సీఎం కేసీఆర్పై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. గాలి మాటలు చెప్పడం మినహా జనం కోసం ఏం చేయలేదని అన్నారు. రైతులు ఆగమైనా నయాపైసా చేయని కేసీఆర్.. వారి పేరుతో రాజకీయం చేయడాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
"అకాల వర్షాలకు గోదారి ఉగ్రరూపం దాల్చితే.. అధికారికంగానే 26వేల కుటుంబాలు ఆగమైతే.. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగితే.. వేలాది ఇండ్లు వరదల్లో కొట్టుకుపోతే.. గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పాడ"ని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. "కారులో వచ్చి కారు కూతలు కూశాడు దొర" అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. "ఇది క్లౌడ్ బరస్ట్ అని.. విదేశీ కుట్ర" అని జనం చెవుల్లో పువ్వులు పెట్టాడని ఆరోపించారు.
వరద బాధితులకు 2వేల ఇండ్లు.. గోదావరి కరకట్టకు రూ.వెయ్యి కోట్లు.. ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు.. భద్రాచలం జిల్లాకు రూ.2.30కోట్లు.. భూపాలపల్లికి రూ.2కోట్లు.. మహబూబాబాద్ కు రూ.1.5కోట్లు.. అంటూ మాటలతో కోటలు కట్టాడు తప్పితే..ఆరు నెలలైనా ఒక్క రూపాయి ఇవ్వలేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. "వరదల్లో వేలాది మంది రైతులు ఆగమైనా.. నయా పైసా సాయం చేయని దొర.. కిసాన్ పేరు చెప్పి రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలె" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట గెలవనోడు, రచ్చ గెలుస్తాడట... నీ మాటల మూటలు.. హామీల కోటలను జనం మర్చిపోర"న్న షర్మిల... రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.