భద్రాద్రికొత్తగూడెం/మహబూబాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్జిల్లాలను వాన విడవడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులు ఉప్పొంగుతుండగా, లో లెవల్బ్రిడ్జీల వద్ద పోలీస్పహారా కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 9.8 సెం.మీ, చండ్రుగొండలో 9.3, టేకులపల్లిలో 6.8, దమ్మపేట, ములకలపల్లి, జూలూరుపాడులో 4.3 నుంచి 4.8 సెం.మీ, ఇల్లందు, అశ్వారావుపేట, గుండాలలో 3.1 నుంచి 3.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. చండ్రుగొండ-సీతాయిగూడెం, ఇల్లందు-సత్యనారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
కొత్తగూడెంలోని గోదుమ వాగు, ముర్రెడు వాగు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని కిన్నెరసాని, మల్లన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిన్నెరసాని వరదలో గల్లంతైన దంతెలబోర గ్రామానికి జారే సాయికృష్ణ(30) ఆచూకీ ఆరు రోజులైనా లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో మూడు రోజులుగా విడువకుండా కురుస్తున్న వానలతో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది.
మానుకోటలో రాష్ట్రంలోనే అత్యధికం..
మహబూబాబాద్జిల్లాను వర్షం వీడడం లేదు. భారీ వర్షాలతో మానుకోట జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. శనివారం రాత్రి మహబూబాబాద్జిల్లా కేంద్రంలో 182.50 మి.మీ వర్షపాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు భారీ వర్షం కురవడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం సైతం వర్షం కురవడంతో జిల్లాలోని ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని బయ్యారం, డోర్నకల్ చిన్నగూడురు, నరసింహులపేట మండలాల్లో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
గతంలో జరిగిన నష్టం నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షం రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్జిల్లాలోని జిల్లెల వాగు ఉప్పొంగడంతో గుండం రాజుపల్లి- చిన్నగూడురు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆకేరు వద్ద లో లెవల్ కాజ్‌వేపై భారీగా వరద రావడంతో తొర్రూరు- మహబూబాబాద్రూట్లో బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. డోర్నకల్మండలం బండిపాడు వద్ద బుగ్గ వాగు ఉప్పొంగడంతో ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.