ఐదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్‌కు నాంది పలుకుతుందని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న రామోజీ రావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీరావు పాత్ర ఎంతో ఉందని అన్నారు.
నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా? అన్న ఆలోచన ఉన్న సమయంలో రీసెర్చ్ చేసి, ‘అమరావతి’ పేరును రామోజీరావు సూచించారని చెప్పారు. తెలుగు భాష, తెలుగు జాతి అంటే ఆయనకు ఎనలేని ఆప్యాయతని చెప్పారు. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలని సూచించారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలని ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యతని అన్నారు.
ఎన్టీఆర్, రామారావు ఇద్దరూ యుగపురుషులని తెలిపారు. నీతి, నిజాయతీకి ప్రతిరూపం రామోజీరావు అని ఎంచుకున్న ప్రతి రంగంలోనూ నెంబర్ వన్‌గా ఎదిగారని చెప్పారు. రామోజీ ఫిల్మ్‌సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారని, కొవిడ్ వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు అని సీఎం చంద్రబాబు అన్నారు.