అది ప్రగతిభవన్‌‌ కాదు.. అబద్ధాల భవన్‌‌. .

అది ప్రగతిభవన్‌‌ కాదు. అబద్ధాల భవన్‌‌. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అబద్ధాలు మాట్లాడి.. జనాన్ని మోసం చేయటం టీఆర్ఎస్‌‌కు అలవాటుగా మారింది. గ్రాడ్యుయేట్లు ఓట్లేసే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే అలవాటును రిపీట్‌‌ చేసింది. ఉద్యోగాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్పుకుంది. పెట్రోల్‌‌ ధరలు పెరిగిపోతున్నాయని సవతి ప్రేమ నటించింది. కేంద్రం ఒక్క కొత్త సంస్థనూ మంజూరు చేయలేదని, ఉన్న నిధులన్నీ బీజేపీ పాలించే రాష్ట్రాలకు మళ్లిస్తోందంటూ కొత్త పురాణం మొదలు పెట్టింది. వీటి లోతుపాతులు పరిశీలించిన ప్రతి ఒక్కరికీ అసలు నిజాలేమిటో తెలిసిపోతాయి.

ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్‌‌
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస దెబ్బలు తగిలినందుకే టీఆర్ఎస్‌‌లో ఫ్రస్ట్రేషన్‌‌ మొదలైంది. అదే అసహనం గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరోచితంగా పోరాడిన యూనివర్సిటీ స్టూడెంట్లను టీఆర్ఎస్‌‌ ప్రభుత్వం ఏడేండ్లుగా మరిచిపోయింది. ఈసారి ప్రచారంలో యూనివర్సిటీ స్టూడెంట్లు అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు. యూనివర్సిటీ క్యాంపస్‌‌లలో టీఆర్ఎస్‌‌ పార్టీ లీడర్లు అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడికక్కడ స్టూడెంట్లు వారిని అడ్డుకోవటం చూస్తే ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ను పట్టించుకోలేదని సామాన్యులకు సైతం తెలిసిపోయింది. అబద్ధాల టీఆర్ఎస్‌‌ను ప్రజలు నమ్ముతలేరు. ఈ వరుస పరిణామాలతో పింక్‌‌ పార్టీ​లీడర్ల అసహనం పీక్స్‌‌కు వెళ్లింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వారిని పట్టుకుంది. అందుకే ఆ పార్టీ లీడర్లు తప్పుడు కూతలు కూశారు. ఏది తోచితే అది మాట్లాడారు.​ ఏకంగా మీడియాకు పిచ్చి పట్టిందని కేటీఆర్‌‌ ఎగతాళి చేశారు. తెలంగాణ ఉద్యమంలో మీకు పబ్బతి పట్టిన మీడియా ఇప్పుడు మీకు పిచ్చి మీడియాగా కనిపిస్తోందా? పిచ్చి చానల్.. పిచ్చి టీవీ‌ అంటుంటే ఎవరికి పిచ్చి పట్టిందనేది తెలిసిపోతోంది. ఈ విషయాన్ని జనం తెలుసుకోలేరని అనుకుంటే అది మీ అమాయకత్వం. సొంత లీడర్లను కాళ్లు పట్టి.. బండకేసి కొడతామంటున్నారు. ప్రతిపక్ష లీడర్లను తుపాకీతో కాలుస్తమని బెదిరిస్తున్నారు. ఇంత నీచమైన రాజకీయానికి ఒడిగట్టేందుకేనా.. మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది.

సెంట్రల్‌‌ నిధులపై నిందలు
కేంద్ర ప్రభుత్వం నిధులను మళ్లిస్తోందని టీఆర్ఎస్‌‌​తప్పుడు ప్రచారం చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం నిధులను కేంద్రం పంపిణీ చేస్తోంది. అందులో తెలంగాణకు రావాల్సిన వాటా వస్తోంది. దీనికి తోడు సెంట్రల్‌‌​స్పాన్సర్డ్ స్కీమ్‌‌ల కింద వచ్చే నిధులు, ఫైనాన్స్‌‌​కమిషన్‌‌ గ్రాంట్లు అదనం. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇచ్చే గ్రాంట్లకు తోడు జీఎస్టీ పరిహారం కూడా రాష్ట్రానికి చెల్లిస్తోంది. అన్నీ కలిపితే ఈ ఏడాది దాదాపు రూ.34 వేల కోట్లు రాష్ట్రానికి విడుదలవుతాయి. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న రేషన్‌‌​బియ్యం సబ్సిడీ ఎవరు భరిస్తున్నారు? అందులో కేంద్రం వాటా లేదా? ఇవన్నీ ఇస్తున్నా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేస్తోంది. తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్నుల్లో సగం కూడా కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వటం లేదని.. ఉన్న నిధులన్నీ ఉత్తరప్రదేశ్‌‌కు మళ్లిస్తోందని కేటీఆర్‌‌ అర్థంపర్థం లేని వాదన చేస్తున్నారు. దేశరక్షణ వ్యవహారాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఏడాది దాదాపు 5 లక్షల కోట్ల బడ్జెట్‌‌ ఖర్చు చేస్తోంది. ఇదంతా మన రక్షణ.. మన దేశభద్రత కోసం కాదా? ఇందులో మన రాష్ట్ర వాటా ఉండదా? రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, భూములను కేటాయించటంలో చూపిన నిర్లక్ష్యం కారణంగానే ఐటీఐఆర్, కాజీపేట వ్యాగన్‌‌​కోచ్‌‌​ఫ్యాక్టరీ ఆగిపోయాయి కదా. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందాలని.. ఇవన్నీ కేంద్రంపై నెట్టేస్తున్నారని జనం గమనిస్తూనే ఉన్నారు.

వ్యాట్‌‌​తీస్తే పెట్రోల్‌‌పై రూ.29 ఆదా
పెట్రోల్‌‌ రేట్లు పెరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ ఒలకబోస్తోంది. అంతర్జాతీయ చమురు ధరలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని భూతద్దంలో చూపించే ముందు.. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌‌పై ఎంత వ్యాట్‌‌​ బాదుతుందో తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌‌పై దాదాపు 35 శాతం వ్యాట్‌‌ వేస్తోంది. ఇందులో కేంద్రానికి ఒక్క రూపాయి పోదు. అంటే ఇదంతా రాష్ట్ర ఖజానాకే. ఈ వ్యాట్‌‌​వసూలు చేయాలా.. తగ్గించాలా.. మొత్తం మినహాయించాలా.. అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. ఈ చార్జీ ఎత్తేస్తే లీటర్ పెట్రోల్‌‌పై రూ.29 నుంచి రూ.30 వరకూ తగ్గుతుంది కదా? అదంతా దాచిపెట్టి.. తప్పు మొత్తం కేంద్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం గుండెలు బాదుకోవటం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే.

అన్నీ ఖాళీలే.. నింపిందెక్కడ
విభజన తర్వాత ఉద్యోగుల పంపిణీతో.. రాష్ట్రంలో 4.91 లక్షల సాంక్షన్డ్‌‌ ​కేడర్‌‌​స్ట్రెంగ్త్‌‌ ఉండాలి. ఇప్పుడు 3 లక్షల మందే ఉన్నారు. మరి మిగతా ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారు. లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. 1.32 లక్షల జాబ్ లిస్ట్ రిలీజ్ చేసిన కేటీఆర్‌‌కు ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదా? రాష్ట్రంలో 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ కమిషన్ తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు 36,665 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి.. 29,128 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది కదా. అదేమీ పట్టించుకోకుండా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు టీఆర్ఎస్‌‌ ప్రభుత్వం అబద్ధాలాడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్‌‌ అయ్యాయి. ఎప్పుడెప్పుడు ఏమేం పోస్టులు రిక్రూట్‌‌ చేస్తారో.. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చెయ్యాలి. రేపు మాపు నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు ఎందుకు చెబుతున్నారు? ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వటం లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కేస్తే ఒక్కో నిరుద్యోగికి రూ.80 వేల చొప్పున ప్రభుత్వం బాకీ పడింది నిజం కాదా? ఉద్యోగాలిచ్చినట్లు చెబుతున్న మీరు ఏడేండ్లలో ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలిగించారో లెక్కలు ప్రకటించండి. ఈజీఎస్‌‌​ ఫీల్డ్ అసిస్టెంట్లను, మిషన్‌‌​భగీరథ, హార్టీకల్చర్‌‌లో ఉద్యోగులను తీసేసింది ఎవరు?

సింగరేణిని ముంచే ప్లాన్
తెలంగాణ ఏర్పడే నాటికి సింగరేణిలో 64 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఏడేండ్లలో వారి సంఖ్య 42 వేలకు తగ్గింది. ఇది టీఆర్ఎస్‌‌ గొప్పతనమేనా. తెలంగాణ ఆవిర్భావానికి ముందు 36 భూగర్భ గనులు ఉంటే ఇప్పుడు 25కు తగ్గిపోయాయి. అప్పుడు 11 ఓసీపీలు ఉంటే వాటి సంఖ్య నేడు 20కి పెరిగింది. సింగరేణిలో ఓసీపీలను తవ్వకుండా కుర్చీ వేసుకుని కూర్చుంటానన్న కేసీఆర్‌‌.. ఎక్కడపోయిండు. ఓసీపీలు ఎందుకు పెరిగినై.. ఉద్యోగాలు ఎందుకు ఊడినయ్? సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా వాడుకుంటున్నది. ఏటా రూ.1,500 కోట్లు సెస్‌‌ రూపంలో సింగరేణి చెల్లిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతోనే సింగరేణి ఉద్యోగులు, కార్మికుల జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది పడుతోంది. ఓవర్​డ్రాఫ్ట్ తీసుకుంటోంది. సింగరేణి బొగ్గు, ఉత్పత్తి చేసిన విద్యుత్‌‌కు సంబంధించి జెన్‌‌కో, ట్రాన్స్‌‌కో ఇవ్వాల్సిన రూ.12 వేల కోట్ల బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. కోల్‌‌ ఇండియా పరిధిలోని గనుల్లో పనిచేసే కార్మికులు పొందే ప్రయోజనాలపై ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ను కేంద్రం రీయింబర్స్‌‌‌ చేస్తోంది. సింగరేణిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేయక పోవడంతో కార్మికులపైనే భారం పడుతోంది.

- డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ మెంబర్​