ఇంగ్లాండ్ను మంచు దుప్పటి కప్పేసింది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలతో బిట్రన్ వ్యాప్తంగా మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో ఎటు చూసినా మంచుతో కప్పబడిన ప్రదేశాలే కనిపిస్తున్నాయి. మంచు అందాలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రసిద్ధ ఓవల్ క్రికెట్ గ్రౌండ్ను మంచు కమ్మేసింది. గ్రౌండ్లో పచ్చదనానికి బదులు.. తెల్లదనం దర్శనమిస్తోంది. సీట్లను కూడా మంచు పూర్తిగా కమ్మేసింది. ప్రస్తుతం ఓవల్ క్రికెట్ గ్రౌండ్ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఆకర్షిస్తోన్న మంచు అందాలు..
ఓవల్ గ్రౌండ్ పూర్తిగా మంచుమయమైంది. మైదానంలో ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైన ఓవల్ మైదానంలోని మంచు అందాలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఓవల్ మైదానంలోని మంచు దుప్పటిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.
చివరి టెస్టు ఇక్కడే జరగాలి..
లండన్‌లోని కెన్నింగ్‌టన్‌లో ఉన్న ఓవల్ క్రికెట్ స్టేడియాన్ని 1845లో నిర్మించారు. అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా కొనసాగుతోంది. 1880లో తొలి అంతర్జాతీయ టెస్టుకు ఓవల్ గ్రౌండ్ ఆతిథ్యమిచ్చింది. ఈ స్టేడియంలో 23,500 మంది కూర్చోవచ్చు. ఇక ప్రతి సీజన్‌లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఇక్కడే ఆడుతుంది.