మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. శివసేనకు గుండె పగిలే వార్త చెప్పిన బీజేపీ లీడర్..!

మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. శివసేనకు గుండె పగిలే వార్త చెప్పిన బీజేపీ లీడర్..!

ముంబై: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి కేబినెట్ 2024, డిసెంబర్ 14 నాటికి విస్తరణ జరగనుందని బీజేపీ కీలక నేత ఒకరు నేషనల్ మీడియాకు తెలిపారు. దీంతో పాటు ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. మహాయుతి కూటమిలో భాగస్వామ్యపక్షమైన శివసేనకు వారు కోరుకున్నట్లు హోం శాఖ దక్కే అవకాశం లేదని.. హోంశాఖనే కాకుండా మరో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా శివసేనకు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పారు. శివసేనకు అర్భన్ డెవలప్మెంట్ పోర్ట్ ఫోలియో కేటాయించవచ్చని ఆయన తెలిపారు. 

ALSO READ | రాహుల్ వర్సెస్ కల్యాణ్.. మరోసారి ఇండియా కూటమిలో భిన్న స్వరాలు

కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి సీఎం పదవితో సహా 21 నుండి 22 మంత్రి పదవులు వస్తాయని భావిస్తున్నామని.. కేబినెట్‎లో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఖాళీగా ఉంచవచ్చని ఆయన చెప్పారు. మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన, ఎన్సీపీ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతోందని తెలిపారు. మహా సీఎం పగ్గాలు చేపట్టాక బుధవారం (డిసెంబర్ 11) తొలిసారి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లారని, ఇది మర్యాదపూర్వక పర్యటనన్నారు. విస్తరణపైన బీజేపీ అగ్రనేతలతో సీఎం ఫడ్నవీస్ చర్చించే అవకాశం ఉందన్నారు. 

కాగా, 2024, నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 230 చోట్ల విజయకేతనం ఎగరేసి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితై.. గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక కూటమికి సవాల్‎గా మారింది. ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 10 రోజుల అనంతరం వివిధ నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‎ను ఎన్నుకున్నారు. 

ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా సెలక్ట్ అయ్యారు. 2024, డిసెంబర్ 5న వీరు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ఎంపిక పూర్తి కావడంతో నెక్ట్స్ కేబినెట్ సెలక్షన్ పైన కసరత్తు జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాల ప్రకారం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 43 మంది మంత్రులు ఉండవచ్చు. నచ్చిన పోర్ట్ ఫోలియో దక్కకపోతే  కేబినెట్ విస్తరణ మహాయుతి కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని మహా పాలిటిక్స్‎లో ఆసక్తిగా మారింది.