అల్లు అర్జున్ బెయిల్‎పై అప్పీల్.. బన్నీకి బిగ్ షాక్ తప్పదా..?

అల్లు అర్జున్ బెయిల్‎పై అప్పీల్.. బన్నీకి బిగ్ షాక్ తప్పదా..?
  • అల్లు అర్జున్ బెయిల్‎పై అప్పీల్..!
  • హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును 
  • సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు 
  • సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు
  • తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం 
  • లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్న

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్‎కు హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, ఆ తీర్పుపై అప్పీల్‎కు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, చిక్కడపల్లి పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.  

నిర్వహణ లోపాలతోనే తొక్కిసలాట.. 

సంధ్య థియేటర్ యాజమాన్యానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ నెల 12న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించారు. ఆ రోజు సెలబ్రిటీలు, భారీ సంఖ్యలో వచ్చిన జనానికి అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోలేదని.. నిర్వహణ లోపాలతో తొక్కిసలాట జరిగిందని.. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్నించారు.  ‘‘సంధ్య 70ఎంఎం, 35ఎంఎం థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 

రెండు థియేటర్లలో దాదాపు 2,520 మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ ఉంది. రెండింటికి కామన్ ఎంట్రెన్స్‌‌‌‌, ఎగ్జిట్‌‌‌‌ ఉన్నాయి. వీటిని సూచించే విధంగా సైన్‌‌‌‌బోర్డులు లేకపోవడంతో ప్రేక్షకులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు గుమిగూడడానికి అవకాశం ఇచ్చారు. థియేటర్‌‌‌‌‌‌‌‌‎లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. అల్లు అర్జున్ వస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు” అని నోటీసుల్లో పేర్కొన్నారు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.