తిరుమలలో ఎడ తేరిపిలేకుండా వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా శ్రీవారి ఆలయం ముందు భాగం, లడ్డూ కౌంటర్, నాలుగు మాఢ వీధులు, షాపింగ్ కాంప్లెక్స్ తో పాటుగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
వర్షం కురవడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, తిరిగి శ్రీవారి దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చే భక్తులు, వసతి గదులకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రెండు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని విజిలెన్స్ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. తిరుమల, తిరుపతికి చేరుకునే వాహనదారులు ఓపికతో తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు.. కరకంబాడి రోడ్డులో ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కింది. అయితే.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.