ప్రభుత్వం, కార్మికుల మధ్య నలిగేది జనమే!

తెలంగాణ ప్రభుత్వం ‘పట్టు వీడేది లేదు. మెట్టు దిగేది లేదు. కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేది  లేనే లేదు’ అని తేల్చి చెప్పేసింది. కొత్త వాళ్లను నియమించుకోవడానికి రెడీ అయింది. ఇటు కార్మికులు కూడా  ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని తెగేసి చెప్తున్నారు. ‘నెల రోజుల గడువు ఇచ్చినా ఉలుకుపలుకు లేకుండా ఇప్పుడు తమను తప్పుబట్టడం ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. నిజమే మరి. అయితే పండగ పూట జనం ఊళ్లకు వెళ్లకుండా సమ్మె చేసి బస్సులు ఆపుతారా? వీటి గురించి సమాజం చర్చిస్తోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సమిధలు అవుతున్నదెవరు.? ముమ్మాటికీ ప్రయాణికులే. ఇప్పుడే కాదు, ఎప్పుడు సమ్మె జరిగినా ఇబ్బందులు పడేది జనాలే.  ఆర్టీసీ చరిత్రలో గతంలోనూ చాలా సమ్మెలు జరిగాయి.  కానీ, ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఏ ప్రభుత్వమూ చెప్పలేదు.  కార్మికులు, యాజమాన్యం ఏదో పాయింట్ వద్ద ఒప్పందం చేసుకునేవారు. సీజన్​లో సమ్మెకు దిగితేనే ప్రభుత్వంపై ఒత్తిడి ఉంటుందని కార్మికులు భావించినట్లుంది. అందువల్లనే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని తెలిసినా కూడా సమ్మెకు వెళ్లినట్లు అర్థం అవుతున్నది.  ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన కార్మికులది తప్పైతే… కళ్ల ముందు ఇన్ని జరుగుతున్నా…… పట్టించుకోని ప్రభుత్వానిది అంతకంటే పెద్ద తప్పనేది ప్రజలు అనుకుంటున్న మాట.

మూడు రోజుల సమ్మె కాలంలో ప్రయాణీకుల నెత్తిన పెద్ద బండ పడింది. దసరాకి ఊరెళ్దామనుకున్నవారు  రెట్టింపు చార్జీలు వదిలించుకున్నారు. ప్రయివేటువాళ్లకు ఆర్టీసీని అప్పగిస్తే చార్జీల భారం ఇలాగే ఉంటుందన్న భయం ప్యాసింజర్లలో ఉంది. ఒకప్పుడు ప్రయివేటు హాస్పిటళ్లు వస్తే చాలా బావుంటుందని… రోగం ఎంతటిదైనా ఇట్టే  గుర్తించి టక్కున చికిత్స చేస్తారని అనుకున్నారు.  కానీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యానికి తమ సంపాదనలో సగం పెట్టాల్సి వస్తోందని అనుభవంలో తెలిసొచ్చింది.  అయినాగానీ, ‘ఆర్టీసీని ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తాం.. లాభాల్లోకి తెస్తాం’ అంటున్నారు కేసీఆర్​. ప్రైవేటువాళ్లకు ఇస్తే లాభాలు తప్పకుండా వస్తాయనే గ్యారెంటీ ఏమీ లేదు. ప్రయాణికులపై అదనపు భారాలు వేయకుండా లాభాలు రావు కదా! అయినా కార్మికులు అడుగుతున్నది ఖాళీలు భర్తీ చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే!. ఎంతైనా ఖర్చు పెట్టి ఏ.పి.లో ఉన్న బీడు భూములకు నీళ్లిచ్చి రత్నాల సీమ చేస్తామని చెబుతున్న సీఎంకి…  సొంత  రాష్ట్రంలోని కార్మికులు, ప్రయాణికుల భవిష్యత్తు గుర్తుకు రావడం లేదు.

పండగ హడావుడిలో ఉన్నందువల్ల ప్రయాణీకులు చార్జీల మోతను, ఆర్టీసీ సమ్మెను, ప్రభుత్వం ఉద్దేశాన్ని పట్టించుకోవడం లేదు. పండగ ముగిశాక జనంలో ఆలోచన మొదలవుతుంది. గతంలో సమ్మెలకు సమాజం నుంచి మంచి మద్దతే  వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమ్మెలు, రాస్తారోకోలు, ధర్నాలు కావాల్సి వచ్చింది. అప్పుడు ప్రశ్నించే హక్కు ఉండాలన్నారు. ఇప్పుడు అదే కార్మికులు న్యాయమైన డిమాండ్లతో సమ్మెకు దిగితే అప్రజాస్వామికం అంటున్నారు!


‑  విఘ్నేశ్వరుడు