విశ్లేషణ : రాజ్యాంగాన్ని మార్చాలనడం సరి కాదు

జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి రెండేండ్లలో దేశ రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ మూడ్రోజుల క్రితం ప్రగతిభవన్ లో మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అక్కడితో ఆగకుండా ఇంకా ఒకడుగు ముందుకువేసి మన దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని, అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్​ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. అయితే ఆయన ప్రకటనల వెనక దాగి ఉన్న మర్మం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. కానీ, రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం ఎంత మాత్రం సరికాదు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం లేదా మార్చడం అనేది ఏ సమస్యకైనా పరిష్కారం చూపించదు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని పాలకులు సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రజలకే నిజమైన హక్కులు లభిస్తాయి. కానీ, ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే అడుగడుగునా కనిపిస్తోంది. రాజకీయ నాయకులే ఈ విషయంలో ముందుంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తేనే దళితులు, సామాన్యుల జీవితాల్లో మార్పు అనేది వస్తుంది. 
 

ఇది ద్వంద్వ వైఖరి కాదా?
గడిచిన సంవత్సరం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ భారతరత్నం.. ఈ దేశం కన్న ముద్దుబిడ్డ, ఆయన రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్​ 3 ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. ఇప్పుడు తెలంగాణ ఇలా ఉందంటే అది అంబేద్కర్​ పుణ్యమేనని, ఆయన లేకపోతే తెలంగాణ లేదని పేర్కొన్నారు. కానీ ఇప్పడు అదే కేసీఆర్ ఆ రోజు చెప్పిన దానికి భిన్నంగా కామెంట్లు చేయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. అంబేద్కర్​ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలని ప్రకటించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? మన దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ ప్రకటనలు రావడం కొత్తేమీ కాదు. అడపాదడపా ఉత్తరాది రాష్ట్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు ఇటువంటి చవకబారు ప్రకటనలు చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ఇటువంటి ప్రకటన చేయడం మాత్రం ఇదే తొలిసారి. బహుశా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలని, ప్రజల దృష్టి మొత్తం తన చుట్టే తిరగాలనే భ్రమలో కొత్త రాజ్యాంగం కావాలనే ప్రతిపాదనను కేసీఆర్​ తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అంబేద్కర్ పొందుపరచకపోతే కేసీఆర్​ అసలు ముఖ్యమంత్రి అయ్యేవారా? అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? అనే విషయంపై కేసీఆర్​ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.
 

రాజ్యాంగ రక్షణకు అందరూ ఏకం కావాలె
సోషలిస్టు రాజ్యాలు, సామ్యవాద రాజ్యాలు కావాలని కోరుకున్న కమ్యూనిస్టుల సిద్ధాంతాల ప్రకారమే అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్థిక, సామాజిక సమానత్వం అంశాలను పొందుపరిచారు. అంత మేథస్సు కలవ్యక్తి అంబేద్కర్. నిజానికి మారుతున్న పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి ఏమైనా అంశాలను, నిబంధనలను సవరించవలసి వస్తే ఆర్టికల్ 368 ద్వారా మార్చుకునే వెసులుబాటు రాజ్యాంగమే కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎన్నో సార్లు మన రాజ్యాంగాన్ని సవరించుకున్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో.. అదే రాజ్యాంగం మీద రాజకీయ అవకాశవాదంతో దాడి చేయడం ఎంత మాత్రం సరికాదు. మనుస్మృతిని మళ్లీ తీసుకురాకుండా, కేసీఆర్ లాంటి వారి పాచికలు పారకుండా దేశ ప్రజలు.. ముఖ్యంగా దళిత, బహుజనులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ భావజాలాన్ని గ్రామీణ పునాదుల‌‌‌‌ మీద నిలబెట్టి రాజ్యాంగ రక్షణ కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చింది.