వరుస షాక్ లతో కేసీఆర్ బేజారు.. కాంగ్రెస్‌లోకి మరో ఆరుగురు!?

వరుస షాక్ లతో కేసీఆర్ బేజారు.. కాంగ్రెస్‌లోకి మరో ఆరుగురు!?
  •  నేడో, రేపో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక
  •  నిన్న అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు
  •  ఈ సారి కీలక నేతలు కూడా ఉండే చాన్స్
  •  సెంట్రల్, నార్త్, సౌత్ తెలంగాణల నుంచి ఇద్దరేసి?

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నేడో రేపో కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం. ఈ విడుతలో కీలక నేతలు ఉంటారని తెలుస్తోంది. నిన్న రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. గులాబీ బాస్ ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో ఆరుగురు కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. ఇందులో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు, హెచ్ఎండీఏ పరిధిలోని ఇద్దరు, దక్షిణ తెలంగాణలోని ఇద్దరు పార్టీ మారబోతున్నారు. 

ఈ సారి చేరికల్లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే వారు ఉంటుండటం గమనార్హం. ఇప్పటి వరకు దానం నాగేందర్(ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ), సంజయ్(జగిత్యాల), కాలె యాదయ్య(చేవెళ్ల) అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగతా వారు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్  రెడ్డి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికను జెడ్పీ చైర్ పర్సన్ సరిత వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో పరిస్థితిని వివరించారు.  

సిక్స్ ఫిక్స్ - పరేషాన్ చేస్తున్న సార్ లక్కీ నంబర్

కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు.. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఆరే..నిన్న సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నది కూడా ఆరుగురు ఎమ్మెల్సీలే కావడం గమనార్హం. ఇవాళ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని అధ్యక్షతన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. 30 మంది కార్పొరేటర్లు, ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టడం గమనార్హం. ఈ సమావేశానికి శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, అంబర్ పేట, ఉప్పల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు గైర్హాజరవటం చర్చనీయాంశంగా మారింది.