వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సాధారణంగా ఒక దేశంలో అధినేత పదవి కోసం ఎన్నికలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం కొత్త అధినేత ప్రమాణం చేస్తారు. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికలను నవంబరులో నిర్వహిస్తారు. జనవరిలో కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేస్తారు. ఎన్నికలకు, కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి మధ్య 11 వారాల సమయం ఉంటుంది. అధికార బదిలీకి రాజ్యాంగం సూచించిన సమయంతో పోలిస్తే ఇది తక్కువే.
1930లో ఆర్థిక మాంద్యం కారణంగా నేతలు త్వరగా ప్రమాణ స్వీకారం చేయడానికి సమయాన్ని మూడు నెలలకు తగ్గించారు. ఈ మూడు నెలల కాలాన్ని ‘లేమ్ డక్’ గా వ్యవహరిస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి, అతని బృందం.. పరిపాలనకు సిద్ధం కావడానికి చాలినంత సమయం కావాలి. కొత్త పార్టీ తన అజెండాను అమలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్ల ఎన్నికలు ముగిసి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టడానికి మూడు నెలల సమయం పడుతుంది.
మొదటి మంగళవారమే ఓటింగ్..
దేశవ్యాప్తంగా ఒకేరోజు పోలింగ్ నిర్వహించాలని 1845లో చట్టం చేశారు. అయితే, ఆదివారం క్రిస్టియన్లకు ప్రధానమైన రోజు కావడంతో శని, ఆదివారాలను ఓటింగ్‌కు దూరంగా ఉంచారు. బుధవారం రోజు రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి మార్కెట్లకు వెళ్లేవారు. అందుకే, పోలింగ్‌కు మంగళవారం అనుకూలమైనదిగా నిర్ణయించారు. 1875 నుంచి మంగళవారమే పోలింగ్ నిర్వహిస్తున్నారు.