యూసీసీ బిల్ పాసయ్యాక కేసీఆర్ దేశం విడిచి వెళ్లొచ్చు

యూసీసీ బిల్ పాసయ్యాక కేసీఆర్ దేశం విడిచి వెళ్లొచ్చు
ఆయన్ని ఎవరూ ఆపరు : ఎంపీ అర్వింద్​
ముస్లిం ఓట్ల కోసమే బిల్లును వ్యతిరేకిస్తుండు
బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకున్నా బిల్లు పాసైతదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ‘యూసీసీ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్​కు ఇబ్బంది ఉంటే దేశం విడిచి వెళ్లొచ్చు. పాకిస్తాన్ పోవాలనుకున్నా పోవచ్చు. ఆయన్ని ఎవరూ ఆపరు’ అని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘బిల్లుకు మద్దతివ్వాలని మా పార్టీ నేతలు కేసీఆర్​ను కోరుతరు. మద్దతు ఇస్తే సరే, వ్యతిరేకిస్తే ఆయనిష్టం. బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకున్నా ఈ బిల్లు రెండు సభల్లో భారీ మెజారిటీతో పాస్ అవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో అర్వింద్  మీడియాతో మాట్లాడారు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు  పడుతాయనే సమాచారం కేసీఆర్​కు వచ్చిందని, ఆ భయంతోనే ముస్లిం పెద్దలను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మీటింగ్ పెట్టారని అన్నారు. ముస్లిం ఓట్ల కోసమే ఈ బిల్లుకు బీఆర్ ఎస్ మద్దతు ఇవ్వడం లేదన్నారు. కొన్ని చానళ్లను మేనేజ్ చేసి, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కేసీఆర్ పనికిమాలిన ప్రచారం చేసిండని అర్వింద్ ఆరోపించారు.            నిజామాబాద్​లో కవిత లేదా కేసీఆర్ పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.

సీతక్కను ముందు పీసీసీ చీఫ్​ను చేయాలె

ములుగు ఎమ్మెల్యే సీతక్కను ముందు పీసీసీ చీఫ్ ను చేయాలని అర్వింద్​ అన్నారు. రేవంత్ రెడ్డి కంటే సీతక్క సీనియర్ అని పేర్కొన్నారు. ‘అవసరమైతే సీతక్కను సీఎం చేయడం కాదు. సీతక్కనే సీఎం చేస్తామని చెప్పొచ్చు కదా.. అవసరమైతే అనే మాట వాడాల్సిన అవసరం ఏముంది’ అని అర్వింద్ ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో రేవంత్ ఓడితే.. సీతక్క గెలిచారని, ఆమె పాపులర్ లీడర్ అని ఆయన అన్నారు.