అమెరికాలోని 50 రాష్ట్రాలలో 7 స్వింగ్ స్టేట్స్కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిచిగాన్, నార్త్ కరోలినా, అరిజోనా, విస్కాన్సిన్, అరిజోనా, నేవాడా.. ఈ ఏడు రాష్ట్రాలలో తీర్పే విజేతను నిర్ణయించే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్నాయి. స్వింగ్ స్టేట్స్ అయిన ఏడు ప్రధాన రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు మాత్రమే కమలా హారిస్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు, మిగతా రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం, భీకర దాడులు,
ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, జీవన వ్యయం, ఇమిగ్రేషన్, ద్రవ్యోల్బణం పెరుగుదల మొదలైనవి ప్రస్తుతం అమెరికా ప్రధాన సమస్యలు. అయితే, ట్రంప్ విజయావకాశాలు కూడా మెరుగయ్యాయి.
అగ్రదేశంగా పేర్కొనే అమెరికా వైపు ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఉత్సాహం నెలకొంది. అమెరికా ప్రెసిడెంట్ రేసులో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన కమలాదేవి హారిస్ అక్టోబర్ 20, 1964న జన్మించారు. కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు, రాజకీయవేత్త, న్యాయవాది. కమలా హారిస్ మొదటి ఆఫ్రికన్– అమెరికన్, మొదటి ఆసియా – అమెరికన్. కాగా, యూఎస్ చరిత్రలో ఆమె గెలిస్తే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలు కమలా హారిస్ అవుతుంది. కమల తల్లి శ్యామల తమిళనాడులో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడగా, తండ్రి హారిస్ జమైకా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డాడు. కమలాహారిస్ చిన్నప్పుడే ఆమె తల్లితండ్రులు విడిపోయారు. ఆమె తల్లి శ్యామలా హారిస్ మానవ హక్కుల కోసం చేసిన అలుపెరగని కృషి కమలా హారిస్‌లో పోరాట పటిమను పెంచింది.
కాలక్రమంలో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిచిన అమెరికా పాలనా యంత్రాంగంలో కీలకమైన ఉపాధ్యక్ష పదవిని కమల కైవసం చేసుకుంది. పట్టుదలతో దేశోన్నత స్థాయిని సాధించగలిగిన శక్తి తనకుందని ఆమె నిరూపించుకుంది. తల్లి శ్యామల పట్టుదల కమలా హారిస్‌కు ఒక పెద్ద పాఠంగా మారి నేడు అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీచేసేందుకు ప్రధాన కారణంగా నిలిచింది. కమలహారిస్ కెరియర్ లాయర్‌గా మొదలైంది. అప్పటి నుంచి హక్కుల కోసం పోరాడే బాధ్యత ప్రజల పక్షాన తీసుకొంది.
ట్రంప్ కూడా పుంజుకున్నట్టు సర్వేల అంచనాఅమెరికా ఎన్నికల విషయంలో రోజురోజుకూ సర్వే సంస్థలు వెల్లడిస్తున్న నివేదికలు రకరకాలుగా మారుతున్నాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో గెలిచి విజయం తను సొంతం చేసుకుంటుందని చెపుతున్నాయి. కానీ, సర్వేలన్నీ ఒకే విధమైన అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా బాగా పుంజుకున్నట్టు కొన్ని సంస్థల సర్వే నివేదికలు తెలుపుతున్నాయి. పలు సర్వేల ఫలితాలను ఒక్కసారి పరిశీలిస్తే స్వల్ప తేడాతో కమలా హారిస్ ముందంజలో ఉన్నా.. ట్రంప్, కమల .. వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఎక్కువగా లేదు. అమెరికా ప్రెసిడెంట్ పదవికోసం వీరిద్దరూ నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీపడుతుండటంతో రసవత్తర రాజకీయ వాతావరణం నెలకొంది.
కమలా హారిస్‌వైపే అమెరికా ‘నోస్ట్రాడామస్’అలన్ లిచ్ట్‌మన్ మొగ్గు
అమెరికా ప్రెసిడెంట్మహిళే అని, ఆమె కమలా హారిస్ అని అమెరికా నోస్టర్ డామస్ గా చెప్పుకునే విశ్లేషకుడు, ప్రొఫెసర్, పొలిటికల్ సైంటిస్ట్, చరిత్రకారుడైన అలన్ లిచ్ట్‌మన్ 13 ప్రధాన అంశాలుగా తీసుకొని తెలియజేయడం జరిగింది. డెమోక్రటిక్ పార్టీలో ఎలాంటి స్కామ్‌లు, సంక్షోభంగానీ లేదని, గెలుపు, ఓటములపై నిర్ణయించే మొత్తం అంశాలు 13 ఉన్నా దానిలో కీలకంగా నిర్ణయించే వాటిలో 9 అంశాలలో డెమోక్రాట్లే ముందున్నారని ఆయన తెలిపారు. తను కీలకంగా తీసుకున్న వివిధ అంశాలలో.. గతంలో ట్రంప్ పాలనను అమెరికా ప్రజలు చూశారని అప్పట్లో ఆయన అప్రూవల్ రేటింగ్ 40 శాతంగా ఉండేది.
ట్రంప్ అంత గొప్పగా ఏం పాలించలేదని ఒక అభిప్రాయాన్ని అలన్ లిచ్ట్‌మన్ తెలియజేశారు. కాగా, భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు అయితే తొలి ఆసియన్ అమెరికన్ గానూ గుర్తింపు పొందుతారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడు అయితే వందేండ్లలో ఒకసారి ఓడిపోయి మరోసారి అధ్యక్షుడైన జాబితాలో ఆయన చేరతారు. ఇలాంటి సర్వేల విషయాలలో 11 సార్లు తను చెప్పినది వాస్తవాలని గతంలో ఫలితాలు నిరూపించాయని లిచ్ట్‌మన్ స్పష్టం చేశారు.
గతంలో తనను వ్యతిరేకించినవారు ఆ తర్వాత కొద్ది రోజులకి తనతో చాలామంది ఏకీభవించారని తెలుపుతూ ట్రంప్ పాలన కన్నా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలన బాగుందని అభిప్రాయాన్ని లిచ్ట్‌మన్ వ్యక్తం చేశారు. గత నెలరోజుల కాలంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో చాలా మార్పులు వచ్చాయని సర్వేలు ఒక కోణంలో తెలియజేస్తున్నాయి. అమెరికా నోస్టర్ డామస్గా ప్రఖ్యాతి చెందిన లిచ్ట్ మన్.. 1973 నుంచి అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో పదిసార్లు అమెరికా అధ్యక్ష స్థానం గురించి ఫలితాలను అలన్ లిచ్ట్‌మన్ ముందుగానే చెప్పితే 9 సార్లు నిజమయ్యాయి.
- డా. చిటికెన కిరణ్ కుమార్