- అక్టోబర్ 2న ఐటీ హబ్ ప్రారంభం
- మరోసారి జాబ్‌మేళా ఏర్పాటు చేస్తం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: ఐటీ జాబ్ కోసం హైదరాబాద్, బెంగళూరుకు పోవాల్సిన అవసరం లేదని, సూర్యాపేటలోనే ఐటీ జాబ్ అవకాశాలు కల్పిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. మంగళవారం సూర్యాపేటలోని మన్నెం సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు. ఉద్యోగాల కోసం 4 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 15 ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు.
390 మందిని ఎంపిక చేసి.. 75 మందిని ఫైనల్ చేశారు. మిగిలిన 315 మంది తుది రౌండ్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌ది అయితే.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన ఘనత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. మహా నగరాలకే పరిమితమైన ఐటీ హబ్‌లను పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చారని కొనియాడారు. సూర్యాపేటలో అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్ ప్రారంభించనున్నామని, ఇక్కడి యువత ఇంటి దగ్గరే ఉండి ఐటీ ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని, మరోసారి జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
సకల సౌకర్యాలతో ఐటీ హబ్
సూర్యాపేట ఐటీ హబ్‌ను సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని, అతి తక్కువ కాలంలోనే 15 కంపెనీల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కంపెనీల సంఖ్య పెరుగుతుందని, హైదరాబాద్‌కు దీటుగా ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు. 24 గంటల భద్రత, ఉచిత రవాణా సౌకర్యం, హై స్పీడ్ ఇంటర్నెట్, ఇలా సకల సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. వచ్చే యేడు వెయ్యి, ఐదేళ్లలో 5 వేల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Also Read : ఖర్చు ఎంతైనా రెడీనా..! ఆశావహులకు తేల్చిచెబుతున్న పార్టీల అధిష్టానాలు
నిరుద్యోగ యువత ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు త్వరలోనే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ , ఏపీలకు వారధిలా ఉన్న సూర్యాపేటలో ఏర్పాటు కానున్న ఐటీ హబ్ రెండు రాష్ట్రాల ప్రజలకు తలమానికంగా నిలువనుందన్నారు.
గవర్నర్‌ది సెల్ఫ్ గోల్
ఇద్దరు ఎమ్మెల్సీలను తిరస్కరించి గవర్నర్ తమిళిసై సెల్ఫ్ గోల్ వేసుకుందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ చెబుతున్న సాకులు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని ఎద్దేవా చేశారు. తమిళిసై గవర్నర్ అయ్యే సమయానికి బీజేపీ పార్టీకి అధ్యకురాలుగా ఉన్నారని గుర్తుచేశారు. బీజేపీ నుంచి గవర్నర్‌గా వచ్చిన ఆమె ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీలను తిరస్కరించడం సమంజసం కాదన్నారు. గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుందని విమర్శించారు.