కాశ్మీర్లో ఆకట్టుకుంటున్న మంచు అందాలు

ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కమ్మేసింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్‌ సహా పలు ప్రాంతాలు సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. ఎటు చూసినా గుట్టలుగా మంచు పేరుకుపోయింది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లను తెల్లటి మంచుతో  కప్పేసింది.

పాల నురగలాంటి మంచు అందాలు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. హిమ కాశ్మీరాన్ని చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. చెట్లు, ఇండ్లపై పడిన మంచుతో ఆ ప్రాంతమంతా శ్వేతవర్ణంగా మారిపోయింది. అటు కాశ్మీర్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అటు ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం గంగోత్రి ఆలయాన్ని మంచుదుప్పటి కప్పేసింది. ఆలయ పరిసరాల్లో ఎటు చూసిన  హిమపాతమే కనిపిస్తోంది.