చదువు, నైపుణ్యాల ద్వారానే దేశసంస్కృతి, వారసత్వాలు వెలుగొందుతాయి. ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు. భారత దేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12వ తేదీనాడు జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు.
కాగా, విషయ పరిజ్ఞానానికి నైపుణ్యం తోడైతేనే యువత ప్రతిభ దేశప్రగతికి దోహదపడుతుంది. నైపుణ్యం లేని విద్య సువాసన లేని పువ్వులాంటిది అని గమనించి నేటి యువత విద్య, నైపుణ్యాలను సమాంతరంగా ఒంటపట్టించుకోవాలి.
జాతీయ యువజన దినోత్సవ వేదికగా విద్య ప్రాధాన్యాన్ని వివరించే సదస్సులు, కార్యశాలలు, కమ్యూనిటీ కార్యక్రమాలు, రీడింగ్ హాబిట్‌ను పెంచేవిధంగా పలు కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
విద్యలో రాణించిన యువతను సన్మానించడం, విద్యార్థులకు విద్య ప్రాధాన్య అంశాల్లో పోటీలు నిర్వహించడంలాంటి పలు కార్యక్రమాలు నిర్వహించవచ్చు. నేటి ఆధునిక డిజిటల్ ఏఐ యుగంలో భారత ప్రభుత్వం విద్యా ప్రాధాన్యాన్ని గుర్తించి సర్వశిక్షా అభియాన్, డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్, నూతన విద్యా విధానం- 2000లాంటి పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు.
నేడు భారత్‌లో అక్షరాస్యత రేటు77.7 శాతం మాత్రమే ఉన్నది. మన దేశంలో అక్షరాస్యత రేటు కేరళలో అత్యధికంగా 96.9 శాతం, అత్యల్పంగా బీహార్‌లో 61.8 శాతం నమోదు అవుతున్నది. తెలంగాణలో 72.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 66.8 శాతం అక్షరాస్యత రేటు నమోదైంది. ప్రపంచ అత్యుత్తమ 1000 యూనివర్సిటీల్లో భారత్‌కు చెందిన 91 యూనివర్సిటీలు మాత్రమే ఉండడం విచారకరం.
యువభారతం నిరుద్యోగంతో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నది. గుణాత్మక విద్యను త్యాగం చేస్తూ పరిమాణాత్మక మెరుపులకే మురిసిపోతున్న భారతీయ విద్యా వ్యవస్థను పట్టాలపైకి తీసుకురావలసిన సమయం ఆసన్నమైంది.
యువ భారతానికి డిజిటల్ మెరుగులు దిద్ది, నైపుణ్యం నేర్పి అంతర్జాతీయ స్థాయి టెక్నోక్రీట్స్, సైంటిస్టులు, అధ్యాపకులు, పలురంగాల్లో శాసించగల మేధావులను తయారుచేసే నూతన గుణాత్మక విద్యావిధానం కావాలి. ప్రభుత్వాలు ఆ దిశలో పటిష్ట అడుగులు వేయాలని కోరుకుందాం.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి