంద సంస్థల పాత్ర ఉంది అని అంగీకరిస్తూనే.. రాజకీయంగా తమకు అనుకూలం కాదని ఆ సంస్థలను తొక్కేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు, రాజ్యాంగ సంస్థలు చేష్టలుడిగి చూస్తున్నప్పుడు, రాజకీయ నాయకులకు పౌర సమాజం ఆపద్బాంధవులుగా కనపడతారు. 

విరాళాలు తగ్గుతున్నాయి..

కేంద్ర ప్రభుత్వంలో 2020 సెప్టెంబర్ 28న తెచ్చిన కొత్త విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ సీఆర్ఏ) నిధులను స్వచ్చంద సంస్థలు పొందే ప్రక్రియను మరింత కఠినతరం చేస్తుంది. దీని మీద ఏ ఒక్క పొలిటికల్ పార్టీ తగు రీతిలో స్పందించలేదు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎఫ్ సీఆర్ ఏ నిబంధనలను కఠినతరం చేశారు. దేశంలో కొన్ని లక్షల పౌర సమాజ సంస్థలు ఉన్నా, 2021 డిసెంబర్ చివరి నాటికి విదేశీ నిధులు పొందే యోగ్యం ఉన్నవి కేవలం 22,762 సంస్థలు. పైకి, మతం పేరు మీద వచ్చే నిధుల నియంత్రణ అని చెబుతున్నా, ఇతర సంస్థల మీద కూడా వేటు పడింది.

మొత్తం విదేశీ నిధులు రూ.20 వేల కోట్లకు మించవు. దీనిలో కూడా కేవలం కొన్ని సంస్థలకే వేల కోట్ల నిధులు వస్తాయి. కొన్ని వేల సంస్థలకు ఒక కోటి రూపాయల లోపే నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, 2017-–-18 నుంచి 2021-–-22 వరకు వచ్చిన నిధులు మొత్తం రూ.88,882 కోట్లు. 2017–-21 కాలంలో, 6,677 సంస్థలు విదేశీ నిధులు పొందే అర్హత కోల్పోయిన తరువాత కూడా నిధులు తగ్గలేదు అంటే, ఇచ్చేవారు, తీసుకునేవారు మారిపోతున్నారు. రాష్ట్రాలవారీగా విదేశీ నిధుల ప్రవాహం పరిశీలిస్తే, మూడేళ్లలో, పాలకులకు దగ్గరగా ఢిల్లీకి చెందిన ఎన్జీవోలకు అత్యధికంగా వచ్చినాయి. ఆ తర్వాత అధికంగా కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లకు వచ్చాయి.​

ఇటీవలి కాలంలో, ప్రకృతి వైపరీత్యాల సంఖ్య పెరిగినా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తలేవు. నిధులు విడుదల చేస్తలేవు. విదేశీ నిధుల మీద ఆంక్షల నేపథ్యంలో ఉత్పాతాల బాధితులకు ఉపశమనం వచ్చే ఆ ఒక్క దారి సన్నబడిపోయింది. కంపెనీలు విధిగా ఖర్చు చేయాల్సిన సీఎస్​ఆర్​ నిధులు ఆయా కంపెనీల జేబు సంస్థలకు, ప్రచారానికి, ఆర్భాటానికి, రాజకీయ నాయకుల నియోజకవర్గాల్లో ఉపయోగపెడుతున్నాయి. విస్తృత లక్ష్యాల మీద, సమ సమాజ నిర్మాణం కొరకు, అభివృద్ధిలో ఉండే తారతమ్యాలను రూపుమాపేందుకు ఖర్చు కావడం లేదు.

పాలకులకు నచ్చితేనే..

భారతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థలు  సామాజిక సంస్థలకు పెట్టుబడి రూపంలో మూలధనం అందించడంతో పాటు కొన్ని నిర్దిష్ట రంగాలలో (విద్య, వైద్యం, తదితర) పనిచేయడానికి గ్రాంట్లు అందించే నమూనా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా, ప్రభుత్వ విధానాలను, పథకాలను, నిధులను వాడుకుంటూ తమ టెక్నాలజీ, తమ వ్యాపార పద్ధతులకు మన దేశంలో అవకాశాలు కల్పించుకుంటున్నారు. బిల్ గేట్స్ కు సంబంధించిన సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రతిష్ట, పరపతి, ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్ లో ప్రస్తావించే వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ లేకపోవడం మనం గమనించాలి. తెలంగాణ ప్రభుత్వానికి ఒక అంతర్జాతీయ సంస్థ గత కొన్ని ఏండ్లుగా బడ్జెట్ మీద ‘సలహాలు’ ఇస్తున్నది. ఇక్కడే ఉండి స్థానిక అనుభవం ఉన్న సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ కు ఆ స్థానం ఇవ్వకపోవటం మనం గమనించాలి. తెలంగాణాలో వాణిజ్యం ద్వార అభివృద్ధి సాధించటానికి ఒక విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుని, వారి బృందానికి ప్రభుత్వ కార్యాలయంలో స్థానం కల్పించి ప్రణాళికలు రచించటానికి అహోరాత్రులు శ్రమిస్తున్నారు.

పౌర సమాజం పాత్ర పెంచాలి

ప్రభుత్వేతర సంస్థలు రాజ్యాధికారాన్ని ఎన్నడూ కాదనలేదు. కాకపోతే, పాలనకు బలమైన కేంద్రీకృత విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించడంతో ఘర్షణ నివారణ సాధ్యం కాకపోవచ్చు. ఈ ఘర్షణలో నలిగిపోయేది పౌర సమాజం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య లాభాపేక్ష లేని పౌర సమాజం పాత్ర ఎప్పటికీ ఉంటుంది. వైవిధ్యంతో కూడిన విస్తృత పౌర సమాజం అవసరం ప్రభుత్వానికి, పాలకులకు, సమ సమాజ నిర్మాణానికి, ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత అవసరం. రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీలు, అధికారులు, వ్యాపార సంస్థలు తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. పౌర సమాజ వ్యతిరేక ధోరణి మానుకోవాలి. భారత దేశం సుస్థిరంగా, శాంతియుతంగా ఉండాలంటే పౌర సమాజం పాత్రను పెంచాలి.

బీఆర్​ఎస్​కు ఆపద వస్తే  పౌర సంస్థలు గుర్తొస్తాయి

ఈ దశాబ్దంలో  ఒక పార్టీ ఇంకొక పార్టీని ‘రూపుమాపే’ ప్రయత్నాలు ఊపు అందుకున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు, విపక్షాలను నిర్వీర్యం చేసే ప్రణాళికలు రచిస్తున్నాయి. అందుకే, యే హటావో, వో హటావో అని నినాదాలు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణలో బలహీన పడ్డ పార్టీలకు ఇప్పుడు పౌర సమాజం గుర్తుకు వస్తున్నది. తెలంగాణాలో టీఆర్ఎస్​ పార్టీ భాజపాతో పోరాటంలో పౌర సమాజం కలిసి రావాలని ఇప్పుడు కోరుతున్నది.  తెలంగాణ పోరాటంలో స్వచ్చంద సంస్థల పాత్ర గణనీయమైనది. అయినా కూడా, తెలంగాణా ఏర్పడినాక ఏనాడూ ఆయా సంస్థలను పట్టించుకోని టీఆర్ఎస్​ నాయకత్వం, భాజపాతో జరుగుతున్న విధ్వంసకర రణంలో మేధావులు కలిసి రావాలని పిలుపు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా తనకు మద్దతుగా ఆయా సంస్థల మద్దతు కోరుతున్నది. తాను అధికారంలో ఉన్న దశకంలో విదేశీ నిధులు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. 

నేతల సొంత సంస్థలే..

వాటర్ షెడ్ అభివృద్ధి, పొదుపు, రుణం, అడవుల పెంపకం, సంక్షేమ కార్యకలాపాలు వంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్చంద సంస్థలను ప్రభుత్వం మారుస్తున్నది. అవినీతి తగ్గించటానికి ఇలా చేస్తున్నారని అనుకుంటారు. అయితే, అవినీతి పాలనా వ్యవస్థలోనే ఉందని, స్వచ్ఛంద రంగంలో లేదనే వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించరాదు. స్వచ్ఛంద రంగం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. అవినీతి తగ్గించటానికి ప్రభుత్వం పూనుకుంటే, పాలనా సంస్కరణల్లో స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యాన్ని కనుగొనవచ్చు. ఈ దిశగా భాగస్వామ్యం నెలకొల్పకుండా, ప్రభుత్వం రాజకీయ నాయకుల సొంత సంస్థలతో జత కట్టింది. కొన్ని రాష్ట్రాలు ప్రజా ప్రతినిధులకు సర్వ అధికారాలు కట్టబెట్టాయి. ఇటువంటి మార్పుల వల్ల అవినీతి పెరిగింది. ఆశ్రిత పక్షపాతం వేళ్ళూనుకుంది. లబ్దిదారుల పరిస్థితి శూన్యంగా మారుతుంది. 

- దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​