14 ఏండ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చిన : కేటీఆర్​

  • తియ్యటి మాటలు చెప్పెటోళ్లను నమ్మొద్దు: కేటీఆర్​
  • సిరిసిల్లలో నామినేషన్ దాఖలు

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్, వెలుగు :  సిరిసిల్ల ప్రజల దయవల్ల గెలిచిన తాను 14 ఏండ్లలో నియోజకవర్గం రూపురేఖలు మార్చానని, ఈసారి కూడా తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత సిరిసిల్ల ప్రజలదేనని మంత్రి కేటీఆర్​ అన్నారు. గురువారం ఆయన సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. నలుగురు అనుచరులతో వచ్చి కేటీఆర్ నామినేషన్ వేశారు. అనంతరం జిల్లా బీఆర్​ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల ప్రజల వల్ల మంత్రి, కేసీఆర్​ వల్ల బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్  అయిన తనకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ 14 ఏండ్లలో సిరిసిల్లను విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీటి రంగాల్లో డెవలప్​ చేశానని చెప్పారు. ‘‘నేను  సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బరిలో ఉంటున్న. కానీ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేయాల్సి ఉన్నందున నియోజకవర్గంలో అందుబాటులో ఉండను. అందువల్ల  నన్ను గెలిపించే బాధ్యత సిరిసిల్ల ప్రజలదే’’ అని కేటీఆర్​ అన్నారు. సిరిసిల్ల ఎమ్యెల్యేగా ఎంత అభివృద్ధి చేశానో ప్రగతి నివేదిక ఇంటింటికీ పంపుతానని తెలిపారు. సిరిసిల్లలో ఓట్లడిగే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని, తియ్యటి మాటలు చెప్పెటోళ్లను నమ్మొద్దని అన్నారు. ‘‘మనమధ్య చిన్న చిన్న అలకలు ఉండవచ్చు.. వాటిని మనమే తేల్చుకుందాం. కానీ, రాష్ట్రాన్ని మాత్రం ఢిల్లీ పెద్దలకు అప్పజెప్పొద్దు’’ అని కేటీఆర్​ తెలిపారు.  

కాంగ్రెస్, బీజేపీ లీడర్లు.. పొర్లు దండాలు పెట్టినా గెలిచేది మేమే

కాంగ్రెస్, బీజేపీ లీడర్లు పొర్లు దండాలు పెట్టినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతుల్లో రెండు పార్టీల లీడర్లు పావులుగా మారారని విమర్శించారు. గురువారం బేగంపేట క్యాంప్ ఆఫీస్​లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ రాసిన ‘‘దారి చూపిన దశాబ్ది” పుస్తకాన్ని కేటీఆర్​ ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్ర ప్రగతి.. దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయమని అన్నారు. ‘దారి చూపిన దశాబ్ది’ పుస్తకంలో ఆంజనేయ గౌడ్ రాష్ట్ర పురోగతిని వివరించడం బాగుందన్నారు. కాంగ్రెస్, బీజేపీల అమానవీయ రాజకీయ నైజాన్ని బహిర్గతం చేశారని విమర్శించారు. రేలారే ప్రసాద్ రచించి.. పాడిన ‘‘గుండెకత్తుకుందమా.. గులాబీ జెండాను..” పాటను కేటీఆర్ ఆవిష్కరించారు.