గ్రేటర్ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం

గ్రేటర్ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంప్లి, చందానగర్  ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చాలాచోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి తమ ఇండ్లకు చేరుకుంటున్న ఉద్యోగులు, కూలీలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లల్లోకి వర్షపు నీరు


కూకట్ పల్లి లో కురిసిన భారీ వర్షానికి ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. కేపీహెచ్ బీలో ఎంఐజీ 88లోని ఇంటిలోకి వర్షపు నీరు చేరడంతో ఇంట్లోని వాళ్లంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరుకుంటోంది.

జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చందానగర్ లో 4.3 సెంటీమీటర్లు, అత్తాపూర్ లో 2.3 సెంటీమీటర్లు, మియాపూర్ లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో బంజారాహిల్స్ లోని రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు..హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, కోకాపేట్, గండిపేట, మణికొండ, పుప్పాల్ గూడా, హిమాయత్ సాగర్, బండ్లగూడ జాగిర్, కిస్మత్ పూర్, హైదర్ షాకోట్ వంటి ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.

జంట జలాశయాల(హిమాయత్ సాగర్,  ఉస్మాన్ సాగర్ )కు భారీగా వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. హిమాయత్ సాగర్  2 గేట్లు, ఉస్మాన్ సాగర్(గండిపేట) 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 
వనపర్తి జిల్లాలో ముగ్గురు గల్లంతు

వనపర్తి జిల్లా మదనాపూర్ సమీపంలో కాజ్ వే పై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కాజ్ వే దాటుతూ బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.