ప్రజాస్వామ్య పందిరికి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రికా వ్యవస్థ నాలుగు స్తంభాల వంటివని చెబుతారు. ముఖ్యంగా మొదటి మూడు వ్యవస్థల మధ్య అధికార సమతూకాన్ని పాటించేందుకు రాజ్యాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంది. కానీ, ఒకదాని పరిధిలో ఒకటి జోక్యం చేసుకుంటున్నట్లు కనిపించిన సందర్భాలు దేశంలో గతంలో తలెత్తకపోలేదు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఆదేశం అలాంటి సందర్భాన్ని మరోసారి మన ముందుకు తెచ్చింది. ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ మంత్రి తగిన అభ్యర్థుల జాబితాను ప్రధాన మంత్రి పరిశీలనకు పంపితే, ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులను రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నారు. అలా కాకుండా, ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (లేదా అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు), సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించాల్సి ఉంటుందని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒకటి ఇటీవల ఆదేశించింది. న్యాయమూర్తలు కె.ఎం. జోసెఫ్, అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృశీకేశ్ రాయ్, సి.టి. రవికుమార్‌లు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ధర్మాసనంలోని మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ జోసెఫ్ తీర్పును రాయగా, మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో ఏకీభవిస్తూ జస్టిస్ రస్తోగి తన తీర్పును విడిగా రూపొందించారు. మొత్తానికి, ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునే వెలువరించింది.
ఏక సభ్య సంఘంగా మొదలై..
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టాన్ని రూపొందించేంత వరకు ఈ విధానాన్ని అమలుపరచాలని జస్టిస్ కె.ఎం.జోసెఫ్ తీర్పు వెలువరించేటప్పుడు ప్రకటించారు. పార్లమెంట్ ఈ అంశంపై తగిన చట్టాన్ని రూపొందించేంత వరకు మాత్రమే కోర్టు ఆదేశం అమలులో ఉంటుంది కాబట్టి అధికార పరిధులకు సంబంధించి దీనిపై ఎక్కువగా గగ్గోలు చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్‌లో నియామకాలకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లను విచారించి సుప్రీం కోర్టు అలాంటి నిర్ణయాన్ని ప్రకటించింది. తగిన చట్టాలు లుప్తమైన సందర్భంలో న్యాయ వ్యవస్థ గతంలోనూ జోక్యం చేసుకున్న సంగతిని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. నియామకాల్లో కోర్టు నేరుగా తలదూర్చడం శాసన వ్యవస్థ అధికార పరిధిలోకి తలదూర్చడమవుతుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. ఇదొకరకంగా శాసన వ్యవస్థ పరిధిలోకి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే అవుతుందని, సమతూకం దెబ్బతింటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందంటే.. నిజానికి, 1950 అక్టోబర్15న ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేసినపుడు అది ఏక సభ్య సంఘంగానే ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక్కరే ఉండేవారు. ఈ విధానాన్ని 1989 అక్టోబర్‌లో మార్చారు. ఆర్.వి.ఎస్. పేరి శాస్త్రి సీఈసీగా, ఎస్.ఎస్. ధనోవా, వి.ఎస్. సీగెల్ ఎన్నికల కమిషనర్లుగా ఒక ఎన్నికల సంఘం1989 అక్టోబర్ 16 నుంచి 1990 జనవరి 1 వరకు పనిచేసింది. మళ్లీ 1990 జనవరి 2 నుంచి 1993 సెప్టెంబర్ 30 వరకు ఏక సభ్య సంఘమే పనిచేసింది. తిరిగి 1993 అక్టోబర్ 1 నుంచి అది ముగ్గురు సభ్యుల కమిషన్‌గా మారింది.
శేషన్ ప్రభావం
ప్రధాన ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ ఎన్నికల కమిషన్ నిర్భయంగా పనిచేస్తే ఎలాంటి ప్రభావాన్ని చూపగలదో దేశ ప్రజలకు తెలియజెప్పారు. ఎన్నికల కమిషన్‌కున్న స్వతంత్ర ప్రతిపత్తిని చాటి చెప్పారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉలిక్కిపడేట్లు చేసింది. ఎన్నికల కమిషన్ తలచుకుంటే ఇన్ని అక్రమాలను అరికట్టగలదా అని ప్రజలు సంతోషించారు. కానీ, పి.వి. నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను తిరిగి త్రిసభ్య సంఘంగా మార్చాలని 1993 అక్టోబర్ 1న నిర్ణయించింది.1991 నాటి ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల (సర్వీసు పరిస్థితుల) చట్టాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా సవరించింది. ఫలితంగా, ఆ చట్టం పేరు ఎన్నికల కమిషన్ (ఎలక్షన్ కమిషనర్ల సర్వీసు పరిస్థితులు, లావాదేవీల చట్టం 1991) గా మారింది. శేషన్‌కు ఎం.ఎస్. గిల్, జి.వి.జి. కృష్ణమూర్తిలు తోడయ్యారు. ఆర్డినెన్స్ ద్వారా సీఈసీతోపాటు మిగిలిన ఇద్దరు కమిషనర్లకు సమాన ప్రతిపత్తి లభించింది. మొత్తం ముగ్గురికీ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల హోదా కల్పించారు. ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య సంఘంగా మార్చడాన్ని తన అధికారాలకు కత్తెర వేయడంగా భావించిన శేషన్, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు. అయితే, సుప్రీం కోర్టు శేషన్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ ముగ్గురు సభ్యులున్నదిగా కొనసాగుతోంది.
కమిషనర్లు పెరగడంపై..
ఒకరికి ముగ్గురవడం కిరికిరికి దారితీస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఉల్లంఘనలను నిర్ణయించేందుకు 2019 మే నెలలో నిర్వహించిన సమావేశాలకు ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా గైర్హాజరయ్యారు. తన “మైనారిటీ నిర్ణయాలు నమోదుకు నోచుకోవడం లేదు” అని ఆయన కినుక వహించారు. రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, నియమించదలచుకుంటే, అటువంటి ఇతర కమిషనర్లను నిర్ణీత కాల వ్యవధులకు నియమించవచ్చని రాజ్యాంగంలోని 324 (2) అధికరణం పేర్కొంటోంది. అంటే, ఒకరికి మించిన కమిషనర్లను నియమించడానికి రాజ్యాంగమే వీలు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి పార్లమెంట్ చేసిన చట్టంలోని నిబంధనలను అనుసరించి రాష్ట్రపతి ఈ నియామకాలు జరపాల్సి ఉంటుందని కూడా ఆ అధికరణం చెబుతోంది. సీఈసీని తొలగించడానికి ఉన్న విధానాన్నే మిగిలిన ఇద్దరు కమిషనర్ల తొలగింపునకు కూడా వర్తింపజేయాలా? అనే అంశం కూడా కోర్టు పరిశీలనకు వచ్చింది. లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండు వంతుల మంది అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తేనే సీఈసీని పదవి నుంచి తొలగించడం సాధ్యమవుతుంది. ముగ్గురు కమిషనర్లకు సమాన నిర్ణయాధికారాలున్నాయి కాబట్టి మిగిలిన ఇద్దరిని కూడా ఏకపక్షంగా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండకూడదన్నది పిటిషనర్ల వాదన. ఎన్నికల కమిషన్‌కు నిధులు సమకూర్చే అంశాన్ని కూడా కోర్టు పరిశీలించింది. ఎన్నికల కమిషన్‌కు ఒక శాశ్వత సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ఖర్చులను సంచిత నిధి నుంచి ఇచ్చేటట్లు చూడాలని కోర్టు పేర్కొంది.
ఫిర్యాదులు
ఎన్నికల కమిషన్‌లో ఆరేండ్లు పూర్తి కాలం పనిచేసే విధంగా కమిషనర్లను నియమించడం లేదని, కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ వయసుకు చేరుకుంటారనే వారిని నియమిస్తోందని ఒక ఫిర్యాదు వినవస్తోంది. ఎన్నికల కమిషనర్లు 1950లలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉండేవారు. యూపీఏ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో ఆరుగురు సీఈసీలను నియమించింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 నుంచి 2022 వరకు ఏడేండ్లలో ఎనమండుగురు సీఈసీలను నియమించింది. కాబట్టి ఎన్నికల కమిషనర్లుగా నియమించడానికి యోగ్యులైన అభ్యర్థుల పేర్లను ఏ అంశాల ప్రాతిపదికన కుదిస్తున్నారో కూడా ప్రజలకు వెల్లడవ్వాలి. ప్రజాస్వామ్యంలో చట్టసభలదే పైచేయి కాబట్టి ఎన్నికల కమిషనర్ల నియామకం పారదర్శకంగా, ముక్కుసూటిగా జరిగేట్లు పార్లమెంట్ ఒక చట్టాన్ని తేవాలి.
కాంగ్రెస్ నిర్వాకం
ఎన్నికల సంఘంలో ఒకరికి ఇద్దరిని తోడు చేసిన నిర్వాకం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1989 అక్టోబర్ 16న మరో ఇద్దరు కమిషనర్లను నియమించి దాన్ని బహుళ సభ్యుల సంఘంగా మార్చింది. తొమ్మిదో సార్వత్రిక ఎన్నికలు మొదలవడానికి కొద్ది ముందు తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలపాలైంది. అప్పటి సీఈసీ పేరి శాస్త్రికి చెక్ పెట్టేందుకు, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేసే విషయంలో రాజీ పడేట్లు చేయడానికి రాజీవ్ ప్రభుత్వం అలాంటి చర్యకు ఒడిగట్టిందనే విమర్శలు వెల్లువెత్తాయి. సజావుగా నడుస్తున్న వ్యవస్థను కాంగ్రెస్ అనవసరంగా కెలికింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రధాని వి.పి. సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం నిబంధనలను సడలించి, ఎన్నికల కమిషన్‌ను మళ్లీ ఏక సభ్య సంఘంగా మార్చింది.
పనితీరే ప్రధానం
ఎన్నికల కమిషనర్లు ఎంతకాలం పదవిలో ఉన్నారన్నది ప్రధానం కాదు ఎంత ప్రభావశీలంగా పనిచేశారనేదే ముఖ్యం. నిర్భయంగా, నిజాయతీగా పనిచేస్తే శేషన్‌లా మంచి పేరు మూటగట్టుకోవచ్చు. ఏమాటకామాట, ముగ్గురు సభ్యులదైనా, ఒకే సభ్యుడు ఉన్నదైనా ఎన్నికల కమిషన్ మన దేశంలో స్థూలంగా సమర్థంగానే పనిచేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తోంది. కొరడా ఝళిపించడంలో కొద్దిగా వెనుక ముందులుండవచ్చు. ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు కూడా లొసుగులకు అవకాశం లేకుండా త్వరితగతిన నిర్వహిస్తోంది. ఈ విషయంలో మనం కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకన్నా కూడా ముందున్నామనడంలో అతిశయోక్తి లేదు. ఆధార్ కార్డును ఓటర్ల జాబితాకు అనుసంధానపరిస్తే బోగస్ ఓటింగ్ బెడద మరింత తగ్గే అవకాశం ఉంది.
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్