- లోక్ సభ ఎన్నికల తర్వాత చేంజ్!
- పేరు అచ్చిరాకపోవడమే కారణం
- సూత్రప్రాయంగా తెలిపిన మాజీ ఎంపీ వినోద్
- నేమ్ లో తెలంగాణ ఉంటేనే సెంటిమెంట్
- అందుకే పొరుగు రాష్ట్రాలను వదిలేశారా?
భారత రాష్ట్రసమితి ఈ పేరు అచ్చి రాలేదు.. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయాం.. నాయకులు జైలు పాలయ్యారు.. తెలంగాణ అనే పదాన్ని విడిచి కష్టాలు ఎదుర్కొంటున్నాం. వెనక్కు వెళ్తేనే బెటర్.. కాదు.. కాదు వెనక్కు వెళ్లాల్సిందే.. ఇది గులాబీ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయమని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాస్తా టీఆర్ఎస్ గా మారబోతోందని సమాచారం. 2023 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పేరుటో ఎన్నికల బరిలో నిలిచిన కారు పార్టీ పరాజయం పాలైంది. పదేండ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమితిగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి కోరి కష్టాలు తెచ్చుకుంది. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఇటీవల ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ గా పేరు మార్చడం తమ పార్టీలో 80శాతం మందికి ఇష్టం లేదని, ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల రివ్యూలో కార్యకర్తలు ముక్తకంఠంతో ఇదే మాట చెప్పారని అన్నారు.
మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనే దానిపై న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తెలంగాణ పేరు పార్టీలో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల అనంతరం చర్చించి కచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గతంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం బీఆర్ఎస్ పేరు అచ్చిరాలేదనే అభిప్రాయం ఉందంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబానికి అతి దగ్గరగా ఉండే వినోద్ కుమార్ ఈ మాట చెప్పడంతో బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారనుందని, త్వరలోనే ఈ చేంజ్ ఉంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
జలదృశ్యం టు తెలంగాణ భవన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా జలదృశ్య వేదికపై 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిష్కృతమైంది. తొలుత నాగలిపట్టిన రైతన్న ఎన్నికల గుర్తుపై స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరం మే 17న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయ మార్పులకు వేదికైంది. అప్పటి నుంచి కీలక నేతలు గులాబీ పార్టీలో చేరడం ప్రారంభించారు. ఆ సమావేశానికి జేఎంఎం చీఫ్, అప్పటి జార్ఖండ్ సీఎం శిబూ సోరెన్ హాజరయ్యారు. తర్వాత టీఆర్ ఎస్ కార్యకలాపాలకు బంజారాహిల్స్.. నందినగర్ లోని కేసీఆర్ నివాసం వేదికైంది. 2004లో వైఎస్ ప్రభుత్వం తెలంగాణ భవన్ కు స్థలం కేటాయించడంతో అక్కడ పార్టీ ఆఫీసు నిర్మితమైంది. 2006లో తెలంగాణ భవన్ ను ప్రారంభించి అక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలు మొదలయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం.. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ జాతీయ వేదికలపై ప్రసంగాలు చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్టు ప్రకటించారు.
ఈ పరిణామ క్రమంలో అక్టోబర్5, 2022( విజయదశమి) రోజున తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారింది. అనుబంధ సంఘాలు సైతం తెలంగాణను పక్కకు నెట్టేసి భారతను యాడ్ చేసుకున్నాయి. ఆ తర్వాత ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటు చేసి తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించారు. మహారాష్ట్రలో పలు పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి స్వయంగా కేసీఆర్ వెళ్లి పార్టిసిపేట్ చేశారు. తన అన్నకొడుకు వంశీధర్ రెడ్డిని మహారాష్ట్ర ఇన్ చార్జిగా నియమించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. పేరులో తెలంగాణను తొలగించుకోవడంపై ప్రజలు ఆదరించడం లేదంటూ రివ్యూల్లో కార్యకర్తుల, నాయకులు చెప్పడంతో పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ గా పేరు మార్చి సెంటిమెంట్ రగిలించి మళ్లీ అస్తిత్వాన్ని కూడగట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారనే టాక్ ఉంది.