రాష్ట్రవ్యాప్తంగా రికాంలేని వాన

రాష్ట్రవ్యాప్తంగా రికాంలేని వాన

 

  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • జూరాల 17 గేట్లు ఓపెన్.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద 
  • పోటెత్తుతున్న ప్రాణహిత, ఇంద్రావతి..
  • పరవళ్లు తొక్కుతున్న గోదావరి
  • భూపాలపల్లి, ములుగు,  భద్రాద్రి జిల్లాల్లో హై అలర్ట్
  • రంగంలోకి రెస్క్యూ టీమ్​లు
  • హైదరాబాద్​లో రెండు రోజులుగా ముసురు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వానలు పడ్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు కళకళలాడుతున్నాయి. జూరాల 17 గేట్లను తెరిచి.. వరద నీటిని శ్రీశైలం వైపు వదులుతున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులు పోటెత్తడంతో కాళేశ్వరం దిగువన గోదావరి ఉరకలెత్తుతున్నది. వరద ఉధృతి పెరుగుతుండడంతో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆఫీసర్లు హైఅలర్ట్‌‌‌‌ ప్రకటించారు. 

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తాజా వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి సహా వివిధ పంటలు ఊపిరిపోసుకున్నాయి. సీజన్​ మొదలయ్యాక పెద్దవాన ఇదే కావడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. పలు జిల్లాల్లో గురువారం నుంచి, హైదరాబాద్​లో శుక్రవారం సాయంత్రం నుంచి ముసురుపట్టింది. 

ప్రమాదకరంగా పొచ్చర జలపాతం

ఆదిలాబాద్​ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం ప్రమాదకరంగా దూకుతుండడంతో సందర్శకులకు మూడు రోజుల పాటు అనుమతి రద్దుచేశారు. కుంటాల జలపాతం కూడా పరవళ్లు తొక్కుతున్నది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉప్పొంగింది. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టు మత్తడి దూకుతున్నది. నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. 

ప్రాజెక్టులకు వరద

పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. ఎగువ నుంచి 8,942 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.884 టీఎంసీల నీళ్లున్నాయి. నిజామాబాద్​ జిల్లాలో వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి క్రమంగా వరద పెరుగుతున్నది.  ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ 80.5 టీఎంసీలు కాగా,  ప్రస్తుతం 18.131 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఎగువ నుంచి 18,275  క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతున్నది. 

భద్రాద్రి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం

 ఖమ్మం జిల్లాలో మూడు, నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు అలుగు పోస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.  ప్రస్తుతం 5 లక్షల 96 వేల 8053 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు 35.10 అడుగులకు చేరింది. 43 అడుగులకు వరద చేరితే గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక  రిలీజ్ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 

తాలిపేరు ప్రాజెక్ట్​లోకి వరద కొనసాగుతుండడంతో 25 గేట్లను ఎత్తిన అధికారులు లక్షా 43వేల 248 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ పలు శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. మూడు జిల్లాల్లో హై అలర్ట్​గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండడంతో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆఫీసర్లు హై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పలిమెల, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, భద్రాచలం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ టీమ్​లు, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. ములుగు జిల్లాలో నాలుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలో మూడు చొప్పున స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్లను సిద్ధంగా ఉంచారు. ఒక్కో జిల్లాలో మూడు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. 

వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకున్నట్లుగా ప్రకటించారు. భూపాలపల్లి జిల్లాలోని మారుమూల ముంపు ప్రాంతాలను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖరే పరిశీలించారు. ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బోట్లో ప్రయాణించారు. మూడు జిల్లాలలో ప్రభుత్వం తరఫున కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు.  

కలెక్టర్​గారూ.. పడవ ఏర్పాటు చేయండి ఆసిఫాబాద్​ జిల్లా దిందా గ్రామస్తుల విజ్ఞప్తి 

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వరుసగా రెండో రోజు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో తమ దుస్థితిపై కలెక్టర్​వెంకటేశ్​ ధోత్రే కు గ్రామస్తులు లెటర్​ రాశారు.  తమ ఊరికి బ్రిడ్జి లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.  

ఇప్పట్లో బ్రిడ్జి పూర్తయ్యే పరిస్థితి లేనందున కనీసం వాగు దాటేలా పడవ సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. ఇక జిల్లాలోని ప్రాణహిత, వార్దా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సిర్పూర్(టి) మండలం చీలపల్లి సమీపంలోని శివసందు ఒర్రె పొంగి, లోలెవల్ వంతెన కొట్టుకోపోయింది. దీంతో చీలపల్లి, లింబుగూడ, మేడిపల్లి, చిన్న మాలిని, మాలిని, మానిక్ పటారు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

హైదరాబాద్​లో నాన్​స్టాప్

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​లో శుక్రవారం సాయంత్రం నుంచి ముసురు కంటిన్యూగా పడుతున్నది. 2 రోజులుగా నగరమంతటా మబ్బులు కమ్ముకున్నాయి. ముసురు వానతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జనం ఇబ్బందులుపడ్డారు. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి.  సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకు ఇబ్బందులు తప్పలేవు. వర్షం కారణంగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రెండురోజులుగా జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్​కు 150 కిపైగా ఫిర్యాదులు వచ్చాయి.   ఏదైనా అత్యవసరమైతే హైల్ప్ లైన్  నంబర్ 040–-21111111  సంప్రదించాలి. అదేవిధంగా డీఆర్ ఎఫ్ బృందాల సాయంకోసం 9000113667 ఫోన్​ నంబర్​ను సంప్రదించాలని అధికారులు సూచించారు.  

నిండుకుండలా హుస్సేన్​ సాగర్​

హుస్సేన్ సాగర్ లోకి వస్తున్న వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం 24 గంటలూ పరిశీలిస్తున్నది.  నగరంలో కంటిన్యూగా కురుస్తున్న ముసురుకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్  పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు కాగా..  ఆదివారం సాయంత్రానికి  నీటిమట్టం 513.23 మీటర్లకు చేరింది. హుస్సేన్ సాగర్ కు ప్రస్తుతం 1,517 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, 998 క్యూసెక్కుల నీటిని అలుగులు, తూము ద్వారా బయటకు పంపుతున్నారు.