తెలంగాణ మద్యం పాలసీని దేశమంతటా అమలు చేస్తరా? : బంగ్లా చైతన్య గౌడ్

తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదంటూ అధికార బీఆర్ఎస్​ ఊదరగొడుతున్నది. తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను కేంద్రం సహా మిగతా రాష్ట్రాలు కాపీ కొట్టి అమలుచేస్తున్నాయని అంటున్నది. బీజేపీ విధానాలతో దేశం నాశనమవుతున్నదని, గుణాత్మక మార్పు రావాలని ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్​అనేక వేదికలపై చెబుతూ వస్తున్నారు. అందుకే టీఆర్ఎస్​ను, బీఆర్ఎస్ గా​ మార్చామని, ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో ముందుకెళ్తామని కోట్ల రూపాయాలతో ప్రకటనలు గుప్పిస్తున్నది. ఇంత వరకూ బాగానే ఉంది. తెలంగాణ మోడల్​ను, విధానాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, మద్యం విధానాన్నీ అమలుచేస్తారా? అనేది సగటు సామాన్యుడి ప్రశ్న. మద్యం ఆదాయంతోనే సంక్షేమం పేరిట పాలన సాగిస్తున్న బీఆర్​ఎస్​ సర్కారు.. దేశమంతటా ఇదే పాలసీని అమలు చేస్తారా? 

మూడు రెట్లు పెరిగిన ఆదాయం

మనతో విడిపోయి నవ్యాంధ్రగా ఏర్పడిన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో జగన్​ సర్కారు మద్యం కట్టడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి పాలనతో పోలిస్తే.. మద్యం విక్రయాలు బాగా తగ్గాయని ఆ రాష్ట్ర సీఎం మొన్నామధ్య మీడియాతో వెల్లడించారు. పక్క రాష్ట్రం మద్యం కట్టడి చేస్తూ.. విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుంటే.. తెలంగాణ సర్కారు మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నది. మద్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్​శాఖ, మద్యం షాపులకు టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు చేయిస్తున్నది. మండలానికి మూడు, నాలుగు వైన్​షాపులు ఉంటే, వాటికి అనధికారికంగా వందల సంఖ్యలో బెల్టు షాపులు నడుస్తున్నాయి. 500 జనాభా లేని గ్రామంలో కూడా 20 బెల్టు షాపుల వరకు కొనసాగుతున్నాయంటే.. మద్యం అమ్మకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2015-–16లో రాష్ట్రానికి మద్యం ద్వారా రూ.12,703 కోట్ల ఆదాయం వస్తే, 2022లో అది దాదాపు మూడు రెట్లు పెరిగి ఏకంగా 34,382 కోట్లకు చేరడం గమనార్హం. ఆదాయం కోసం మద్యం విక్రయాలు పెంచుతున్న ప్రభుత్వం, యువతను, పేద ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తున్నది. ‘వైన్​షాపులు మాత్రమే పెడుతున్నాం.. మేము తాగుమని ఎవర్నీ ప్రోత్సహించడం లేదు’ అని ప్రభుత్వ పెద్ద ఒకరు ఆ మధ్య మాట్లాడారు. మద్యం అందుబాటు బాగా పెరిగినప్పుడు సహజంగానే యువత దానికి ఎక్కువగా ఆకర్షితులవుతారన్న విషయం వారికి తెలియనిది కాదు. 

యువశక్తిపై ప్రభావం

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఎనిమిదేండ్ల నుంచి ఒక్క రిక్రూట్​మెంట్​ చేపట్టని రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆగమేఘాల మీద నోటిఫికేషన్లు వేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని నిరుపేద యువత స్వయం ఉపాధి పొందేందుకు కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకుంటున్నా, ప్రయోజనం ఉండటం లేదు. తెలంగాణ యువ శక్తి ఎలా బలహీనమవుతుందో మొన్నటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 49 శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నట్లుగా తేలింది. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలా చేదుగా ఉంటే,  దేశాన్ని ఉద్ధరిస్తామంటూ బీఆర్‌ఎస్‌ నేతలు బీరాలు పలుకుతున్నారు. తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తామని చెబుతున్న.. గులాబీ నేతలు,మద్యం విధానంపై ఏం చెబుతారు? ఆదాయం కోసం అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పెంచుతారా? అన్నిచోట్లా  జెండా ఎగరేస్తామని చెబుతున్న వీరు.. బెల్టు దుకాణాలనూ ఏర్పాటు చేయిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

- బంగ్లా చైతన్య గౌడ్​, ఎంఏ, ఎంఫిల్