దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా వంటి చాలా రాష్ట్రాలలో ప్రభుత్వం మంత్రుల ఆదాయపు పన్ను చెల్లించుట మానివేశాక..ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కేబినెట్ హోదా కలిగిన వారందరూ తమ ఆదాయపు పన్ను తామే చెల్లించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 మంది కేబినెట్ ర్యాంకు కలిగిన వారు ఉన్నారు. వీరందరి ఆదాయపు పన్ను ప్రభుత్వమే భరిస్తుంది. ఈవిధంగా కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వీరి జీతభత్యాలు విపరీతంగా పెంచారు. అయితే ఇందుకు సంబంధించిన జీవోలు ఏవీ కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడంతో అంతా గోప్యంగా జరిగిపోతుంది. తాము కట్టిన పన్నులు ఈవిధంగా పాలకులు అనుభవిస్తున్నారన్న సంగతి ప్రజలకు కూడా తెలియడం లేదు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు కేబినెట్ ర్యాంకు గల అందరు ప్రజాప్రతినిధులు, సలహాదారులపై చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ప్రజలకు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉంది.
2016వ సంవత్సరంలో శాసనసభ్యుల పెన్షన్ పెంచుతూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒక శాసనసభ్యుడి పెన్షన్ ఆయన ఒక టర్మ్ లేదా అందులో కొంతభాగం (సంవత్సరా నికి తక్కువ కాకుండా) శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయనకు 30 వేల రూపాయిల పెన్షన్ ఇవ్వాలని అటు తరువాత రెండవ, మూడవ టర్మ్ పనిచేసిన ప్రతి సంవత్సరానికి ఒక వేయి రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఈమధ్య కాలంలో పెన్షన్ పెంచడం జరిగింది. కానీ, ఈ సమాచారం వెబ్‌సైట్‌లో ఉంచడం లేదు.
శాసనసభ్యుల పెన్షన్, ఎన్ని టర్ములు చేసినా ఒక టర్మ్‌ను పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరముంది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 (1) (బి) ప్రకారం అందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతభత్యాలు ఇతర అలవెన్సుల వివరాలు ప్రజలకు తెలపాలి. ఇప్పుడైనా ప్రభుత్వంలోని అందరూ కేబినెట్ ర్యాంకు కలిగిన అధికారులు తమ జీతభత్యాలు, అలవెన్సులు, ఇతర సదుపాయాలు తమ కార్యాలయం ముందు ఉంచాలి. లేదా సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఆ వివరాలు పత్రికల వారికి విడుదల చేసినా బాగుంటుంది.
వ్రజావ్రతినిధుల ఆదాయపు పన్ను - ప్రభుత్వం భరించడం రాజ్యాంగ విరుద్ధం. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అలాగే సభాపతి, ఉప సభాపతి, ఛీఫ్ విప్ వంటి వారి జీతభత్యాలు, పెన్షన్, ఇతర అలవెన్సులను నిర్ణయిస్తూ 1954లో చట్టం తీసుకురాబడింది. ఈ చట్టంలోని క్లాజ్ (4) సెక్షన్ (3) ప్రకారం వీరి ఆదాయపు పన్ను కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్దేశించడమైంది. తర్వాత కాలంలో ఈ జాబితాలో కేబినెట్ హోదా కలిగిన ఇతర ప్రజాప్రతినిధులను కూడా చేర్చడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకు కలిగినవారు..
1. ముఖ్యమంత్రి
2. ఉప ముఖ్యమంత్రి
3. మంత్రులు
4. అసెంబ్లీలో సభాపతి, ఉప సభాపతి
5. మండలి చైర్మన్, ఉప చైర్మన్
6. కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రభుత్వ సలహాదారులు
7. కేబినెట్ ర్యాంకు కలిగిన కార్పొరేషన్ చైర్మన్‌లు
8. అసెంబ్లీ, మండలిలో విప్‌లు
9. అసెంబ్లీ, మండలిలో ప్రతిపక్షనాయకులు
10. పార్లమెంట్ కార్యదర్శులు
11. ప్లానింగ్ బోర్టు అధ్యక్షులు
2014 నుంచి సుమారు 60 మంది కేబినెట్ ర్యాంక్ కలిగినవారు ఉంటారు. వీరందరికి జీతభత్యాలే కాక రకరకాల అలవెన్సులు, రాయితీలు ఇస్తున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ నివాస బంగళా, లేని పక్షంలో ప్రభుత్వ ఖర్చుతో అద్దె బంగళా, దానిలో ఫర్నీచర్, ఎలక్టిక్ పరికరాలు (ఏసీలు వగైరా) వంటివి అన్నీ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేస్తారు. ఇక ఉచితంగా అతనికి, అతని కుటుంబసభ్యులకు వైద్య సేవలు అందిస్తారు. దేశంలో సరియైన వైద్యసేవలు అందుబాటులో లేవనుకుంటే విదేశాలలో ప్రభుత్వఖర్చుతో వైద్యం చేయించుకోవడం వగైరా ఉంటాయి. 2012 సంవత్సరం నుంచి జీతభత్యాలు కాకుండా రకరకాల పద్దుల కింద పెద్ద ఎత్తున డబ్బు ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.
1. స్పెషల్ అలవెన్సు
2. భోజన అలవెన్సు
3. క్యాంపు ఆఫీసు అలవెన్సు
4. సెక్యూరిటి కారు అలవెన్సు
5. సొంతకారు అలవెన్సు
6. కారుకు కావలసిన ఇంధన అలవెన్సు
7. ఇంటి అద్దె అలవెన్సు
8. నియోజకవర్గ అలవెన్సు
- యం. పద్మనాభరెడ్డి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్